Home

»

Latest News

ఓటీటీలో మహేష్‌బాబు కొత్త సినిమా.. చూడాలంటే డబ్బు కట్టాల్సిందే!

Feb 6, 2025 11:29AM

ఈమధ్యకాలంలో ఏదైనా సినిమా రిలీజ్‌ అయితే ఇంట్రెస్ట్‌ ఉన్నవాళ్ళు మొదటిరోజే థియేటర్లకు వెళ్లిపోయి చూస్తున్నారు. కొంతమంది నాలుగు రోజుల తర్వాత చూద్దాంలే అనుకుంటారు. మరికొందరు ఎలాగూ ఓటీటీలోకి వస్తుంది కదా.. అప్పుడు చూద్దాం అని ఓటీటీలో వచ్చే ఆ సినిమా కోసం ఎదురుచూస్తుంటారు. అలా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. అయితే దాన్ని చూడాలంటే ఎమౌంట్‌ పే చెయ్యాల్సిందేనంటోంది డిస్నీ సంస్థ. ఆ సినిమా పేరు ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’. ఈ సినిమాకి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులోని ప్రధాన పాత్ర అయిన ముఫాసాకు సూపర్‌స్టార్‌ మహేష్‌ డబ్బింగ్‌ చెప్పారు. ఇప్పటివరకు మహేష్‌ ఏ పాత్రకూ డబ్బింగ్‌ చెప్పలేదు. జల్సా వంటి సినిమాల్లో వాయిస్‌ ఓవర్‌ చెప్పారు తప్ప ఒక క్యారెక్టర్‌కి మాత్రం తన వాయిస్‌ ఇవ్వలేదు. 

1994లో యానిమేటెడ్‌ మూవీగా వచ్చిన ‘ది లయన్‌ కింగ్‌’ అప్పట్లో సంచలన విజయం సాధించింది. దాదాపు 25 సంవత్సరాల తర్వాత 2019లో ఇదే టైటిల్‌తో 3డి యానిమేషన్‌తోపాటు స్పెషల్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌తో రియల్‌ యానిమల్స్‌ని తలపించే విధంగా ‘ది లయన్‌ కింగ్‌’ చిత్రాన్ని నిర్మించింది డిస్నీ సంస్థ. ఈ సినిమా ఇంగ్లీష్‌తోపాటు పలు భారతీయ భాషల్లో రిలీజ్‌ అయి విజయం సాధించింది. దాని కోసం ఆయా భాషల్లోని పాపులర్‌ నటీనటులతో సినిమాలోని ప్రధాన పాత్రలకు డబ్బింగ్‌ చెప్పించారు. అలా తెలుగులో నాని, జగపతిబాబు, రవిశంకర్‌, బ్రహ్మానందం, అలీ, షేకింగ్‌ శేషు వంటి నటులతో ‘ది లయన్‌ కింగ్‌’ తెలుగు వెర్షన్‌ రూపొందింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఘనవిజయం సాధించింది. 5 సంవత్సరాల తర్వాత ఈ సినిమాకి ప్రీక్వెల్‌గా రూపొందిన సినిమాయే ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’.

ఈ సినిమా 2024 డిసెంబర్‌ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అలాగే భారతదేశంలోని పలు భాషల్లో కూడా అదేరోజున విడుదలైంది. ఈ సినిమాలోని ప్రధాన పాత్రకు మహేష్‌బాబు వాయిస్‌ ఇవ్వగా, మిగతా పాత్రలకు బ్రహ్మానందం, అలీ, సత్యదేవ్‌, అయ్యప్పశర్మ వంటి నటులు డబ్బింగ్‌ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించింది. అయితే ఈ సినిమాను థియేటర్లలో చూడని వారు ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. వారి నిరీక్షణ ఫలించి ఫిబ్రవరి 18 నుంచి డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ చిత్రం స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది. ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న లయన్‌ కింగ్‌ అభిమానులకు, మహేష్‌ అభిమానులకు డిస్నీ సంస్థ ఇక్కడే ఒక ట్విస్ట్‌ ఇచ్చింది. ఈ సినిమాను ఓటీటీలో చూడాలంటే కొంత డబ్బు పే చెయ్యాల్సి ఉంటుంది. ఉచితంగా చూడాలనుకునేవారికి ఏప్రిల్‌ 1 నుంచి ఈ సినిమా డిస్నీలో అందుబాటులో ఉంటుంది. డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ రిలీజ్‌ కాబోతోంది. 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com