Home

»

Latest News

లేట్‌గా షో వేసిన‌ పివిఆర్ సినిమాస్‌, కోర్టుకెక్కిన ప్రేక్షకుడు.. చివ‌రికి ఏమైంది.?

Sep 29, 2026 2:39PM

సినిమా చూసేందుకు థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకులకు అక్కడి ప్రకటనలు, ట్రైలర్లు కొంత ఇబ్బంది కలిగిస్తుంటాయి. సినిమా ప్రారంభ సమయం దాటిపోయినా యాడ్స్ కొనసాగుతుండటంతో చాలామంది అసహనం వ్యక్తం చేస్తుంటారు. అయితే హైదరాబాద్‌కు చెందిన ఓ న్యాయవాది మాత్రం ఈ విషయంలో వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదుపై విచారణ జరిపిన కమిషన్.. PVR మల్టీప్లెక్స్‌కు రూ.75 వేల చెల్లించాలని ఆదేశించింది. 

వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌కు చెందిన ఓ న్యాయవాది 2025 జూన్ 20న రాత్రి 10.35 గంటలకు ‘కుబేర’ సినిమా చూసేందుకు PVRలో రెండు టికెట్లు బుక్ చేసుకున్నారు. నిర్ణీత సమయానికి ముందే థియేటర్‌కు చేరుకుని సీట్లో కూర్చున్నప్పటికీ సినిమా వెంటనే ప్రారంభం కాలేదు. దాదాపు 22 నిమిషాల పాటు వాణిజ్య ప్రకటనలు, ఇతర ప్రచార కంటెంట్‌ ప్రదర్శించిన తర్వాత రాత్రి 10.52 గంటలకు సినిమా మొదలైంది. దీంతో సినిమా పూర్తయ్యే సమయం కూడా ఆలస్యమై, ఇంటికి చేరేసరికి మరింత సమయం పట్టిందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

అయితే థియేటర్‌లో ప్రకటనలు ప్రదర్శించడం తమ వ్యాపార హక్కులో భాగమేనని PVR తరఫున వాదన వచ్చింది. మరోవైపు.. ప్రజా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం సామాజిక అవగాహన ప్రకటనలకు నిర్దిష్ట పరిమితి ఉందని ఫిర్యాదుదారు వాదించారు. వాణిజ్య ప్రకటనలను ఆ పరిమితికి మించి ప్రదర్శించడం వల్ల సినిమా ప్రారంభంలో జాప్యం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ వాదనలను పరిశీలించిన వినియోగదారుల కమిషన్‌.. ప్రేక్షకుడికి కలిగిన అసౌకర్యాన్ని పరిగణనలోకి తీసుకుంది. 

ఈ కేసులో కమిషన్ మొత్తం రూ.75 వేల చెల్లించాలని ఆదేశించింది. ఇందులో ఫిర్యాదుదారుడికి కలిగిన అసౌకర్యం, మానసిక ఇబ్బందులకు రూ.20 వేలు పరిహారంగా, న్యాయపరమైన ఖర్చుల కింద రూ.5 వేలు, నిబంధనల ఉల్లంఘనకు రూ.50 వేలను జిల్లా వినియోగదారుల సంక్షేమ నిధికి జమ చేయాలని పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి అనుచిత వ్యాపార పద్ధతులను నిలిపివేయాలని కూడా ఆదేశించింది. 

మొత్తంగా.. థియేటర్‌లో సినిమా ప్రారంభ సమయం, ప్రకటనల వ్యవహారంపై జరిగిన ఈ కేసు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టికెట్‌పై పేర్కొన్న షో సమయాన్ని పాటించడం, ప్రేక్షకుల సమయాన్ని పరిగణనలోకి తీసుకోవడం వంటి అంశాలపై ఈ తీర్పు మరోసారి దృష్టిని ఆకర్షించింది.

 

 

[PVR Fine, PVR Consumer Court, Hyderabad PVR, Movie Delay Fine, PVR Cinema Ads, Kubera Movie, Consumer Court Hyderabad, PVR Multiplex News, Movie Theatre Rules, Consumer Rights India]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com