Home

»

Latest News

Mr Work From Home Review: 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' మూవీ రివ్యూ

May 15, 2026

చాలా కాలం క్రితమే షూటింగ్ పూర్తి చేసుకుని, పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చిన చిత్రం ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ (Mr Work From Home). ఇటీవల దేశంలో వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ గురించి మళ్ళీ చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చింది. త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ జంటగా నటించిన ఈ చిత్రానికి మధు కిరణ్ దర్శకత్వం వహించారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. (Mr Work From Home Movie Review)

కథ:
అరవింద్ (త్రిగుణ్) అమెరికాలో మంచి ఉద్యోగం వదిలేసి, వ్యాపారం చేయాలనే లక్ష్యంతో ఇండియాకు వస్తాడు. తన అపార్ట్‌మెంట్‌లోనే ఉండే మహి (పాయల్ రాధాకృష్ణ)ని చూసి ప్రేమలో పడతాడు. తనను పెళ్లి చేసుకోబోయే వాడు మంచి జాబ్ చేసేవాడు కావాలని కలలు కనే మహి.. అరవింద్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడని భావించి అతడిని ఇష్టపడుతుంది. ఆ తర్వాత అరవింద్ ఉద్యోగం చేయడం లేదని తెలుసుకున్న మహి, అతనికి దూరమవుతుంది. మరోవైపు ఉద్యోగం చేయకుండా ఖాళీగా ఉంటున్నాడనే కారణంతో తండ్రి కూడా అరవింద్‌ను ఇంటి నుండి గెంటేస్తాడు. ఈ పరిస్థితుల నడుమ అరవింద్ ఏం చేశాడు? అసలు అతని లక్ష్యం ఏంటి? మహి ప్రేమను ఎలా గెలుచుకున్నాడు? అనేదే మిగిలిన కథ.

విశ్లేషణ:
మహర్షి, శ్రీకారం వంటి సినిమాల ఛాయలు ఇందులో కనిపిస్తాయి. వ్య‌వ‌సాయం చేయ‌డానికి యువ‌త ముందుకు రావాల‌ని, టెక్నాల‌జీని వాడుకుంటూ వ్య‌వ‌సాయం చేస్తే సాఫ్ట్‌వేర్ జాబ్స్ కి మించి సంపాదించ‌వ‌చ్చ‌ని దర్శకుడు చెప్పాలనుకున్నారు. ద‌ర్శ‌కుడి ఆలోచ‌న బాగానే ఉంది కానీ, దాని తెరపైకి తీసుకు రావడంలో మాత్రం తడబడ్డారు. ప్రేమ, వ్యాపారం, వ్యవసాయం.. ఇలా పలు అంశాలతో కథనం గ‌జిబిజీగా తయారైంది. ప్రేమ కథ ఆకట్టుకునేలా లేదు. కామెడీ పూర్తిగా తేలిపోయింది. ఎమోషన్స్ కూడా పండలేదు. రైటింగ్ వీక్ గా ఉంది. అందుకే రెండు గంటల సినిమా కూడా మూడు గంటల సినిమా అనే ఫీలింగ్ కలుగుతుంది.

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
అరవింద్ పాత్రలో త్రిగుణ్ తన పరిధి మేరకు బాగానే నటించాడు. ఇలాంటి లవర్ బాయ్ పాత్రలు అతనికి అలవాటే కాబట్టి సులువుగా చేసేశాడు. హీరోయిన్‌గా పాయల్ రాధాకృష్ణ స్క్రీన్ మీద చాలా ఫ్రెష్‌గా కనిపించింది. నటన పరంగా కూడా పర్వాలేదనిపించింది. అనీష్ కురువిళ్ళ, సత్య కృష్ణ, సి.వి.ఎల్ నరసింహారావు వంటి సీనియర్ నటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

దర్శకుడు మధు కిరణ్ ఎంచుకున్న పాయింట్ బాగున్నా, దాన్ని నేటి కాలానికి తగ్గట్టుగా మలచడంలో విఫలమయ్యారు. కథలో స్పష్టత లోపించింది. వ్యాపారం, వ్యవసాయం, ప్రేమ.. ఇలా అన్ని అంశాలను కలగాపులగం చేయడంతో సినిమా ఏ దిశగా సాగుతుందో అర్థం కాదు. మేకింగ్ పరంగా సినిమా ఔట్‌డేటెడ్ అనిపిస్తుంది. ఎడిటింగ్ ఇంకా షార్ప్‌గా ఉండాల్సింది. సినిమా నెమ్మదిగా సాగుతూ ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తుంది. 

ప్లస్ పాయింట్స్:
హీరో హీరోయిన్ల స్క్రీన్ ప్రెజెన్స్
కొన్ని యూత్ ఫుల్ ఎలిమెంట్స్

మైనస్ పాయింట్స్:
ఔట్‌డేటెడ్ కథ, కథనం
సాగదీత సన్నివేశాలు

ఫైనల్ గా..
‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ సినిమా చాలా ఏళ్ల క్రితం రావాల్సింది. ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టుగా లేని కథాంశం, నెమ్మదించిన కథనం సినిమాకు పెద్ద మైనస్. చిన్న మెసేజ్ తో కూడిన ఒక సింపుల్ లవ్ స్టోరీ చూడాలనుకునే వారు టైమ్ పాస్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు.

Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com