
పవన్ కల్యాణ్ సినిమా అంటే.. ఆ సంచలనం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పక్కర్లెద్దు. గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది తరవాత... పవన్ మార్కెట్ మరింత విస్ర్కృతమైంది. అత్తారింటికి దారేది తొలి వంద కోట్ల చిత్రంగా టాలీవుడ్‌లో చరిత్ర సృష్టించింది. ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్‌పైనా అన్నే అంచనాలున్నాయి. పోస్టర్లూ, అందులో పవన్ లుక్.... పవర్ స్టార్ ఫ్యాన్స్‌ని మెస్మరైజ్ చేస్తోంది. దానికి తోడు... ఈసినిమా ప్రీ బిజినెస్ కూడా ఓ లెవల్లో జరిగింది. దాదాపు రూ.80 కోట్ల కు ఈ సినిమా అమ్ముడుపోయిందని టాక్. మరి అంతా రాబడుతుందా?? ఈ సినిమా భారీ రేట్లకు కొనుక్కొన్న బయ్యర్ల మాటేంటి?? అన్నది ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పవన్ సినిమా వంద కోట్లు కొడితేగానీ బయ్యర్లు బయటపడలేరు. అయితే సర్దాక్‌కి ఆ స్టామినా ఉంది. పవన్ సినిమా యావరేజ్ టాక్ వచ్చినా జనం చూసేస్తారు. కానీ వంద కోట్టాలంటే మాత్రం సూపర్ హిట్ టాక్ రావాల్సిందే. వేసవి సీజన్‌లో విడుదల కాబోతున్న తొలి భారీ చిత్రం ఇదే. పవన్‌కి ముందూ... ఆ తరవాత పెద్ద సినిమాల జాడ కనిపించకపోవొచ్చు. కాబట్టి పవన్ సోలోగా బాక్సాఫీసుని ఆడేసుకొంటాడు. ఓవర్సీస్‌లో కనీవినీ ఎరుగని రీతిలో సర్దార్ సినిమాని విడుదల చేయాలని టీమ్ భావిస్తోంది.
అక్కడి నుంచి కనీసం రూ.15 కోట్లు రాబట్టాలని ప్లాన్ చేస్తోంది. బెనిఫిట్ షోల రూపంలోనూ భారీగా వసూళ్లు దక్కించుకోవాలన్నది సర్దార్ టీమ్ ప్లాన్. పవన్ సినిమాకి మరో వరం ఏంటంటే. ప్రతీ రోజూ 5 షోలు వేసుకొనే అవకాశం ఉంది. పెద్ద సినిమాలు 5 షోలు వేసుకోవొచ్చని ఇటీవల తెలంగాణ గవర్నమెంట్ ఆమోదముద్ర వేసింది. ఈ అదనపు షోని వాడుకొంటే.. సర్దార్ వసూళ్లలో భారీ మార్పు కనిపించొచ్చు. కాకపోతే.. మండిపోతున్న ఎండలు, టీ 20 వరల్డ్ కప్, పరీక్షలు... సర్దార్ సత్తాకు పరీక్షగా నిలవబోతున్నాయి. ఈ ప్రతికూల పరిస్థితుల నుంచి తేరుకొని పవన్ వంద కోట్లు కొల్లగొడితే అది అద్భుతమే.






