Home

»

Latest News

‘మూన్ వాక్’ మ్యాజిక్ మళ్ళీ రాబోతోంది.. వరల్డ్ వైడ్ రిలీజ్‌కి డేట్ ఫిక్స్!

Apr 18, 2026

ప్రపంచ సంగీత సామ్రాజ్యాన్ని తన వేళ్ళపై ఆడించిన ఏకైక ఛత్రపతి, డ్యాన్స్ అంటే 'మూన్ వాక్' అని లోకానికి పరిచయం చేసిన లెజెండ్ మైకేల్ జాక్సన్. ఆయన మరణించి దశాబ్ద కాలం దాటినా, నేటికీ ఆ పేరు వింటే పూనకాలు వచ్చే అభిమానులు కోట్లాది మంది ఉన్నారు. ఇప్పుడు ఆ పాప్ కింగ్ జీవిత గాథ వెండితెరపై ఆవిష్కృతమవుతోంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మైకేల్ జాక్సన్ బయోపిక్ 'మైకేల్' విడుదలకు సర్వం సిద్ధమైంది.

ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటానికి ప్రధాన కారణం మైకేల్ జాక్సన్ పాత్రను ఆయన స్వయానా మేనల్లుడు జాఫర్ జాక్సన్ పోషించడమే. విడుదలైన ప్రోమోలు, పోస్టర్లు చూస్తుంటే జాఫర్ అచ్చం మైకేల్ లాగే కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. బాడీ లాంగ్వేజ్ నుంచి డ్యాన్స్ మూమెంట్స్ వరకు జాఫర్ పడ్డ కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తోంది. లెజెండరీ సింగర్ మేనల్లుడే ఈ పాత్ర చేస్తుండటంతో, జాక్సన్ వారసత్వాన్ని పక్కాగా ప్రతిబింబిస్తారని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు.

తాజా సమాచారం ప్రకారం, ఈ భారీ బడ్జెట్ మూవీని ఏప్రిల్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ప్రముఖ దర్శకుడు ఆంటోనీ ఫుక్వా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మైకేల్ జాక్సన్ బాల్యం నుంచి, 'జాక్సన్ 5' బ్యాండ్‌తో ఆయన ప్రయాణం, సోలో సింగర్‌గా గ్లోబల్ ఐకాన్‌గా ఎదిగిన తీరును ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నారు. కేవలం ఆయన విజయాలే కాకుండా, జీవితంలో ఎదుర్కొన్న వ్యక్తిగత ఒడిదుడుకులు, వివాదాలను కూడా నిజాయితీగా స్పృశించనున్నట్లు తెలుస్తోంది.

హాలీవుడ్ టాప్ టెక్నీషియన్స్ పని చేస్తున్న ఈ సినిమాలో మ్యూజిక్ హైలైట్‌గా నిలవనుంది. జాక్సన్ పాడిన ఐకానిక్ సాంగ్స్‌ను మళ్ళీ వెండితెరపై ఆ స్థాయి సౌండ్ క్వాలిటీతో వినడం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది. షూటింగ్ కోసం దాదాపు రెండేళ్ల పాటు కసరత్తు చేసిన చిత్ర యూనిట్, ప్రతి ఫ్రేమ్ మైకేల్ అసలు జీవితానికి దగ్గరగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది. ఈ సినిమాలో మైకేల్ తండ్రి జో జాక్సన్ పాత్రలో ఆస్కార్ విజేత కోల్‌మన్ డొమింగో నటిస్తుండటం విశేషం.

సోషల్ మీడియాలో ఇప్పటికే 'మైకేల్' హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంజే ఆర్మీ ఈ సినిమా కోసం కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తోంది. ఒక శకాన్ని శాసించిన మనిషి కథను థియేటర్లో చూడటం అంటే అది కేవలం సినిమా కాదు, ఒక ఎమోషనల్ జర్నీ అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాత రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేయడం ఖాయంగా కనిపిస్తోంది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com