ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఎంతగానో నచ్చే కామెడీ కథాంశంతో హీరో శ్రీకాంత్ నటించిన తాజా చిత్రం 'మిస్టర్ మిడిల్ క్లాస్'. థియేటర్లలో విడుదలైన ఈ హస్యభరిత చిత్రం ఇప్పుడు ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా'లో డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
మధ్యతరగతి కుటుంబాల ఆలోచనలు, వారి ఆరాటాలు, తొందరపడి అప్పులు చేసి పడే ఇబ్బందులను ప్రధానంగా తీసుకుని ఈ సినిమాను తీర్చిదిద్దారు. కథానాయకుడు వెంకటరమణ (శ్రీకాంత్) ఒకే రాత్రిలో కోటీశ్వరుడు కావాలని ఆశపడి హోటల్ పెట్టి భారీగా అప్పుల పాలవుతాడు. దాంతో కుటుంబమంతా కష్టాల్లో కూరుకుపోతుంది.
ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కడానికి దేవుడిని వేడుకునే క్రమంలో, స్వయంగా స్వామివారే (రాజేంద్రప్రసాద్) ప్రత్యక్షమై ఒక మ్యాజిక్ పుస్తకాన్ని వెంకటరమణకు ఇస్తారు. ఆ పుస్తకంలో ఏది రాస్తే అది నిజమవుతుందని చెబుతారు. అయితే కొన్ని నిబంధనలు కలిగిన ఆ పుస్తకం వెంకటరమణ చేతికి వచ్చిన తర్వాత ఆయన జీవితంలో ఎలాంటి వినోదాత్మక పరిణామాలు చోటుచేసుకున్నాయనేది ఈ చిత్రంలో ఆసక్తికరంగా చూపించారు.
గతంలో 'సీమశాస్త్రి', 'సీమటపాకాయ్', 'దేనికైనా రెడీ' వంటి వినోదాత్మక సినిమాలతో ప్రేక్షకులను నవ్వించిన దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శ్రీకాంత్, లయల హిట్ కాంబినేషన్ మళ్లీ తెరపైకి రావడం విశేషం. వీరిద్దరితో పాటు రాజేంద్రప్రసాద్, సునీల్, వెన్నెల కిశోర్, రఘుబాబు, పృథ్వీరాజ్, మురళీధర్ గౌడ్ తమ కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించారు.
దేవుడు నరుడికి వరాలు ఇస్తే ఏం జరుగుతుందనే వినూత్న భావన చుట్టూ తిరిగే ఈ కథ, కుటుంబ సమేతంగా చూడదగ్గ సరదా ఎంటర్‌టైనర్‌గా నిలిచింది. డిజిటల్ లవర్స్ ఆహా ప్లాట్‌ఫామ్‌లో ఈ వీకెండ్ కి హ్యాపీగా నవ్వుకునేందుకు ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు.





