Home

»

Latest News

‘స్పిరిట్’ ఊచకోతకు మాస్టర్ ప్లాన్.. వింటేజ్ ప్రభాస్‌ను చూపించబోతున్న సందీప్ రెడ్డి!

Jun 22, 2026 5:46PM

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) గత కొన్ని సంవత్సరాలుగా భారీ బడ్జెట్, గ్రీన్ మ్యాట్లు, స్టూడియోలు, విపరీతమైన సీజీఐ హంగులతో కూడిన సినిమాలే ఎక్కువగా చేస్తూ వస్తున్నారు. అయితే, ఈ పంథాకు పూర్తిగా బ్రేక్ వేస్తూ ఒక రా అండ్ రియలిస్టిక్ వరల్డ్‌లోకి ప్రభాస్‌ను తీసుకువెళ్లేందుకు రెడీ అయ్యారు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ డ్రామా 'స్పిరిట్' (Spirit) ప్రభాస్ కెరీర్‌లోనే ఒక టోటల్ రీసెట్ లాంటిదని ఇండస్ట్రీ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. 

ఎలాంటి స్టూడియో సెట్టింగులు లేకుండా, సహజసిద్ధమైన రియల్ లొకేషన్లలో ఈ సినిమాను రూపుదిద్దుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన కీలకమైన షెడ్యూళ్లను హైదరాబాద్‌లోని విమల్ థియేటర్, బాలానగర్, హైటెక్ సిటీ వంటి బిజీ ఏరియాల్లోని వీధుల్లో అత్యంత పక్కాగా షూట్ చేశారు. అంతేకాకుండా, నేరస్థుల వేట నేపథ్యంలో సాగే ఒక పవర్‌ఫుల్ అండ్ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌ను హైదరాబాద్‌లోని చంచల్‌గూడ సెంట్రల్ జైలు కాంప్లెక్స్‌లో రీసెంట్‌గా చిత్రీకరించి ఈ షెడ్యూల్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముగించారు.

సందీప్ రెడ్డి వంగా సాధారణంగానే తన సినిమాల్లో క్యారెక్టరైజేషన్లను ఎంతో రాగా, వైలెంట్‌గా చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే 'స్పిరిట్' సినిమా కోసం ఆయన ఒక అసాధారణమైన ప్లాన్‌ను సిద్ధం చేశారు. సాధారణంగా ఇలాంటి భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను పూర్తి చేయడానికి వందల రోజులు పడుతుంది. కానీ క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా కేవలం 95 రోజుల్లోనే ఈ సినిమా మొత్తం షూటింగ్‌ను కంప్లీట్ చేయాలని సందీప్ రెడ్డి వంగా టైట్ షెడ్యూల్ లాక్ చేయడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ 95 రోజుల పక్కా ప్లానింగ్ కోసం సీన్లు, డేట్లు, రియల్ లొకేషన్లను ముందే ఖరారు చేశారు. 

ఈ చిత్రంలో ప్రభాస్ ఒక అత్యంత శక్తివంతమైన ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇటీవల విడుదల చేసిన 'స్పిరిట్ మేహెమ్' పోస్టర్‌లో ప్రభాస్ చేతులకు తెల్లటి బ్యాండేజ్ కట్టి ఉన్న విజువల్స్ చూస్తేనే, ఈ సినిమాలో సందీప్ రెడ్డి మార్క్ ఇంటెన్స్ వైలెన్స్ ఏ రేంజ్‌లో ఉండబోతోందో అర్థమవుతోంది. లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్లలో చూసి అలవాటు పడిన ఫ్యాన్స్‌కు, ఒక పక్కా లోకల్ గ్రౌండెడ్ జోన్ లో వింటేజ్ ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్‌ను ఈ సినిమా ద్వారా మళ్లీ తీసుకురాబోతున్నారు.

ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను టీ-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బాలీవుడ్ బ్యూటీ తృప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఇప్పటికే మ్యూజిక్ వర్క్స్ ప్రారంభించారు. 'స్పిరిట్' సినిమాను 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. భారీ గ్రాఫిక్స్ హంగులు లేకపోయినా కేవలం సందీప్ రెడ్డి వంగా మార్క్ ఎమోషన్, ప్రభాస్ ఊరమాస్ లుక్స్ తోనే ఈ సినిమా థియేటర్లలో సరికొత్త ఊచకోత కోయడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com