
పెళ్లి తర్వాత అమ్మాయి జీవితం పూర్తిగా మారిపోతుందా? తన ఇష్టాలు, కలలను పక్కనపెట్టి కుటుంబం కోసం మాత్రమే బతకాలా? ముఖ్యంగా సంప్రదాయాల పేరుతో పెట్టే ఆంక్షలకు ఎదురు చెప్పకుండా ఉండాల్సిందేనా? ఇలాంటి ప్రశ్నలను లేవనెత్తుతూ నివేదా థామస్, తిరువీర్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘శ్రీమతి’ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పెళ్లి తర్వాత ఓ యువతి ఎదుర్కొనే పరిస్థితులను చాలా సహజంగా చూపిస్తూ ఈ ట్రైలర్ ఆసక్తిని పెంచుతోంది.
డాన్స్ అంటే ఎంతో ఇష్టపడే ఓ అమ్మాయి పెళ్లి తర్వాత తన కలలకు దూరమవుతుందా? లేక తన అభిరుచిని, వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తుందా? అన్నది ఈ కథలో ప్రధాన అంశంగా కనిపిస్తోంది. అత్తారింట్లో ఎలా ఉండాలి? ఏ సమయంలో లేవాలి? ఏం వండాలి? ఎలా నడుచుకోవాలి? అంటూ కొత్తగా పెళ్లయిన అమ్మాయికి ఎదురయ్యే సూచనలు, అంచనాలను ట్రైలర్‌లో చూపించారు. ఉదయం కాఫీ, దోసెల దగ్గరి నుంచి రాత్రి చపాతీలు, రోజువారీ దీపారాధన, బట్టలు ఉతకడం వరకు చిన్న చిన్న విషయాలే ఆమె జీవితంలో ఎంతటి ఒత్తిడికి కారణమవుతున్నాయో చూపించే ప్రయత్నం చేశారు.
ముఖ్యంగా ఇంటి బాధ్యతలే మహిళకు ముఖ్యమని, ఉద్యోగాలు, సొంత ఆలోచనలు తర్వాతి విషయాలనే ధోరణిని ఈ ట్రైలర్ ప్రశ్నిస్తున్నట్లు అనిపిస్తోంది. డాన్స్‌ను కేవలం సరదా కోసం చేసే హాబీగా చూడాలా? దాన్నే తన గుర్తింపుగా మార్చుకోవాలని ఓ మహిళ అనుకుంటే కుటుంబం నుంచి మద్దతు లభిస్తుందా? ఇలాంటి అంశాలు కథలో భావోద్వేగ సంఘర్షణకు కారణమయ్యేలా ఉన్నాయి.

నివేదా థామస్ తన పాత్రలో భావోద్వేగాలను చక్కగా పలికించారు. పెళ్లి తర్వాత ఎదురయ్యే ఒత్తిడికి లోనవుతూనే తన ఇష్టాలను కాపాడుకోవాలనుకునే యువతిగా ఆమె కనిపిస్తున్నారు. ఆమె భర్తగా తిరువీర్ పాత్ర కూడా కథలో కీలకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: భోగి ట్రైలర్‌లో శర్వా విశ్వరూపం.. ఐదుగురు చెల్లెళ్ల కోసం గంగ పోరాటం.!
విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వంలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్, జీ5 సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ తెలుగు ఒరిజినల్ డిసెంబర్ 4, 2026 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. పెళ్లి తర్వాత మహిళలు ఎదుర్కొనే అంచనాలు, ఆంక్షలు, వ్యక్తిగత ఆశలు వంటి అంశాలను వినోదంతో పాటు భావోద్వేగంగా చెప్పగలిగితే ‘శ్రీమతి’ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అవకాశముంది. మరి ఈ ‘శ్రీమతి’ తన కలల కోసం చేసే ప్రయాణం ఎలాంటి అనుభూతిని ఇస్తుందో చూడాలి.
మీకు నచ్చవచ్చు:
చైతన్య బర్త్‌డే.. లిప్‌కిస్‌తో విషెస్ చెప్పిన శోభిత.!
బిగ్ సర్‌ప్రైజ్.. ప్రభుదేవా దర్శకత్వంలో మంచు విష్ణు మూవీ.!
[Srimathi Trailer, Nivetha Thomas, Thiruveer, Vishwak Khanderao, ZEE5 Telugu]




