మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా ఇప్పటికే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాతో జాతీయ అవార్డును అందుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. ఇప్పటివరకు సినిమాలు, వెబ్ సిరీస్‌ల నిర్మాణంపై దృష్టి పెట్టిన ఆమె.. ఇప్పుడు మరో కొత్త రంగంలోకి అడుగుపెట్టారు. ‘పింక్ ఎలిఫెంట్ మ్యూజిక్’ పేరుతో సొంత మ్యూజిక్ లేబుల్‌ను ప్రారంభించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
సాధారణంగా సినిమా నిర్మాతలు తమ చిత్రాల ఆడియో హక్కులను బయట మ్యూజిక్ కంపెనీలకు విక్రయిస్తుంటారు. అయితే నిహారిక మాత్రం ఆ పద్ధతికి భిన్నంగా సొంతంగా మ్యూజిక్ లేబుల్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ కొత్త ప్రయాణం కోసం అంతర్జాతీయ సంస్థ వార్నర్ మ్యూజిక్ గ్రూప్‌కు చెందిన డివో మ్యూజిక్‌తో చేతులు కలిపారు. దీంతో ఇకపై తన నిర్మాణ సంస్థ నుంచి వచ్చే సినిమాల పాటలను ప్రత్యేకంగా ఈ మ్యూజిక్ లేబుల్ ద్వారా విడుదల చేయనున్నారు.
2015లో ‘ముద్దపప్పు ఆవకాయ్’ వెబ్ సిరీస్‌తో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత ‘నాన్న కూచి’, ‘మ్యాడ్ హౌస్’, ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’, ‘హలో వరల్డ్’, ‘బెంచ్ లైఫ్’ వంటి వెబ్ సిరీస్‌లను నిర్మించారు. అనంతరం సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. యదు వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచింది. నిర్మాతగా నిహారికకు SIIMA 2025, GAMA 2025 వేడుకల్లో ఉత్తమ తొలి చిత్ర నిర్మాత అవార్డులు కూడా దక్కాయి.
ఇక ఇప్పుడు ప్రారంభించిన ‘పింక్ ఎలిఫెంట్ మ్యూజిక్’ నుంచి తొలి ఆల్బమ్‌గా ‘పాకెట్ రాకెట్స్’ పాటలను విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు గ్యాని సంగీతం అందిస్తున్నారు. రుద్ర ఆత్రి రచించి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఒక అర్బన్ డ్రామాగా తెరకెక్కుతోంది. అంజి, యేసు అనే ఇద్దరు యువకులు తమ జీవితాలను మార్చుకోవాలనే ఆశతో జూద ప్రపంచంలోకి అడుగుపెడతారు. ఆ తర్వాత వారి జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయన్నదే ఈ సినిమా కథాంశం.
ఈ సినిమాలో త్రినాధ్ వర్మ, నిర్మల్, శ్రియ కొంతం, జేడీ చక్రవర్తి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాగ్జిమం సిటీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. పద్మజ కొణిదెల, రాహుల్ రాఘవేంద్ర, రాహుల్ నిమ్మకూరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రమేష్ మన్యం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తుండగా, ఎదురోలు రాజు సినిమాటోగ్రఫీ, అన్వర్ అలీ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఇక ‘పాకెట్ రాకెట్స్’ సినిమాను డిసెంబర్ 11న థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఆల్బమ్‌తోనే నిహారిక కొత్తగా ప్రారంభించిన పింక్ ఎలిఫెంట్ మ్యూజిక్ ప్రయాణం మొదలుకానుంది. ఇప్పటికే నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఇప్పుడు సంగీత రంగంలోకి కూడా అడుగుపెట్టడం ఆసక్తికరంగా మారింది. మరి సొంత మ్యూజిక్ లేబుల్‌తో నిహారిక ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.
[NiharikaKonidela, PinkElephantMusic, PocketRockketsMovie, NiharikaNewBusiness, DivoMusic]





