
సంగీత్ శోభన్, సిమ్రాన్ శర్మ జంటగా... సీనియర్ నరేష్, తులసి, 'గెటప్' శీను ప్రధాన, ప్రమీల రాణి (భామ) పాత్రల్లో నటించిన 'జీ 5' ఒరిజినల్ వెబ్ సిరీస్ 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' (OCFS). పింక్ ఎలిఫెంట్స్ పిక్చర్స్ పతాకంపై మెగా డాటర్ నిహారికా కొణిదెల నిర్మించారు. మహేష్ ఉప్పాల దర్శకత్వం వహించారు. ఆయనతో కలిసి మానసా శర్మ కథ, మాటలు అందించారు. మొత్తం ఐదు ఎపిసోడ్స్ గల ఈ వెబ్ సిరీస్ నవంబర్ 19న 'జీ 5' ఓటీటీ వేదికలో విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం రాత్రి ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వరుణ్ తేజ్, వెబ్ సిరీస్ లో 'అరే మహేషా...' పాటను విడుదల చేశారు.
వరుణ్ తేజ్ మాట్లాడుతూ "బహుశా.. ఏడాది క్రితం వెబ్ సిరీస్ చేస్తున్నట్టు నిహారిక చెప్పింది. తనకెప్పుడూ 'ఇది చెయ్, అది చెయ్' అని చెప్పలేదు. నిహారిక వర్క్ లో మేం ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వం. చూసి బావుందో, లేదో చెబుతాం. ఇటీవల ట్రైలర్ చూపించినప్పుడు నిజంగా షాకయ్యా. ట్రైలర్ బావుంది. నాకు సంతోష్ శోభన్ తెలుసు. కానీ, తనకు బ్రదర్ ఉన్నాడని తెలియదు. ట్రైలర్ చూశాక... 'ఈ అబ్బాయి ఎవరు? ఇంత బాగా చేస్తున్నాడు. ఇంతకు ముందు ఎన్ని సినిమాలు చేశాడు?' అని అడిగా. అనుభవం ఉన్న నటుడిలా చేశాడు. నేను ఈ వెబ్ సిరీస్ చూడాలని అనుకోవడానికి గల కారణాల్లో అతడూ ఒకడు. నరేష్ గారి లాంటి ఆర్టిస్ట్ సినిమాలతో పాటు ఓటీటీ ప్రాజెక్టులు చేయడం కొత్తవాళ్లకు చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది. అందరూ సినిమా క్వాలిటీలో ఉందని చెబుతున్నారు. పోను పోనూ సినిమాకు, ఓటీటీకి డిఫరెన్స్ ఉండదు. మనం చూసే మీడియమ్ డిఫరెంట్ అవ్వొచ్చు. సినిమా అంటే థియేటర్లు, ఓటీటీ అంటే ఇంట్లో చూడవచ్చు. ఈ నెల 19న 'జీ 5' ఓటీటీలో 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. అందరూ ఇంట్లో ఫ్యామిలీస్ తో కూర్చుని ఈ 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను" అని అన్నారు.
నిహారికా మాట్లాడుతూ "'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' గురించి చెప్పాలంటే.. ఇదొక కామెడీ ఫ్యామిలీ డ్రామా. నాకు మహేష్ గారు, మానస ముందు చెప్పినప్పుడు... 'మహేష్ గారు! ఇది మీ కథేనా? మీకు లోన్స్ ఉన్నాయా?' అని అడిగేశాను. 'లేవు. నేను చూసిన సంఘటనల నుంచి రాసిన కథ' అన్నారు. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి దర్శకుడు మహేష్, ఆయనతో పాటు కథ రాసిన మానస నిద్ర లేకుండా రేయింబవళ్లు కష్టపడ్డారు. నటుడిగా, వ్యక్తిగా సంగీత్ శోభన్ ను ఇష్టపడనివారు ఉండరు. అతను చాలా టాలెంటెడ్. సూపర్బ్ ఎంటర్టైనర్. తనను స్క్రీన్ మీద చూడటం నాకు ఇష్టం. కీర్తీ పాత్రకు ఎవరు సూటవుతారని చాలా చాలా వెతికాం. ఫైనల్లీ... సిమ్రాన్ శర్మ దొరికింది. తాను చాలా హార్డ్ వర్కర్. నరేష్ గారు వెబ్ సిరీస్ లో ఇప్పటివరకూ చేయలేదు. నా కోసం ఒప్పుకొన్నారు. అలాగే, తులసిగారు. వాళ్లిద్దరితో నేను ఒక సినిమాలో యాక్ట్ చేశా. ఆ చనువుతో అడిగా. తులసిగారు కథ వినకముందే 'నీ కోసం చేస్తా' అని చెప్పారు. నవంబర్ 19న 'జీ 5'లో 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' వచ్చేస్తుంది. మీ అందరికీ చాలా నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని అన్నారు.
