'ఫిదా'కు మ్యూజిక్ చాన్స్ ఇవ్వని శేఖర్ కమ్ముల 'లవ్ స్టోరి'కి ఇచ్చాడు!
on Sep 21, 2021
'లవ్ స్టోరి' సినిమాకు అందించిన పాటలతో అందరి దృష్టినీ తనవైపు తిప్పుకున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ పవన్ సిహెచ్. ముఖ్యంగా "సారంగ దరియా" పాట యూట్యూబ్‌లో రికార్డ్ స్థాయి వ్యూస్‌తో దూసుకుపోతూనే ఉంది. మిగిలిన పాటలు కూడా సంగీత ప్రియులను అలరిస్తున్నాయి. నిజానికి శేఖర్ కమ్ముల మునుపటి బ్లాక్‌బస్టర్ 'ఫిదా'కి సంగీత దర్శకుడు కావాలని ప్రయత్నించాడు పవన్. కానీ ఆ సినిమా తనకు చాలా ముఖ్యమనీ, అతనికి చాన్స్ ఇచ్చి రిస్క్ చెయ్యలేననీ చెప్పారంట శేఖర్. ఆ సినిమాకు శశికాంత్ కార్తీక్‌తో మ్యూజిక్ చేయించుకున్నారు శేఖర్.
పవన్ వాళ్లది సినిమా ఫ్యామిలీయే. "మా నాన్నగారు విజయ్, తాతగారు సినిమాటోగ్రాఫర్స్ గా పనిచేశారు. నాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్. అలా చదువులు పూర్తయ్యాక మ్యూజిక్ అకాడెమీలో సంగీతం నేర్చుకున్నాను. కీబోర్డ్, ఇతర సంగీత పరికరాల గురించి నైపుణ్యం తెచ్చుకున్నాను." అని తెలిపాడు పవన్.
ఒక సంగీత విభావరిలో రెహమాన్ అతని పాటలు విని, వచ్చి కలవమని చెప్పారు. "నా సంగీతం, కంపోజిషన్ ఆయనకు బాగా నచ్చాయని చెప్పి సహాయకుడిగా పెట్టుకున్నారు. అలా రెహమాన్ గారితో శివాజీ, రోబో, సర్కార్ తదితర చిత్రాలకు పనిచేశాను." అని చెప్పాడు పవన్.
'ఫిదా' సినిమా టైమ్ నుంచి దర్శకుడు శేఖర్ కమ్ములతో పనిచేసేందుకు ప్రయత్నిస్తూ వచ్చాడతను. "ఫిదాకు నేను పంపిన పాటలు ఆయనకు నచ్చినా, ఆ సినిమా చాలా ఇంపార్టెంట్ అని, కొత్తవాళ్లతో రిస్క్ చేయలేనని చెప్పి వద్దన్నారు. కానీ ఆయనతో టచ్ లో ఉన్నాను. 'లవ్ స్టోరి' సినిమాకు శేఖర్ కమ్ముల గారు పిలిచి అవకాశం ఇచ్చారు. ముందు కొన్ని సందర్భాలు చెప్పి ట్యూన్స్ చేయమన్నారు. ఆ తర్వాత నువ్వు సినిమాకు పనిచేస్తున్నావ్ అని చెప్పి సర్ ప్రైజ్ చేశారు." అని పవన్ వెల్లడించాడు.
అప్పటిదాకా అతను చేసుకున్న పాటలన్నీ బ్యాంక్ లా పనికొచ్చాయి. "లవ్ స్టోరి సినిమా ఒక ఎమోషనల్, ఇంటెన్స్, డెప్త్ ఉన్న సినిమా. ఈ చిత్రానికి శేఖర్ గారు మాకు చెప్పిన విషయం ఒకటే.. పాటలు సందర్భాన్ని ప్రతిబింబించాలి. అంతకంటే ఇంకేం వద్దు అన్నారు. నేను ప్రతి పాటను పూర్తిగా శాటిస్ఫై అయ్యే దాకా రీచెక్ చేసుకుని శేఖర్ కమ్ముల గారికి పంపేవాడిని. ఆయన పాటల కంపోజిషన్ లో ఇచ్చిన గైడెన్స్ అద్భుతం. ఆయనకు ఫోక్ సాంగ్స్ అంటే విపరీతమైన ఇష్టం. 'సారంగ దరియా' పాటను మళ్లీ బాగా చేయాలని చెప్పి చేయించారు. 'లవ్ స్టోరి' పాటలు ఇన్ని మిలియన్ వ్యూస్ తెచ్చుకోవడం కొత్త సంగీత దర్శకుడిగా చాలా సంతృప్తిగా ఉంది." అని చెప్పాడు పవన్.
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన 'లవ్ స్టోరి' సెప్టెంబర్ 24న థియేటర్లలో రిలీజవుతోంది. ఈ సినిమా విజయం సాధిస్తే పవన్ కెరీర్‌కు అది మరింత ప్లస్ అవుతుందనడంలో సందేహం లేదు.