Home

»

Latest News

అక్టోబ‌ర్ 17న ఎం.జి.ఆర్‌. బ‌యోపిక్ ప్రారంభం.. హీరో ఎవ‌రో తెలుసా.?

Sep 28, 2026 1:09PM

తమిళ సినీ చరిత్రలో నటుడిగా, ఆ తర్వాత రాజకీయ నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎం.జి. రామచంద్రన్‌ జీవిత కథ ఇప్పుడు వెండితెరపైకి రాబోతోంది. ఆయన జీవితాన్ని ఆధారంగా చేసుకుని పూర్తి స్థాయి బయోపిక్‌ తెరకెక్కించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ‘పురట్చి తలైవర్ ఎం.జి.ఆర్’ అనే టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుండటం విశేషం. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి అక్టోబర్ 17న షూటింగ్ ప్రారంభించనున్నారు. 

ఈ సినిమాలో ఎం.జి.ఆర్ పాత్రను నటుడు జె.ఎం. బషీర్ పోషించనున్నారు. గతంలో ‘నేషనల్ లీడర్’ అనే చిత్రంలో పసుంపొన్ ముత్తురామలింగ దేవర్ పాత్రలో నటించిన ఆయన.. ఇప్పుడు ఏకంగా ఎం.జి.ఆర్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఎం.జి.ఆర్ గెటప్‌లో బషీర్‌కు సంబంధించిన ఫొటోలు సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. 

ఇదిలా ఉంటే.. ఈ బయోపిక్‌ను కేవలం ఎం.జి.ఆర్ సినీ జీవితానికే పరిమితం చేయకుండా, ఆయన జీవితంలోని వివిధ దశలను చూపించేలా తెరకెక్కించనున్నట్లు సమాచారం. నాటక రంగం నుంచి ఆయన కళా ప్రయాణం ఎలా మొదలైంది? ఆ తర్వాత సినిమాల్లో కథానాయకుడిగా ఎలా ఎదిగారు? ప్రజల్లో ఆయనకు వచ్చిన ప్రత్యేక గుర్తింపు ఏంటి? వంటి అంశాలకు సినిమాలో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

అలాగే ఎం.జి.ఆర్‌తో సన్నిహితంగా పనిచేసినవారు, కుటుంబ సభ్యులు, రాజకీయ సహచరులు, ప్రభుత్వ అధికారులు, సహ నటీనటులు, సినీ ప్రముఖులు పంచుకున్న అనుభవాలను కూడా ఈ కథలో భాగం చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. దీంతో ఎం.జి.ఆర్ జీవితంలోని తెరపై కనిపించని మరిన్ని కోణాలను కూడా ప్రేక్షకులకు పరిచయం చేసే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

ఎం.జి.ఆర్ తమిళ సినిమాల్లో అగ్ర కథానాయకుడిగా ఎదిగి, అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన నటించిన సినిమాలు, ప్రజా జీవితంలో ఆయనకు ఏర్పడిన గుర్తింపు ఇప్పటికీ తమిళనాడు సంస్కృతి, సినీ చరిత్రలో ప్రస్తావనకు వస్తూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆయన జీవితాన్ని పూర్తి స్థాయి బయోపిక్‌గా తెరపైకి తీసుకురావడం సహజంగానే ఆసక్తిని కలిగిస్తోంది. 

మొత్తంగా.. ‘పురట్చి తలైవర్ ఎం.జి.ఆర్’ సినిమాతో ఎం.జి.ఆర్ జీవితంలోని కీలక ఘట్టాలను వెండితెరపై ఎలా ఆవిష్కరిస్తారన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అక్టోబర్ 17న రామావరం గార్డెన్స్‌లో షూటింగ్ ప్రారంభించనున్నట్లు తాజా సమాచారం.

 

 

[MGR Biopic, MGR Biopic Movie, Puratchi Thalaivar MGR, MGR Life Story, MGR Biography Movie, JM Bashir MGR, MGR Biopic Tamil Movie, MGR Movies, MGR Latest News, Tamil Cinema News, MGR Life Story Movie]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com