మహేష్ ఊరిని దత్తత తీసుకొన్నాడు ఎన్టీఆర్ ఏంచేస్తాడు?
on Aug 30, 2016
సినిమాల ప్రభావం ఎంతుందో తెలీదు గానీ పంచ్ డైలాగుల ప్రభావం మాత్రం చాలా ఉంది.. అన్నది మహేష్ బాబు డైలాగ్. అయితే.. ఆ డైలాగ్ మహేష్ విషయంలోనే రివర్స్ అయ్యింది. శ్రీమంతుడు తరవాత ఓ గ్రామాన్ని దత్తత తీసుకొని సినిమాల ప్రభావం తనమీద ఎంత ఉందో చూపించేశాడు. శ్రీమంతుడు సినిమా మహేష్‌నే కాదు.. చాలా మందిని మార్చింది. పుట్టిన ఊరిపై ప్రేమ పెరిగింది. కొరటాల శివ ఇప్పుడు మరో కాన్సెప్ట్‌ని ఎంచుకొన్నారు. అదే... మొక్కల పెంపకం. భూమి చాలా విలువైనదని, అందులో మొక్కలు ఇంకా పవిత్రమైనవన్న కాన్సెప్ట్ తో రూపుదిద్దుకొన్న చిత్రం.. జనతా గ్యారేజ్. ఈ సినిమాలో ప్రకృతి ప్రేమికుడిగా ఎన్టీఆర్ నటించాడు.
ఈ సినిమా చేస్తున్నప్పుడే జనతా ఛాలెంజ్ అంటూ ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. శ్రీమంతుడు సినిమా తరవాత మహేష్ ఊరిని దత్తత తీసుకొన్నాడు. మరి జనతా గ్యారేజ్ విడుదలైన తరవాత ఎన్టీఆర్ ఏం చేస్తాడు? ఈ సినిమా ప్రభావంతో మొక్కలు నాటడాన్ని ఓ ఉద్యమంగా తీసుకెళ్తాడా? అలా చేస్తే మంచిదే మరి. మొక్కల్ని కాపాడుకోవడం, చెట్లను సంరక్షించుకోవడం మన బాధ్యత. దాన్ని గుర్తు చేయడానికి ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో నడుం బిగిస్తే... కాస్తయినా సామాజిక స్పృహ పెరుగుతుంది. జనతా గ్యారేజ్ వల్ల నిర్మాతలకూ, బయ్యర్లకూ ఎంతొస్తుంది అన్నది పక్కన పెడితే.. ఇలాంటి కార్యక్రమాల వల్ల పర్యావరణానికి మంచి జరుగుతుంది. కమాన్ ఎన్టీఆర్...! నీ కోసం మొక్కలు ఎదురుచూస్తున్నాయ్!!