
మార్చిలో `రాధే శ్యామ్`, ఏప్రిల్ లో `బీస్ట్` - `ఆచార్య`, మేలో `ఎఫ్ 3` (ఐటెమ్ సాంగ్).. ఇలా వరుసగా మూడు నెలల పాటు వెండితెరపై సందడి చేసి అభిమానుల్లో జోష్ నింపింది బుట్టబొమ్మ పూజా హెగ్డే. కట్ చేస్తే.. ఈ ఏడాది చివరలో కేవలం వారం రోజుల వ్యవధిలో బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్ తో ఎంటర్టైన్ చేయనుంది ఈ గ్లామర్ క్వీన్.
ఆ వివరాల్లోకి వెళితే.. రణ్ వీర్ సింగ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి `సర్కస్` పేరుతో ఓ హిందీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రణ్ వీర్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ కామెడీ డ్రామాలో పూజా హెగ్డే, జాక్వలైన్ ఫెర్నాండెజ్ కథానాయికలుగా దర్శనమివ్వనున్నారు. కాగా, ఈ చిత్రాన్ని 2022 క్రిస్మస్ స్పెషల్ గా డిసెంబర్ 23న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక `సర్కస్` రిలీజైన వారం తరువాత అంటే డిసెంబర్ 30న పూజా హెగ్డే నటిస్తున్న మరో బాలీవుడ్ ప్రాజెక్ట్ థియేటర్స్ లోకి రానుంది. ఆ సినిమానే.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న `కబీ ఈద్ కబీ దివాళి`. పర్హాద్ సామ్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో విక్టరీ వెంకటేశ్ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. మరి.. ఈ సంవత్సరాంతంలో వారం వ్యవధిలో వస్తున్న `సర్కస్`, `కబీ ఈద్ కబీ దివాళి`తో పూజా హెగ్డే ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి.