సంగీత్ శోభన్ మాట్లాడుతూ "మా ఫస్ట్ పోస్టర్ విడుదల చేసిన నాగబాబుగారికి, టీజర్ విడుదల చేసిన నానిగారికి, ట్రైలర్ విడుదల చేసిన నాగార్జునగారికి థాంక్స్. ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన వరుణ్ తేజ్ గారికి థాంక్స్. ఇవన్నీ మీకు చిన్న విషయాలు అయ్యి ఉండొచ్చు. కానీ, మాకు పెద్ద విషయం. మీలాంటి పెద్దవాళ్లు సపోర్ట్ చేస్తేనే మేం 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' చెప్పగలం. నేను 'గోల్కొండ హై స్కూల్'లో చైల్డ్ ఆర్టిస్టుగా చేసినప్పటి నుంచి నిమ్మకాయల ప్రసాద్ గారు నాకు పరిచయం. నా పేరును నిహారికగారికి ఆయనే సజస్ట్ చేశారు. ఆడిషన్ చేసి నచ్చితే తీసుకోమని చెప్పారు. ఆ ఒక్క ఆడిషన్ వల్ల నేను చాగా చేస్తున్నాని చాలామంది ఫోనులు చేశారు. ఆయనకు చాలా నేను రుణపడి ఉంటాను. 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ'ని అందరూ సినిమా అనుకుంటున్నారు. ఇది వెబ్ సిరీస్ అయినా మేం సినిమాలా చేశాం. నిహారిక గారు కథను ఎంతగానో నమ్మారు. ఒక సినిమాకు ఏమాత్రం తక్కువ కాకుండా నిర్మించారు. ఆవిడ అనుకుంటే పెద్దవాళ్లను తీసుకోవచ్చు. కానీ, నా మీద నమ్మకం పెట్టుకుని తీసుకున్నారు. ఆవిడ నమ్మకాన్ని నిలబెట్టానని అనుకుంటున్నాను. నిహారిక గారికి చాలా రుణపడి ఉంటాను. నేను బాగా నటించానని అనిపిస్తే... డైరెక్టర్ మహేష్, రైటర్ మానస కారణం. నన్ను అంత బాగా వాళ్లు గైడ్ చేశారు. నరేష్ గారు, తులసి గారు, సిమ్రాన్, గెటప్ శీను... అందరితో నటించడం ఎంజాయ్ చేశాను." అని అన్నారు.
డైరెక్టర్ మహేష్ ఉప్పాల మాట్లాడుతూ "మాది ఒక చిన్న ఊరు కొడకండ్ల. అసలు, సినిమాకు సంబంధం లేదు. అటువంటి వాడిని ఇక్కడ నిలబడ్డానంటే ఒకే ఒక్క కారణం నిహారిక గారు. ఆవిడకు థాంక్యూ సో మచ్. నేను అనే కాదు, ఇక్కడ ఉన్న చాలామంది కొత్తవాళ్లను ఎంకరేజ్ చేశారు. నిహారిక ఫస్ట్ స్టెప్ తీసుకున్నారు కాబట్టే నవంబర్ 19న 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పెద్ద పెద్ద సినిమాలకు పని చేసిన వాళ్లను తీసుకున్నారు. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయి. తల్లితండ్రులకు చెప్పకుండా ఉద్యోగానికి రాజీనామా చేసి సినిమాల వెంట పడ్డాను. ఇప్పటివరకూ వాళ్లకు నేనేమీ చేయలేదు. ఇప్పుడు వాళ్లు నన్ను స్క్రీన్ లో చూసి హ్యాపీ ఫీలవుతారని అనుకుంటున్నాను. వాళ్లకు థాంక్స్" అని అన్నారు.






