కన్నడ చిత్ర పరిశ్రమలో ఇటీవల సంచలనం సృష్టించిన చిన్న సినిమా 'ప్రేమద ఊరలి'. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.150 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. స్టార్ హీరోలు, భారీ హంగులు లేకపోయినా మంచి కథ ఉంటే ప్రేక్షకులు సినిమాను ఎంతగా ఆదరిస్తారో ఈ చిత్రం నిరూపించింది. థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చేసింది. నవంబర్ 17 నుంచి కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
కథ విషయానికి వస్తే.. ఒక అందమైన పల్లెటూరిలో తనకున్న పొలాన్ని సాగు చేసుకుంటూ నాగన్న (రంగాయన రఘు) జీవిస్తుంటాడు. భార్య చనిపోవడంతో తన కొడుకు సంతోష్ (శ్రీరామ్)ను అల్లారుముద్దుగా పెంచుతాడు. ఈ విషయంలో అత్తగారు కూడా అతనికి సహకరిస్తుంది. అయితే కొడుకును గారంగా పెంచడం వల్ల సంతోష్ పెద్దగా చదువుకోలేకపోతాడు. తన కొడుక్కి బాగా చదువుకున్న అమ్మాయిని కోడలిగా తీసుకురావాలని నాగన్న ఆశపడుతుంటాడు. మరోవైపు తన చెల్లెలు రాజీ ఆత్మహత్య చేసుకుని చనిపోవడం అతన్ని ఎప్పటికప్పుడు బాధిస్తుంటుంది.
ఆ ఊరిలో నాగన్నను మామయ్య అని పిలుస్తూ చలాకీగా తిరిగే అమ్మాయి వసంత. సంతోష్‌తో కూడా ఆమెకు మంచి చనువు ఉంటుంది. వసంతనే తన కోడలిగా చేసుకోవాలనే ఆలోచన నాగన్నకు ఉన్నప్పటికీ, సంతోష్‌కు మాత్రం పెళ్లి కావడం లేదనే ఆందోళన ఉంటుంది. రైతులకు పిల్లనివ్వడానికి చాలామంది ఇష్టపడకపోవడం, కొడుకు పెద్దగా చదువుకోకపోవడం ఇందుకు కారణాలు. ఇలాంటి సమయంలో పట్నానికి చెందిన రుక్మిణి అనే అమ్మాయి సంతోష్ కంటపడుతుంది. ఆమెను చూడగానే ఇష్టపడిన అతను, ఆమె వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఇదే సమయంలో తన మనసులో సంతోష్‌పై ప్రేమ ఉందని తెలుసుకున్న వసంత కూడా అతనికి తన ప్రేమను చెప్పాలనుకుంటుంది.
ఇలాంటి పరిస్థితుల్లో తండ్రితో కలిసి ఒక పెళ్లికి వెళతాడు సంతోష్. అక్కడ పెళ్లి సంబంధం చెడిపోవడంతో పెళ్లి పీటలపై ఉన్న రుక్మిణిని చూసి ఆశ్చర్యపోతాడు. వెంటనే ఆమె మెడలో తాళి కట్టి ఇంటికి తీసుకొస్తాడు. అయితే ఆ తర్వాతే రుక్మిణి గురించి ఒక కీలకమైన విషయం అతనికి తెలుస్తుంది. అసలు రుక్మిణి గతం ఏమిటి? ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత సంతోష్ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి? తన ప్రేమ దక్కలేదనే బాధతో వసంత ఏం చేస్తుంది? నాగన్న కుటుంబంలో ఆడవాళ్లకు చోటు లేదనే ప్రచారానికి తెరపడుతుందా? అనేది మిగతా కథ.
ఇది కూడా చదవండి: ధోనీ గురించి బాలయ్య ఏమన్నారంటే? వైరల్ అవుతున్న వీడియో.!
దర్శకుడు మనోజ్ కుమార్ ఈ కథను పల్లెటూరి నేపథ్యంలో చాలా సహజంగా నడిపించాడు. ముఖ్యంగా నాగన్న, సంతోష్ మధ్య తండ్రీకొడుకుల అనుబంధాన్ని చూపించిన సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. సంతోష్ స్నేహితులతో కలిసి చేసే సందడి, వసంత ప్రేమ, రుక్మిణిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకురావడం వంటి అంశాలతో ఫస్టాఫ్ సరదాగా సాగుతుంది. పెళ్లి తర్వాత సంతోష్, రుక్మిణి మధ్య చోటుచేసుకునే పరిణామాలతో సెకండాఫ్ ఎమోషనల్‌గా మారుతుంది. ప్రత్యేకంగా విలన్ అంటూ ఎవరూ లేకపోయినా కథలో ఆసక్తి తగ్గకుండా దర్శకుడు జాగ్రత్తపడ్డాడు.
సాంకేతికంగా కూడా ఈ సినిమా బాగుంది. రాజ్ కాంత్ సినిమాటోగ్రఫీ, గ్రామీణ వాతావరణాన్ని అందంగా చూపించిన లొకేషన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సునాద్ గౌతమ్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం కథకు మరింత బలాన్ని ఇచ్చాయి. హర్షిత్ ప్రభు ఎడిటింగ్ కూడా మెప్పిస్తుంది. అయితే క్రికెట్ మ్యాచ్ ఎపిసోడ్ నిడివి కాస్త తగ్గించి ఉంటే బాగుండేది. ప్రధాన పాత్రల్లో నటించిన శ్రీరామ్, రంగాయన రఘు, తపస్విని పూనాచా, రమిక శివు తమ పాత్రలకు న్యాయం చేశారు. మొత్తంగా సహజమైన కథ, కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలతో సాగే ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది.
మీకు నచ్చవచ్చు:
మళ్లీ విలన్‌గా గోపీచంద్.. జయం, వర్షం రోజులు గుర్తొస్తాయా?
ఆకాశంలో ఒక తార ఫస్ట్ రివ్యూ వచ్చేసింది: దుల్కర్ మరో హిట్ అందుకున్నాడా!
[PremadaOorali, OTT, AmazonPrime, KannadaMovie, PremadaOoraliRating]






