.jpg)
సర్దార్.. సర్దార్... సర్దార్... సర్దార్..
అభిమానులు పూనకం పట్టినట్టు.. అరుస్తున్న అరుపులు ఇంకా చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయ్. టికెట్ల కోసం రికమెండేషన్లు, వసూళ్లపై బెట్టింగులు, థియేటర్ దగ్గర కటౌట్ల కోసం క్యూలు.. ఇలా ఒకటా రెండా?
శ్రీమంతుడు రికార్డు బద్దలైపోద్ది అనుకొన్నారు. ఇంకొందరైతే బాహుబలి కూడా.. బాలాదూరే అనుకొన్నారు.
ఉగాది ముందు రోజు వరకూ.. సర్దార్‌పై లెక్కలేనన్ని అంచనాలు.. ఆశలు. తెల్లారేసరికి ఆ ఆశలు తెల్లారి అంచనాలు తల్లకిందులైపోయాయి.
పవన్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎగరేద్దామనుకొని చింపిన పేపర్ ముక్కల తాలుకూ.. జ్ఞాపకాలు ఇంకా వెచ్చగా ఉండగానే పవన్ అభిమాని హృదయాలు ముక్కలైపోతున్నాయి. అందరిలోనూ ఒకటే ప్రశ్న.. పవన్ ఇలా ఎందుకు చేశాడని? ఇలాంటి సినిమా ఎందుకు తీశాడని..? ఒక్కసారి అభిమాని అనే కోణంలోంచి బయటకు వచ్చి, సగటు ప్రేక్షకుడిగా సర్దార్ తప్పులు లెక్కేస్తే.. బోల్డన్ని క్యూ కట్టేస్తున్నాయ్.
పవన్ అసలు కథమీద ఏమాత్రం శ్రద్ద చూపలేదు. స్ర్కీన్ ప్లే అంటే ఏమిటో ఓనమాలు కూడా తెలీనట్టు సీన్లు రాసుకొన్నాడు. కొన్ని సన్నివేశాలకు సరైన ప్రారంభం, ముగింపూ ఉండవు. అడ్దదిద్డంగా వచ్చిపడిపోయే సీన్లు.. కోకొల్లలు.
పవన్ అంటే హీరోయిజం. పవన్ నుంచి... అదే ఆశిస్తారు. కానీ.. సర్దార్ మొదలైన పావుగంటకే ఆ హీరోయిజాన్ని రతన్ పూర్ రోడ్డు మీద 30 అడుగుల గోతు తీసి పాతేసే సన్నివేశం ఒకటొస్తుంది. పవన్ రోడ్డు మీద విలన్ గ్యాంగ్ ముందు డాన్సులు చేసే సీన్ చూస్తే... సర్దార్‌పై తొలి గొడ్డలి వేటు పడినంత బాధగా ఉంటుంది. పవన్ ఇలాంటి సీన్లు ఎందుకు చేస్తాడో.. అర్థం కాక సగటు అభిమాని... మౌనంగానే థియేటర్లో రోదిస్తుంటాడు.
పవన్ గొప్ప డాన్సర్ కాదు. కానీ చిన్న చిన్న మూమెంట్స్ వేసినా.. చూడ్డానికి బాగుంటుంది. కానీ పవన్ ఈ సినిమాలో ఏం చేశాడు?? చేపకళ్లు.. చేపకళ్లు అనే పాటని గుర్తు తెచ్చుకోండి. మనస్ఫూర్తిగా ఆ పాటని పాడుతున్నట్టు పవన్ కనీసం అభినయించలేకపోయాడు. నీరసంగ తడబడుతూ అడుగులేసి అదే స్టెప్పులు అనుకోమన్నాడు.
ఇక్కడ ఈ డైలాగ్ చెబితే బాగుంటుంది.. అని పవన్ తనకు తానే అనేసుకొని, సన్నివేశ బలం లేనిచోట, అవసరం లేని చోట కూడా... ఆ డైలాగుల్ని బలవంతంగా ఇరికించేసిన ఫీలింగ్ కలుగుతుంది. నేను ఒక్కడినే.. ఒక్కడినే.. ఎక్కడైనా ఒక్కడిలా ఉంటా. ఒక్కడే ఉంటా. ప్రజల మధ్యన ఉంటా.. అంటూ ఆవేశంగా చెప్పిన డైలాగ్‌లో ఎంత అర్థముందో తెలీదుగానీ. అదో అర్థం పర్థం లేని సన్నివేశమైపోయింది.
సంగీత్‌లో పవన్ స్టెప్పులేసే సీన్ ఇంకా దారుణం. అదేదో గబ్బర్‌సింగ్ అంత్యాక్షరికి సీక్వెల్‌లా ఉంటుందనుకొంటే... మరీ నాశిరకంగా తయారైంది.
సినిమాని పొడిగించానికి తప్ప మరెందుకూ ఉపయోగపడలేదు. 163 నిమిషాల నిడివి ఉన్న సినిమా ఇది. నిజానికి చాలా లెంగ్తీ సినిమా. పవన్ అనుకొంటే కనీసం 30 నిమిషాల సీన్లు లేపేసేవాడు. కానీ... పవన్‌కి ఈ సినిమా ట్రిమ్ చేయమని అడిగే ధైర్యం ఎవరికి ఉంది? నే తీసిందే సినిమా.. చేసిందే యాక్టింగు అనుకొని బలవంతంగా ప్రేక్షకుల మీదకు రుద్దేస్తే ఎలా??
పవన్ ఫైటింగులు చూడాలి. ఒక్కో చేతిలో ఒక్కో గన్ పట్టుకొని కాలుస్తూ ఉంటాడంతే. అది ఫైట్ అనుకోవాలి. ఒక్క ఫైటరు కూడా పవన్ మీద చేయి వేసిన పాపాన పోలేదు. పవన్ షర్టు నలగలేదు. మేకప్ చెదరలేదు. ఇదీ.. ఈనాటి ఫైటింగులు. పవన్‌కి గన్నులంటే అదేం పిచ్చో అర్థం కాదు. ఫైటింగులంటే ఇంతేనా అనిపించేలా ఉన్నాయ్ గబ్బర్ సింగ్‌లో పోరాట దృశ్యాలు.
ఇలా ఒకటా రెండా?? వెదికితే సవాలక్ష లోపాలు. కానీ ఏం చేస్తాం?? బయటకు చెప్పుకోలేం. పవన్ కల్యాణ్ అభిమానులం కదా? ఎంత బాధనైనా మనసులో దాచుకొని.. హిట్.. సూపర్ హిట్ అని అరచి గోల చేయడం తప్ప ఏం చేయగలం?? కనీసం పవన్ అయినా... పెద్ద మనసు చేసుకొని.. ఈ సినిమాని మరోసారి చూసి తప్పెక్కడ జరిగిందో తెలుసుకొంటే.. ఎక్కడ లోపాలున్నాయో అర్థం చేసుకొంటే మరోసారి పవన్ అభిమానులకు, భక్తులకూ ఈ రోదన తప్పుతుంది.






