Home

»

Latest News

అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ మెసేజ్.. ప్రభాస్ ‘బాహుబలి’ క్లిప్‌తో వార్నింగ్!

Sep 28, 2026 6:16PM

ప్రభాస్ హీరోగా ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమా మరోసారి అంతర్జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచింది. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం తన సోషల్ మీడియా ఖాతాలో ‘బాహుబలి: ది బిగినింగ్’లోని ఓ యాక్షన్ సన్నివేశాన్ని షేర్ చేసింది. కాలకేయుల సైన్యంతో అమరేంద్ర బాహుబలి పోరాడే సన్నివేశాలతో ఉన్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోకు ఇరాన్ రాయబార కార్యాలయం తన దేశ వైఖరిని తెలియజేసే సందేశాన్ని జత చేసింది. ఇటీవల ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. తమ దేశం ఎట్టి పరిస్థితుల్లోనూ తలవంచబోదని పేర్కొంది. బాహుబలి కాలకేయుల సైన్యాన్ని ఎదుర్కొన్న విధంగానే తమ మాతృభూమి కోసం తాము కూడా త్యాగాలకు సిద్ధంగా ఉన్నామని సందేశం ఇచ్చింది.

సెప్టెంబర్ 23న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో మాట్లాడిన పెజెష్కియాన్.. అమెరికా ఒత్తిడికి ఇరాన్ లొంగిపోదని పేర్కొన్నారు. అదే సమయంలో చర్చలు, దౌత్య మార్గాలకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే ఒత్తిడి లేదా బలప్రయోగాన్ని అంగీకరించబోమని ఆయన చెప్పినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే ఇరాన్ రాయబార కార్యాలయం ‘బాహుబలి’ యుద్ధ సన్నివేశాన్ని తమ సందేశానికి ప్రతీకగా ఉపయోగించినట్లు తెలుస్తోంది.

ఇరాన్ సోషల్ మీడియా కోసం తెలుగు సినిమాను ఉపయోగించడం ఇదే తొలిసారి కాదు. ఇటీవల బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’లోని యాక్షన్ సన్నివేశాన్ని కూడా ఇరాన్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఇప్పుడు ప్రభాస్ ‘బాహుబలి’ క్లిప్‌ను ఉపయోగించడంతో మరోసారి తెలుగు సినిమా సన్నివేశం అంతర్జాతీయ రాజకీయ సందేశంలో భాగంగా మారింది. దీంతో ప్రభాస్ అభిమానులతో పాటు సినీ వర్గాల్లోనూ ఈ పోస్టుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

 

 

[Prabhas Baahubali, Iran Embassy Baahubali Video, Iran US Tensions, Baahubali Viral Video, Prabhas Latest News, Baahubali Battle Scene, Iran Embassy Hyderabad, Masoud Pezeshkian, SS Rajamouli, Baahubali The Beginning]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com