Home

»

Latest News

సూప‌ర్‌స్టార్ వార‌సుడు మ‌హేష్‌.. మ‌రి మూడో త‌రంలో స్టార్ ఎవ‌రు?

Apr 17, 2026

- వెండితెరపై మెరవనున్న కృష్ణ మనుమలు, మనుమరాళ్లు

- టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న‌ నలుగురు వారసులు వీరే

- ఫ్యామిలీ రేసులో విన్న‌ర్ ఎవ‌రు?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 'సూపర్ స్టార్' అనే బిరుదుకు కేరాఫ్ అడ్రస్ ఘట్టమనేని కుటుంబం. దివంగత నటశేఖర కృష్ణ వేసిన బలమైన పునాదిని, ఆయన తనయుడు ప్రిన్స్ మ‌హేష్‌బాబు అగ్రస్థానానికి చేర్చి ప్రపంచవ్యాప్తంగా ఘట్టమనేని క్రేజ్‌ను చాటిచెప్పారు. అయితే ఇప్పుడు అందరి కళ్లు ఘట్టమనేని మూడో తరం పైనే ఉన్నాయి. మ‌హేష్‌బాబు తర్వాత ఆ రేంజ్ స్టార్‌డమ్‌ను అందుకునే వారసుడు ఎవరు? అనే చర్చ ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

ప్రస్తుతం ఈ మూడో తరం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు దివంగత ర‌మేష్‌బాబు కుమారుడు జయకృష్ణ సర్వం సిద్ధం చేసుకున్నారు. గతంలో మ‌హేష్‌బాబు నటించిన 'నిజం' చిత్రంలో బాల నటుడిగా మెప్పించిన జయకృష్ణ, ఇప్పుడు 'శ్రీనివాస మంగాపురం' అనే సినిమాతో వెండితెరకు పరిచయం కాబోతున్నారు. 'ఆర్‌ఎక్స్‌ 100' చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు అజయ్ భూపతి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటం విశేషం. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ కుమార్తె రషా థడానీ హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరోవైపు, సూప‌ర్‌స్టార్‌ మ‌హేష్‌బాబు తనయుడు గౌతమ్ కృష్ణ ఎంట్రీ కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. 'నేనొక్కడినే' సినిమాలో చిన్నప్పటి మహేష్‌గా నటించి తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న గౌతమ్, ప్రస్తుతం విదేశాల్లో యాక్టింగ్ కోర్స్ పూర్తి చేస్తున్నట్లు సమాచారం. తండ్రికి తగ్గ వారసుడిగా, భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో గౌతమ్ లాంచ్ ఉండాలని మ‌హేష్‌బాబు పక్కా ప్లానింగ్‌తో ఉన్నట్లు తెలుస్తోంది. గౌతమ్ లుక్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో, అతడే తర్వాతి సూపర్ స్టార్ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు.

కేవలం అబ్బాయిలే కాదు, ఘట్టమనేని ఇంటి అమ్మాయిలు కూడా గ్లామర్ ఫీల్డ్‌లో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. రమేష్ బాబు కుమార్తె భారతి ఇప్పటికే సోషల్ మీడియాలో తన డ్యాన్స్ వీడియోలతో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా ఆ కుర్చీని మ‌డ‌త‌పెట్టి.. పాటకు ఆమె వేసిన స్టెప్పులు చూసి నెటిజన్లు ఫిదా అయ్యారు. అలాగే మహేష్ ముద్దుల కుమార్తె సితార గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'సర్కారు వారి పాట' ప్రమోషనల్ సాంగ్‌లో మెరిసిన సితార, సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను సంపాదించుకుంది. భవిష్యత్తులో ఈ ఇద్దరు భామలు హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

నటి, నిర్మాత మంజుల కుమార్తె జాన్వీ స్వరూప్ కూడా ఈ రేసులో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇటీవల ఆమెకు సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్‌లో హల్చల్ చేశాయి. ఇలా ఒకే కుటుంబం నుంచి దాదాపు ఐదుగురు వారసులు వెండితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధంగా ఉండటం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ఘట్టమనేని ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన హీరో మహేష్ బాబు వారసుడు గౌతమ్ కృష్ణ ఎప్పుడు సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ మూడో తరంలో సూప‌ర్‌స్టార్ కృష్ణ  లెగసీని ఎవరు నిలబెడతారో, ఎవరు టాప్ స్టార్‌గా ఎదుగుతారో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే!

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com