Home

»

Latest News

టాలీవుడ్‌కు తెలంగాణ మహిళా కమిషన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌!

Mar 20, 2025

ఇటీవలికాలంలో తెలుగు సినిమాల్లో ఐటమ్‌ సాంగ్స్‌ హడావిడి బాగా ఎక్కువైంది. ఒక పాటను మించి మరొకటి ఉండాలనే ఆరాటంలో దర్శక నిర్మాతలు తమ సినిమాలోని ఐటమ్‌ సాంగ్‌ మరింత స్పెషల్‌గా ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు. అయితే ఆ పాట లిరిక్స్‌, ఐటమ్‌ గర్ల్‌తో వేయించే స్టెప్స్‌ని ఎంతవరకు ప్రేక్షకులు స్వీకరిస్తారు అనే విషయంలో విచక్షణ కోల్పోతున్నారని ఈమధ్యకాలంలో వస్తున్న పాటలు చూస్తుంటే అర్థమవుతుంది. ఇలాంటి పాటల విషయంలో నియంత్రణ అవసరం అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. భారతీయ సినిమాలకు కథ ఎంత అవసరమో, పాటలు కూడా అంతే అవసరం. దీన్ని కొన్ని దశాబ్దాలుగా మన దర్శకనిర్మాతలు పాటిస్తూ వస్తున్నారు. ఎవరికి తోచిన విధంగా వారు పాటలు తీస్తూ ప్రేక్షకుల్ని మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీనిపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ స్పందించింది. ఇటీవల వస్తున్న సినిమాల్లోని పాటల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. 

కొన్ని సినిమా పాటల్లోని డాన్స్‌ స్టెప్స్‌ అసభ్యంగా, మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయని పలు ఫిర్యాదులు అందడంతో కమిషన్‌ తీవ్రంగా స్పందించింది. సినిమా అనేది సమాజంపై ప్రభావం చూపే శక్తివంతమైన మాధ్యమం. ఇందులో మహిళలను అవమానించే లేదా అసభ్యకరంగా చూపించే అంశాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని ఒక ప్రకటనలో తెలిపింది. పాటల చిత్రీకరణ విషయంలో దర్శకులు, నిర్మాతలు, కొరియోగ్రాఫర్లు బాధ్యతగా వ్యవహించాలని, మహిళలను తక్కువ చేసి చూపించే అసభ్యకరమైన స్టెప్స్‌ను వెంటనే నిలిపి వేయాలని హెచ్చరించింది. దీనికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది. 

సినిమా అనేది సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని మహిళా కమిషన్‌ ఈ సందర్భంగా గుర్తు చేసింది. సమాజానికి సానుకూలమైన సందేశాలను అందించాలని, అదే సమయంలో మహిళల గౌరవాన్ని కాపాడే నైతిక బాధ్యతను దర్శకనిర్మాతలు, కొరియోగ్రాఫర్లు తీసుకోవాలన్నారు. ఈ అంశంపై ప్రజలు, సామాజిక సంస్థలు తమ అభిప్రాయాలను మహిళా కమిషన్‌కు తెలియజేయవచ్చునని ప్రకటించింది. దీనిపై నిశితంగా పరిశీలన చేసి అవసరమైన మరిన్ని చర్యలు తీసుకుంటామని చెప్పింది. ఇటీవల విడుదలై రాబిన్‌హుడ్‌లోని ఐటమ్‌ సాంగ్‌లో కేతిక శర్మ నటించింది. శేఖర్‌ మాస్టర్‌ నేతృత్వంలో ఆ పాటను చిత్రీకరించారు. అదిదా సర్‌ప్రైజ్‌.. అంటూ సాగే పాటలో కేతికతోపాటు మిగతా డాన్సర్లు వేసిన హుక్‌ స్టెప్పులు అందర్నీ కలవరపరిచాయి. దీంతో ఆ పాటపై ట్రోలింగ్‌ మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే మహిళా కమిషన్‌ కూడా పాటల తీరు తెన్నులపై స్పందించడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే రాబిన్‌ హుడ్‌ మేకర్స్‌కి నోటీసులు కూడా అందినట్టు తెలుస్తోంది. ఇలాంటి ఘటనలు రిపీట్‌ అవుతున్న తరుణంలో దర్శకులు, కొరియోగ్రాఫర్లు తమ డాన్స్‌ మూమెంట్స్‌పై మరింత జాగ్రత్త వహించాలని పరిశ్రమలో చర్చ నడుస్తోంది. గ్లామర్‌, మాస్‌ మూమెంట్స్‌ ఒక కొలమానానికి మించి విస్తరిస్తే, ప్రేక్షకుల్లో అసంతృప్తి పెరుగుతుందనే అంశాన్ని గుర్తించాలి.  నిర్మాతలు, దర్శకులు హుక్‌ స్టెప్పుల విషయంలో మరింత జాగ్రత్తలు పాటించాలని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

ఇదిలా ఉంటే.. అదిదా సర్‌ప్రైజ్‌ పాటలోని స్టెప్పులపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న చర్చలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నాయి. కొందరు ఆ పాటను వ్యతిరేకిస్తుంటే.. మరికొందరు యూట్యూబ్‌లో, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లలో అమ్మాయిలు, మహిళలు చేస్తున్న డాన్స్‌ గురించి ప్రస్తావిస్తున్నారు. సినిమాల్లోని ఐటమ్‌ సాంగ్స్‌ని మించి వాళ్లు స్టెప్పులేస్తున్నారని, అవి సమాజంపై, పిల్లలపై ప్రభావం చూపించవా అని ప్రశ్నిస్తున్నారు. నిజానికి సోషల్‌ మీడియాలో ఈ ధోరణి బాగా పెరిగిపోయింది. కేవలం సినిమాని మాత్రమే దృష్టిలో పెట్టుకొని హెచ్చరికలు జారీ చేయడం హాస్యాస్పదంగా ఉందని కొందరు వాదిస్తున్నారు. మరి మహిళా కమిషన్‌.. టాలీవుడ్‌కి ఇచ్చిన వార్నింగ్‌ను ఏ విధంగా తీసుకుంటుందో, ఎలా స్పందస్తుందో చూడాలి. 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com