Home

»

Latest News

ఓం ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్: ధనుష్ కెరీర్ లోనే హయ్యెస్ట్!

Nov 21, 2026 10:17AM


సౌత్ సినీ ప్రేమికులంత అదృష్టవంతులు లేరనట్టుగా ధనుష్, మమ్ముట్టి , సాయి పల్లవి,  శ్రీలీల వంటి స్టార్ కాంబో మూకుమ్మడిగా నిన్న' ఓం' తో సెల్యులాయిడ్ పై అడుగుపెట్టారు.  ఈ పాన్ ఇండియా దినుసుల సువాసన ఇన్ క్లూడింగ్  వరల్డ్ మూవీ లవర్స్ కి  కూడా తగిలిందనుకోండి. మరి ఫస్ట్ డే ఎంత రాబట్టిందో చూద్దాం.  

ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, ఈ చిత్రం తొలిరోజు భారతదేశవ్యాప్తంగా  17.70 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టి, ధనుష్ కెరీర్‌లోనే అత్యధిక డొమెస్టిక్ ఓపెనింగ్ సాధించిన చిత్రంగా సరికొత్త చరిత్ర లిఖించింది.   భారతదేశంలో మొత్తం 6,628 షోలతో భారీ స్థాయిలో విడుదలైన ఈ సినిమాకు ప్రాంతీయ భాషల వారీగా అద్భుతమైన స్పందన లభించింది. ముఖ్యంగా తమిళ వెర్షన్ నుంచి  13.35 కోట్లు వసూలు కాగా, తెలుగు రాష్ట్రాల్లో ధనుష్‌కు ఉన్న క్రేజ్ మరోసారి రుజువైంది. సినిమా విడుదలకు ముందు 'ఓం' తమిళ సినిమాతో సమానంగా తెలుగు సినిమా కూడా అని ధనుష్ చెప్పిన మాటలు నిజమయ్యాయి. 

తెలుగు వెర్షన్ మొదటి రోజే  4 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 2.5 కోట్ల షేర్ సాధించి ట్రేడ్ పండితులను ఆశ్చర్యపరిచింది. ఇక హిందీ వెర్షన్ నుంచి  35 లక్షలు తోడవడంతో, తొలిరోజు ఇండియా గ్రాస్ కలెక్షన్లు  20.55 కోట్లకు చేరుకున్నాయి.  కేవలం దేశీయ మార్కెట్‌లోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ 'ఓం' సత్తా చాటింది. అంతర్జాతీయ మార్కెట్లలో మొదటి రోజు ఏకంగా 11 కోట్ల గ్రాస్ వసూలు చేయడంతో, సినిమా మొత్తం వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్లు  31.55 కోట్ల మార్కును తాకాయి. ఈ భారీ వసూళ్లతో ధనుష్ తన పాత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టారు. 

గతంలో ధనుష్ అత్యధిక ఓపెనర్‌గా నిలిచిన 'తేరే ఇష్క్ మే' (రూ. 16 కోట్లు) రికార్డును 'ఓం' అధిగమించింది. అంతేకాకుండా, ఆయన గత చిత్రాలైన 'కుబేర' (రూ. 14.75 కోట్లు), 'రాయన్' (రూ. 13.65 కోట్లు) తొలిరోజు వసూళ్లను సునాయాసంగా దాటేసింది. ఈ ఏడాది విడుదలైన ధనుష్ గత చిత్రం 'కార' (రూ. 6.20 కోట్లు) తో పోలిస్తే, 'ఓం' రెట్టింపు కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టడం విశేషం. 


ఇంతటి భారీ ఓపెనింగ్ రావడానికి ప్రధాన కారణం ఇందులోని భారీ తారాగణం. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి 'బర్మా కార్తికేయన్' అనే క్రూరమైన స్మగ్లింగ్ గ్యాంగ్ లీడర్ గా  నటించడం, సాయి పల్లవి, శ్రీలీల, నసీరుద్దీన్ షా వంటి అగ్ర నటులు భాగం కావడం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే  9 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంది. మొదటి రోజు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, వారాంతంలో థియేటర్లకు ప్రేక్షకుల తాకిడి పెరిగితే  బాక్సాఫీస్ ని తన వశం చేసుకోవడం పెద్ద కష్టమైన పని కాదు.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com