Home

»

Latest News

చిరంజీవి ఇంట్లో భోజనం చేసిన రోజులు.. ఆనాటి కష్టాలను గుర్తుచేసుకున్న నాజర్!

Nov 20, 2026 2:11PM

సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే ప్రతిభతోపాటు ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవకాశాల కోసం ఎదురుచూడడం, ఆర్థిక ఇబ్బందులను తట్టుకోవడం.. ఇలా ఎన్నో సవాళ్లను దాటుకుంటేనే ఒక నటుడిగా గుర్తింపు వస్తుంది. ప్రస్తుతం విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న సీనియర్ నటుడు నాజర్ కూడా తన కెరీర్ తొలినాళ్లలో ఇలాంటి కష్టాలనే ఎదుర్కొన్నారు. తాజాగా ఆయన తన గతాన్ని గుర్తుచేసుకుంటూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా ఆకలితో ఇబ్బందులు పడిన రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి కుటుంబం తనకు చేసిన సాయాన్ని గుర్తుచేసుకొని భావోద్వేగానికి గురయ్యారు.

సినిమా అవకాశాల కోసం చెన్నైలో తిరుగుతున్న సమయంలో ఒక్కోసారి భోజనం చేయడానికి కూడా డబ్బులు ఉండేవి కాదని నాజర్ తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో ఆకలేస్తే చిరంజీవి ఇంటికి వెళ్లి భోజనం చేసేవాడినని చెప్పారు. అప్పట్లో చిరంజీవి వరుస సినిమాల షూటింగులతో బిజీగా ఉండేవారని, ఆయన స్నేహితుడి ద్వారా సురేఖను సంప్రదించి ఇంట్లో భోజనం ఉందా లేదా అని తెలుసుకునేవాడినని వెల్లడించారు. భోజనం ఉందని తెలిస్తే అక్కడికి వెళ్లి తిని వచ్చేవాడినని తెలిపారు. కొన్ని సందర్భాల్లో తాను వచ్చి భోజనం చేసిన విషయం చిరంజీవికి కూడా తెలిసేది కాదని, ఆయన షూటింగ్‌లో ఉండేవారని గుర్తుచేసుకున్నారు. చిరంజీవి కుటుంబం తనకు చేసిన ఆ సాయం ఎప్పటికీ మర్చిపోలేనిదని నాజర్ భావోద్వేగంగా చెప్పారు.

నటుడిగా మారాలన్న తన ఆసక్తికి తండ్రి ప్రోత్సాహం ఎంతో ఉందని నాజర్ తెలిపారు. తనలోని ప్రతిభను గుర్తించిన తండ్రి సినిమాల్లోకి వెళ్లమని ప్రోత్సహించడంతో చెన్నైకి వచ్చానని చెప్పారు. అయితే యాక్టింగ్ స్కూల్‌లో చేరడానికి అవసరమైన ఫీజు కూడా తన దగ్గర లేకపోవడంతో ఒక చిన్న ఉద్యోగంలో చేరానని వెల్లడించారు. ఆఫీసు పని పూర్తయిన తర్వాత అదనంగా చిన్న చిన్న పనులు చేస్తూ డబ్బులు సంపాదించి యాక్టింగ్ స్కూల్ ఫీజు కోసం దాచుకునేవాడినని తెలిపారు. ఒక నటుడిగా పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి తనకు దాదాపు 15 ఏళ్లు పట్టిందని నాజర్ పేర్కొన్నారు.

ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో తన తొలి సినిమా గురించి కూడా నాజర్ ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. వెంకటేష్ హీరోగా నటించిన 'చంటి' సినిమాతో తాను టాలీవుడ్‌కు పరిచయమయ్యానని తెలిపారు. ఆ సమయంలో తనకు తెలుగు భాష ఏమాత్రం రాకపోయినా, వెంకటేష్ ఎంతో ఓపికగా ప్రతి డైలాగ్‌ను వివరించేవారని చెప్పారు. తన పాత్ర స్వభావాన్ని అర్థం చేసుకునేలా ప్రోత్సహించారని గుర్తుచేసుకున్నారు. కెరీర్ ప్రారంభంలో చిరంజీవి కుటుంబం అందించిన ఆర్థిక, ఆత్మీయ సహకారం.. టాలీవుడ్‌లో అడుగుపెట్టినప్పుడు వెంకటేష్ ఇచ్చిన ప్రోత్సాహం తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాలుగా నిలిచిపోయాయని నాజర్ తెలిపారు.

 

 

 

[Nassar, NassarAboutChiranjeevi, Chiranjeevi, SurekhaKonidela]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com