'మంచిరోజులు వచ్చాయి' ట్రైలర్.. మారుతి మార్క్ కామెడీ!
on Oct 14, 2021
'ప్రతిరోజూ పండగే' తర్వాత మారుతి దర్శకత్వంలో వస్తున్న సినిమా 'మంచిరోజులు వచ్చాయి'. ఈ సినిమాలో సంతోష్ శోభన్, మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకోగా.. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. గురువారం విడుదల చేసిన ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
పేపర్ బాయ్, ఏక్ మినీ కథ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న సంతోష్ క్రేజీ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో సినిమా చేస్తుండటంతో 'మంచిరోజులు వచ్చాయి' సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ మెప్పిస్తోంది. "మై డియర్ వాట్సాప్ అంకుల్స్ అండ్ యూట్యూబ్ ఆంటీస్. నా పేరు సంతోష్.. ఆనందానికి అడ్రెస్ వీడు అనేది నా ట్యాగ్ లైన్" అంటూ అంటూ సంతోష్ ఇంట్రడక్షన్ తో ప్రారంభమైన ట్రైలర్.. మారుతి మార్క్ కామెడీతో సాగింది. కొలిగ్స్ అయిన సంతోష్, మెహ్రీన్ లవ్ లో ఉంటారు. కూతురుని అమితంగా ఇష్టపడే మెహ్రీన్ తండ్రి(అజయ్ ఘోష్) తన ఫ్రెండ్స్ తో కలిసి కూతురు లవ్ లో ఉందేమో అని తెలుసుకోవడానికి చేసే ప్రయత్నాలు నవ్వు తెప్పిస్తున్నాయి. మొత్తానికి ట్రైలర్ చూస్తుంటే ఈ మూవీ కంప్లీట్ కామెడీ ఎంటర్ టైనర్ అని అర్థమవుతోంది.
'భలే భలే మగాడివోయ్', 'మహానుభావుడు', 'ప్రతిరోజూ పండగే' వంటి సినిమాలతో నవ్వించి విజయాలు అందుకున్న మారుతి.. 'మంచిరోజులు వచ్చాయి' సినిమాతో మరోసారి మెప్పిస్తాడేమో చూడాలి.
Also Read