
‘‘అగధ... అది ఒక మూఢ నమ్మకమయితే కాదు. చీకటి లోకంలో నుంచి పుట్టుకొచ్చిన ఒక శక్తి’’.. ఈ ఒక్క డైలాగ్‌తోనే ‘అగధ’ ప్రపంచం ఎంత మిస్టీరియస్‌గా, ఎంత ఇంటెన్స్‌గా ఉండబోతోందో చెప్పేశారు మేకర్స్.
మిస్టరీ, దైవిక శక్తులు, అతీంద్రియ అంశాలతో ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించేందుకు సిద్ధమవుతున్న మూవీ ‘అగధ’. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంటోంది.
‘‘మహిమ ఆత్మహత్యకి కారణమేంటో అర్థమైందా బాబాయ్?’’ అనే ప్రశ్నతో మొదలైన మిస్టరీ... ‘‘నువ్వు, మహిమ కలిసి వెళ్లిన చోటేంటి? అక్కడేం చూశారు?’’ అనే మరో ప్రశ్నతో మరింత ఆసక్తికరంగా మారుతుంది. అసలు మహిమకు ఏం జరిగింది? ఆమె మరణం వెనుక కారణమేంటి? వాళ్లు వెళ్లిన ఆ రహస్య ప్రదేశంలో ఏం చూశారు? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలనే ఉత్కంఠను ట్రైలర్ మొదటి నుంచే క్రియేట్ చేస్తోంది.
ఓ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్న ఆ శక్తి వెనుక కారణమేంటి? ఆ కుటుంబానికి ‘అగధ’కు ఉన్న సంబంధమేంటి? అనే మిస్టరీని మేకర్స్ ట్రైలర్‌లో రివీల్ చేయకుండా జాగ్రత్తపడ్డారు. ఒకవైపు చీకటి లోకం నుంచి పుట్టుకొచ్చిన ‘అగధ’.. మరోవైపు ఆ కుటుంబాన్ని రక్షించేందుకు ప్రయత్నిస్తున్న మహదేవి... ఈ రెండు శక్తుల మధ్య జరిగే పోరాటం ఎలా ఉండబోతోందనే ఆసక్తిని ట్రైలర్ కలిగిస్తోంది.
అడవులు, పురాతన ఆలయాలు, రహస్య ప్రదేశాలు, మంత్ర తంత్రాలు, అతీంద్రియ శక్తులు, ఆధ్యాత్మిక సంకేతాలతో ట్రైలర్‌లోని ప్రతి ఫ్రేమ్‌ను మిస్టిక్ వాతావరణంతో నింపారు దర్శకుడు ఎం.ఎస్. రాజు. విజువల్స్‌కు తోడు ఇంటెన్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, సౌండ్ డిజైన్ ‘అగధ’ ప్రపంచాన్ని మరింత ప్రభావవంతంగా చూపించాయి. హీరో శ్రవణ్ రెడ్డి, హీరోయిన్ కామాక్షి భాస్కర్ల పాత్రలు కథలోని మిస్టరీకి కీలకంగా కనిపిస్తున్నాయి.
మిస్టరీ.. సస్పెన్స్.. థ్రిల్.. భక్తి.. అతీంద్రియ శక్తులు.. వీటన్నింటినీ ఒకే కథలో మేళవిస్తూ దర్శకుడు ఎం.ఎస్. రాజు ‘అగధ’ను మిస్టిక్ డివైన్ థ్రిల్లర్‌గా తీర్చిదిద్దారు. శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మిస్తున్న ‘అగధ’ సినిమా ఆగస్టు 14న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
Agadha Trailer, MS Raju, Kamakshi Bhaskarla





