మహేశ్, బన్నీ పనే బాగుంది.. 'మా' రచ్చకు దూరంగా ఫ్యామిలీస్‌తో ఎంజాయ్ చేస్తూ...!
on Oct 13, 2021
హైదరాబాద్‌లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల రచ్చ ఎలా ఉందో వారం రోజుల పైగా చూస్తున్నాం. ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు ప్యానళ్ల మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొనడం చూశాం. నరేశ్, నాగబాబు.. ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడం, వ్యక్తిగత దూషణలు చేసుకోవడం చూసి ఆశ్చర్యపోయాం. ప్రకాశ్‌రాజ్‌ను ఔట్సైడర్గా నరేశ్, మరికొంతమంది చిత్రించడం గమనించాం. అక్టోబర్ 10 ఎన్నికల రోజు ఎంత వాడి, వేడి వాతావరణం ఏర్పడిందో, 'మా' ఎన్నికలు తప్ప మరో అంశం లేదన్నట్లు అన్ని న్యూస్ చానళ్లు ఉదయం ఏడున్నర నుంచీ, అర్ధరాత్రి 12 గంటల దాకా దానినే రిపోర్ట్ చేస్తూ, లైవ్ చూపిస్తూ రావడం చూసి ఏంటిదీ అనుకుని అవాక్కయ్యాం. ఎన్నికల రిజల్ట్స్ వచ్చాయి. 'మా' నూతన అధ్యక్షుడిగా విష్ణు ఎన్నికయ్యాడు. 26 మంది ఉండే కార్యవర్గంలో అతని ప్యానల్ వాళ్లు 15 మంది గెలిచారు.
ఆ తర్వాత కూడా 'మా' వేడి చల్లారలేదు. నాగబాబు, ప్రకాశ్‌రాజ్ మా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తే, ఎన్నికల్లో గెలిచిన ప్రకాశ్‌రాజ్ ప్యానల్లోని 11 మంది సభ్యులు మా పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మోహన్‌బాబు తమను అమ్మనా బూతులు తిట్టారని బెనర్జీ, తనీశ్ కన్నీళ్లు పెట్టుకోవడం కలకలం కలిగించింది. ఇలాంటి హాట్ హాట్ అట్మాస్పియర్ హైదరాబాద్‌లో నెలకొని ఉంటే, కొంతమంది టాప్ స్టార్లు ఈ గొడవలతో, ఈ ఏడుపులు పెడబొబ్బలతో తమకేం సంబంధం లేదంటూ మా ఎన్నికలకు దూరంగా టైమ్‌ను ఎంజాయ్ చేస్తూ గడిపారు, గడుపుతున్నారు. ప్రధానంగా మహేశ్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ 'మా' ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. హైదరాబాద్‌కు దూరంగా ఉండిపోయారు.
మహేశ్ అయితే 'సర్కారువారి పాట' షూటింగ్ నిమిత్తం స్పెయిన్‌కు వెళ్లిపోయి, కుటుంబంతో జాలీగా అక్కడే గడుపుతున్నాడు. ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతున్న రోజు స్విట్జర్లాండ్‌లో స్విమ్మింగ్‌పూల్‌లో పిల్లలు గౌతమ్, సితారతో ఈతలు కొడుతూ ఎంజాయ్ చేశాడు. దానికి సంబంధించిన ఫొటోలు మహేశ్, నమ్రత తమ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్‌లో షేర్ చేశారు.
ఇక అల్లు అర్జున్ కూడా తక్కువ తినలేదు. అతను తన ఫ్యామిలీతో మాల్దీవులకు చెక్కేశాడు. కొడుకు ఆర్యన్, కూతురు అర్హతో కలిసి ఈతలు కొట్టాడు. ఆర్యన్‌తో కలిసి సైక్లింగ్ చేశాడు. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను బన్నీ భార్య స్నేహారెడ్డి తన ఇన్‌స్టా పేజీలో షేర్ చేశారు.
ఇలా టైమ్‌ను ఎంజాయ్ చేస్తున్న ఆ స్టార్లను చూస్తూ, 'వీళ్ల పనే బాగుంది.. తాము సభ్యులుగా ఉన్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ఓటేయకుండా డుమ్మా కొట్టేసి, విదేశాల్లో కుటుంబాలతో జాలీగా గడుపుతున్నారు. 'మా' సభ్యుల మధ్య రచ్చ జరుగుతుంటే, ఆ గొడవేమీ పట్టకుండా హ్యాపీగా తమ లోకంలో తామున్నారు' అనుకుంటున్నారు ఇండస్ట్రీ జనాలు.
Also Read