Home

»

Latest News

మారెమ్మ ఓటిటి డేట్ వచ్చేసింది: అమ్మ తల్లో, మాయమ్మో!

Sep 24, 2026 4:25PM


మాస్ మహారాజా రవితేజ సోదరుడి కుమారుడు మాధవ్ భూపతిరాజు కథానాయకుడిగా నటించిన నయా రూరల్ యాక్షన్ డ్రామా చిత్రం 'మారెమ్మ'. థియేటర్లలో విడుదలైన కొద్ది రోజులకే ఈ చిత్రం డిజిటల్ వేదికపైకి రాబోతుండటంతో సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. 


తెలంగాణ పల్లెటూరి సంస్కృతి, గ్రామ దేవతల ఆచారాలు, అలాగే జానపద నమ్మకాల నేపథ్యంలో దర్శకుడు మంచాల నాగరాజ్ తెరకెక్కించాడు. సెప్టెంబర్ 10న గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రాగా, గ్రామీణ నేపథ్య కథలను ఇష్టపడే వారిని విశేషంగా ఆకట్టుకుంది. అంతర్జాతీయ చలనచిత్ర వేదిక ఐఎమ్‌డీబీ (IMDb)లో ఈ సినిమా ఏకంగా 8.6 అత్యుత్తమ రేటింగ్ సాధించి సంచలనం సృష్టించింది.   తాజాగా ఈ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ హక్కులకు సంబంధించిన బిగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకే సొంతం చేసుకుంది. అక్టోబర్ 9వ తేదీ నుంచి ఈ రూరల్ యాక్షన్ డ్రామా ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుందని సమాచారం. 


ఇది కూడా చదవండి: గురువుని ఎందుకు ఫాలో అవ్వలేదు: సమయం లేదా మిత్రమా!

 


 

మహిషాపురం అనే తెలంగాణ పల్లెటూర్లో సాగే ఈ కథలో ఊరి ఇలవేల్పు మారెమ్మ తల్లి పండుగ, ఆచారం చుట్టూ ఉత్కంఠభరితమైన మలుపులు ఉంటాయి. ఊరి సాంప్రదాయం ప్రకారం మారెమ్మ తల్లికి బలి ఇవ్వడానికి నిర్ణయించిన పవిత్రమైన 'మారి' అనే దున్నపోతును కథానాయకుడు కర్ణి (మాధవ్ భూపతిరాజు) ఎంతో ప్రాణంగా, ప్రేమగా పెంచుకుంటారు. అయితే, సరిగ్గా జాతర బలి సమయానికి ఆ దున్నపోతు ఊరి నుంచి మాయమవ్వడంతో గ్రామంలో తీవ్రమైన కలకలం రేగుతుంది. ఆ మాయమైన దున్నపోతు కోసం హీరో చేసే ఉత్కంఠభరితమైన అన్వేషణ, దానికి తోడు ఊరిలో జరిగే క్షుద్రపూజల వెనుక రహస్యాలు, గ్రామాన్ని ఆ జంతువు ఎలా కాపాడింది అనే విషయాలు  ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. హీరోగా మొదటి సినిమానే అయినా మాధవ్ భూపతిరాజు పల్లెటూరి కుర్రాడిగా తన బాడీ లాంగ్వేజ్, నటనతో ఎంతగానో మెప్పించారు. కథానాయికగా దీపా బాలు కూడా పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఎంతో సహజంగా ఒదిగిపోయారు. వికాస్ వాసిష్ఠ, వినోద్ కుమార్, దయానంద్ రెడ్డి వంటి నటులు తమ క్యారెక్టర్స్ తో  మూవీకి  మరింత బలాన్ని చేకూర్చారు. ప్రశాంత్ విహారి, విప్రదీప్ దత్తా అందించిన సంగీతం, నేపథ్య సంగీతం పల్లెటూరి వాతావరణాన్ని ప్రేక్షకులకు కళ్ళకు కట్టినట్లు చూపించాయి. మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై మయూర్ రెడ్డి బండారు నిర్మించిన ఈ వైవిధ్యమైన తెలంగాణ జానపద యాక్షన్ డ్రామాను థియేటర్లలో మిస్ అయినవారు అక్టోబర్ 9 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో వీక్షించవచ్చు.


 

[Maremma Ott Release Date, Maadhav Bhupathiraju Maremma, Telugu One Cinema News, TeluguOne Cinema News, TeluguOne]
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com