సూపర్‌స్టార్ మహేష్‌బాబు తన అన్న రమేష్‌బాబు కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని ఘనంగా చిత్రసీమలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ప్రత్యేక ఆశీస్సులు, శుభాకాంక్షలు తెలియజేశారు. 'శ్రీనివాస మంగాపురం' అనే ప్రతిష్టాత్మక చిత్రంతో జై కృష్ణ ఘట్టమనేని, రాషా తడాని టాలీవుడ్‌కి పరిచయం అవుతున్నారు. ఈ సందర్భంగా మహేష్‌బాబు ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ, తమ కుటుంబం అంతా జై కృష్ణ ఎంట్రీ పట్ల ఎంతో సంతోషంగా, ఆనందంగా, ఉత్సాహంగా ఉందని తెలిపారు. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన టీజర్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయని, ప్రమోషనల్ కంటెంట్ అంతా చాలా అద్భుతంగా ఉందో మహేష్ కొనియాడారు.
ఈ చిత్రంలో జై కృష్ణ, రాషా లీడ్ పెయిర్‌గా ఎంతో బాగున్నారని, వారిద్దరి లుక్స్ మరియు నటన చాలా ప్రామిసింగ్‌గా కనిపిస్తున్నాయని మహేష్ అభిప్రాయపడ్డారు. నటీనటులను తెరపై అంత అందంగా చూపించిన దర్శకుడు రాజీవ్ గొసపాటికి మహేష్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అలాగే, ఈ సినిమాకు పనిచేసిన సాంకేతిక నిపుణులందరూ ఎంతో కష్టపడి పనిచేశారని, వారి కష్టమే ఈ రోజు ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తోందని చెప్పారు. ముఖ్యంగా సంగీత దర్శకుడు జివి ప్రకాష్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచిందని, పాటలన్నీ ఇప్పటికే చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయని మహేష్ గుర్తుచేశారు. ఈ ఆల్బమ్‌లో తన వ్యక్తిగత ఫేవరెట్ సాంగ్ 'అల్లే అల్లే' అని, ఆ పాట తనకు ఎంతగానో నచ్చిందని మహేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ చిత్రం జూలై 30వ తేదీన గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలవుతోంది. జూలై 30వ తేదీ తన కెరీర్‌లో అత్యంత కీలకమైన 'రాజకుమారుడు' సినిమా విడుదలైన తేదీ కావడంతో, ఈ రిలీజ్ డేట్ తన మనసుకు ఎంతో దగ్గరైందని మహేష్ ఎమోషనల్ అయ్యారు. చిత్ర నిర్మాతలు రాజీవ్, వారి టీమ్ అంతా ఎంతో ప్లాన్ చేసి ఈ ప్రత్యేకమైన తేదీని ఎంచుకున్నారని ఆయన తెలిపారు. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై వైజయంతి ప్రియదర్శిని, స్వప్న దత్, ప్రొడ్యూసర్ కిరణ్ దత్ అందరూ కలిసి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారని కొనియాడారు.
గతంలో అల్లు అర్జున్, రామ్‌చరణ్, తాను స్వయంగా వైజయంతి మూవీస్ బ్యానర్‌లోనే ఇండస్ట్రీకి పరిచయమయ్యామని, ఆ బ్యానర్ తమకందరికీ ఎంతో కలిసి వచ్చిందని మహేష్ గుర్తుచేశారు. ఆ లెజెండరీ బ్యానర్‌లో జై కృష్ణ, రాషా పరిచయం కావడం వారి అదృష్టమని తెలిపారు. చివరగా, సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు, తన అభిమానులదరూ కలిసి జై కృష్ణ, రాషా జంటను మనస్ఫూర్తిగా ఆశీర్వదించి, ఆదరించాలని మహేష్ కోరారు. 'శ్రీనివాస మంగాపురం' చిత్ర బృందానికి మహేష్ ఆల్ ది బెస్ట్ చెప్పారు.




