Home

»

Latest News

Matka King Review Telugu: 'మట్కా కింగ్' వెబ్ సిరీస్ రివ్యూ.. రియల్ స్టోరీతో తెరకెక్కిన జూదగాడి కథ మెప్పించిందా?

Apr 20, 2026

ఇటీవలి కాలంలో రియలిస్టిక్ క్రైమ్ డ్రామాలకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలో విజయ్ వర్మ ప్రధాన పాత్రలో నటించిన పీరియడ్ క్రైమ్ డ్రామా 'మట్కా కింగ్' (Matka King) వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. 1960ల నాటి ముంబై నేపథ్యంలో సాగే ఈ సిరీస్, బెట్టింగ్ సామ్రాజ్యాన్ని శాసించిన ఒక వ్యక్తి ప్రయాణాన్ని ఆవిష్కరిస్తుంది. ముంబై ప్రత్తి వ్యాపారి రవి ఖత్రి జీవితం ఆధారంగా ఇది తెరకెక్కడం విశేషం. 'సైరాట్' ఫేమ్ నాగరాజ్ మంజులే దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో తెలుసుకుందాం.

కథ:
ముంబై కాటన్‌ మిల్లు యజమాని, మట్కా నిర్వాహకుడు లాల్‌జీ భాయ్‌ (గుల్షన్‌ గ్రోవర్‌) వద్ద బ్రిజ్‌ భట్టి (విజయ్‌ వర్మ) పనిచేస్తుంటాడు. బ్రిజ్‌‌ తమ్ముడు లక్ష్మణ్‌ (భూపేంద్ర జాదవ్‌) జూదం వల్ల అప్పు చేసి ఒక ఫైనాన్షియర్‌‌ చేతిలో ఇరుక్కుంటాడు. తమ్ముడిని కాపాడటం కోసం బ్రిజ్ పది రోజుల్లో ఆ అప్పు మొత్తం కట్టేస్తానని చెబుతాడు. తాను పనిచేస్తున్న లాల్‌జీ దగ్గరకు వెళ్లి సాయం కోరగా, అతను సాయం చేయడు. దాంతో డబ్బు కోసం సొంతంగా 'మట్కా' నిర్వహణకు దిగుతాడు బ్రిజ్‌. ఆ తర్వాత అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? ముంబైను సైతం శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు? ఈ క్రమంలో అతడికి శత్రువులుగా మారింది ఎవరు? తెలియాలంటే సిరీస్‌‌ చూడాలి. 

విశ్లేషణ:
'మట్కా కింగ్' కేవలం ఒక జూదగాడి కథ మాత్రమే కాదు. ఇది 1960ల నాటి ముంబై సామాజిక, ఆర్థిక పరిస్థితులను ప్రతిబింబించే ఒక పీరియడ్ డాక్యుమెంటేషన్. ఈ సిరీస్ 'రైజ్ అండ్ ఫాల్' ఫార్మాట్‌లో సాగుతుంది. ఒక సాదాసీదా మనిషి, వ్యవస్థలోని లోపాలను వాడుకుని ఒక సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడు అనేది చాలా ఆసక్తికరంగా రాసుకున్నారు. 

దర్శకుడు నాగరాజ్ మంజులే ఈ సిరీస్‌ను 'రా అండ్ రస్టిక్' స్టైల్‌లో తెరకెక్కించారు. ఒక సాధారణ వ్యక్తి, చీకటి సామ్రాజ్యానికి రాజుగా మారే క్రమాన్ని చూపించడంలో ఆయన సక్సెస్ అయ్యారు. అయితే, స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడు ఎక్కడా తొందరపడలేదు. ప్రతి పాత్రకు ఒక నేపథ్యం, ఒక ఉద్దేశ్యం ఉండేలా చూసుకున్నారు. దీనివల్ల మొదటి రెండు ఎపిసోడ్లు నెమ్మదిగా అనిపిస్తాయి.

కథనం ప్రారంభంలో నెమ్మదిగా సాగినప్పటికీ.. కథ ముందుకు నడుస్తున్న కొద్దీ ఆసక్తికరంగా ఉంటుంది. ముఖ్యంగా మట్కా నెట్‌వర్క్ విస్తరించే తీరు ఆకట్టుకుంది. కొన్ని ఎపిసోడ్ల నిడివి కాస్త ఎక్కువగా అనిపించినా, క్లైమాక్స్ వరకు ఉత్కంఠను కొనసాగించడంలో చిత్ర బృందం విజయం సాధించింది. అయితే, గతంలో వచ్చిన 'స్కామ్ 1992'తో పాటు, కొన్ని గ్యాంగ్‌స్టర్ సినిమాల ఛాయలు అక్కడక్కడా కనిపిస్తాయి. 

ఈ సిరీస్‌లో డైరెక్టర్ కేవలం క్రైమ్‌ను మాత్రమే చూపించలేదు. మట్కా అనేది సామాన్య శ్రామిక వర్గానికి ఎలా ఒక ఆశగా మారిందో, అది వారి జీవితాలను ఎలా చిన్నాభిన్నం చేసిందో వాస్తవికంగా చూపించారు. డబ్బు సంపాదించాలనే ఆశ మనుషులను ఏ స్థాయికి తీసుకెళ్తుందో ఇందులో చూడవచ్చు.

ఇదిలా ఉంటే, ఇదే తరహా కథతో తెలుగులో వరుణ్ తేజ్-కరుణ కుమార్ కాంబినేషన్ లో 'మట్కా' సినిమా రావడం విశేషం. అదే ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచింది.

నటీనటుల పనితీరు:
విజయ్ వర్మ తన నటనతో ఈ సిరీస్‌ను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఒక మధ్యతరగతి వ్యక్తిలో ఉండే ఆరాటాన్ని, అలాగే ఒక సామ్రాజ్యాన్ని శాసించే వ్యక్తిలో ఉండే గంభీరాన్ని ఆయన తన కళ్ళతోనే పలికించారు. కీలక పాత్రల్లో నటించిన సాయి తమ్హంకర్, గుల్షన్ దేవయ్య తమ నటనతో ఆకట్టుకున్నారు. 

సాంకేతిక విభాగం:
దర్శకుడు నాగరాజ్ మంజులే మార్క్ మేకింగ్ ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. 1960ల నాటి ముంబై వాతావరణాన్ని, అప్పటి జీవనశైలిని సెట్స్, సినిమాటోగ్రఫీ ద్వారా అద్భుతంగా ఆవిష్కరించారు. నేపథ్య సంగీతం కథలోని సీరియస్‌నెస్‌ను బాగా ఎలివేట్ చేసింది. ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్లాస్‌లో ఉన్నాయి. 

ప్లస్ పాయింట్లు:
విజయ్ వర్మ నటన
1960ల నాటి సెట్టింగ్స్, విజువల్స్

మైనస్ పాయింట్లు:
కొన్ని ఎపిసోడ్లలో కథనం నెమ్మదించడం

ఫైనల్ గా..
మొత్తానికి 'మట్కా కింగ్' ఒక సాలిడ్ పీరియడ్ క్రైమ్ డ్రామా. విజయ్ వర్మ నటన, నాగరాజ్ మంజులే మేకింగ్ ఈ సిరీస్‌కు ప్రధాన బలాలు. కథనం కాస్త నెమ్మదిగా అనిపించినా.. రియలిస్టిక్ క్రైమ్ డ్రామాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఇది నచ్చే అవకాశముంది.

Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com