
'సాహో' నుంచి శంకర్, ఎహసాన్, లాయ్ తప్పుకున్నారు
హిందీ హీరోయిన్ శ్రద్ధా కపూర్, కొంతమంది బాలీవుడ్ నటీనటులు, హాలీవుడ్ ఫైట్ మాస్టర్ తప్పిస్తే... హీరో ప్రభాస్, దర్శకుడు సుజీత్, నిర్మాతలు వంశీ, ప్రమోద్, విక్రమ్ తదితరులంతా తెలుగువారే. శంకర్, ఎహసాన్, లాయ్ ఎక్కువగా హిందీ సినిమాలకు పని చేస్తారు. తెలుగు చిత్రబృందంతో ఎక్కడో తేడా కొట్టింది. సినిమా నుంచి తప్పుకున్నారు.
'లక్ష్మీ బాంబ్'కి లారెన్స్ డైరెక్ట్ చేయనంటున్నాడు!
తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమల్లో నృత్య దర్శకుడిగా, దర్శకుడిగా రాఘవా లారెన్స్‌కి పెద్ద పేరుంది. అతడు హీరోగా నటించి, దర్శకత్వం వహించిన 'కాంచన' ఫ్రాంచైజీ సినిమాలు కలెక్షన్స్ రాబట్టాయి. హిందీ హీరో అక్షయ్ కుమార్‌కి ఆ సినిమాలు నచ్చి రాఘవా లారెన్స్ దర్శకత్వంలో హిందీలో 'కాంచన'ను రీమేక్ చేయడానికి ముందుకొచ్చారు. సినిమా మొదలైంది. తనకు చెప్పకుండా ఫస్ట్ లుక్ విడుదల చేసి, తనను అవమానించారని, గౌరవం లేనిచోట నేను ఉండనని 'లక్ష్మీ బాంబ్' దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు లారెన్స్ ప్రకటించారు. అతణ్ణి బుజ్జగించే పనిలో ఉన్నారు హిందీ నిర్మాతలు.
నేను జాగ్రత్తగా ఉండాలి: క్రిష్
హిందీ మీడియాతో తెలుగు దర్శకుడు క్రిష్ చేసిన తాజా వ్యాఖ్య ఇది. "నా తదుపరి సినిమా ఏదనేది ఇంకా ఖరారు కాలేదు. నేను మరో తప్పటడుగు ఎప్పుడు వేస్తానా? అని చాలామంది ఎదురు చూస్తున్నారు. నేను జాగ్రత్తగా ఉండాలి" అని హిందీ మీడియాకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో క్రిష్ వ్యాఖ్యానించారు. ఇన్‌డైరెక్టుగా 'మణికర్ణిక'కు డైరెక్ట్ చేయడం తాను చేసిన తప్పని ఆయన అన్నారు. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి కథతో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన 'మణికర్ణిక' విషయంలో మీడియా సాక్షిగా ఎన్ని మాటల తూటాలు పేలాయో, ఎంత గొడవ జరిగిందో చూశాం.
తెలుగు... హిందీ... టెక్నీషియన్ల మధ్య సఖ్యత కుదరడం లేదు. ఎక్కడో తేడా కొడుతోంది. గొడవలు తలెత్తుతున్నాయి. దాంతో సినిమా నుంచి తప్పుకుంటున్నారు. పైన చెప్పుకున్న మూడు ఇటీవల జరిగిన ఉదంతాలు మాత్రమే. అంతకు ముందు కూడా ఇటువంటి ఘటనలు కొన్ని ఉన్నాయి. కొన్ని అభిప్రాయ బేధాలు బయటకొస్తున్నాయి. కొన్ని రావడం లేదు.




.jpg)

