Home

»

Latest News

ఎన్టీఆర్, ఏఎన్నార్‌లకు ధీటుగా సావిత్రి.. అందుకే మహానటి అయ్యారు: జయప్రద

Jul 11, 2026 1:07PM

తెలుగు చలనచిత్ర పరిశ్రమ హిస్టరీలో ఎందరో నటీమణులు వచ్చారు, వెళ్లారు. కానీ, తరాలు మారినా, యుగాలు దాటినా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఏకైక నటి మాత్రం 'మహానటి' సావిత్రి. ఆ అద్భుత నటి, అభినయ సామ్రాజ్ఞి 90వ జయంతి వేడుకలు హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ (FNCC) లో అత్యంత ఘనంగా జరిగాయి. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని సినీ చరిత్రకారుడు, ప్రముఖ రచయిత సంజయ్‌ కిషోర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన 'సావిత్రి క్లాసిక్స్' (Savitri Classics) ఆంగ్ల పుస్తకావిష్కరణ కార్యక్రమం సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల సమక్షంలో కన్నులపండువగా నిర్వహించారు. గతంలో తెలుగులో విడుదలైన ఈ పుస్తకానికి 100 శాతం అద్భుతమైన స్పందన లభించగా, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సావిత్రమ్మ అభిమానుల కోసం దీని ఇంగ్లీష్ ఎడిషన్‌ను జూలై 10న గ్రాండ్‌గా లాంచ్ చేశారు.

ఈ అపురూప వేడుకకు సీనియర్ స్టార్ హీరోయిన్, మాజీ ఎంపీ జయప్రద ముఖ్య అతిథిగా విచ్చేసి 'సావిత్రి క్లాసిక్స్' ఇంగ్లీష్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జయప్రద మాట్లాడుతూ.. సావిత్రమ్మ నటించిన 47 అత్యుత్తమ క్లాసిక్ చిత్రాల విశేషాలతో కూడిన ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయడం తన పూర్వజన్మ సుకృతంగా, జీవితంలో దక్కిన అతిపెద్ద అదృష్టంగా భావిస్తున్నానని ఎమోషనల్ అయ్యారు. స్టేజ్ పైన ఉన్న సావిత్రి గారి కుమార్తె విజయ చాముండేశ్వరి గారిని చూస్తుంటే, సావిత్రమ్మ గారే స్వయంగా మా ఇంటికి నడచి వచ్చినట్లు అనిపించిందని ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా చెప్పారు. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి అగ్ర కథానాయకులకు సైతం స్టార్ ఇమేజ్, నటనలో సమానంగా ధీటుగా నిలబడ్డారు కాబట్టే ఆమెకు 'మహానటి' అనే అద్భుతమైన బిరుదు దక్కిందని కొనియాడారు.

ఈ పుస్తకావిష్కరణ సభలో హాస్యనటుడు బ్రహ్మానందం, టాలీవుడ్ ప్రముఖ దర్శకులు, సావిత్రి గారి కుమారుడు సతీష్ కుమార్ లతో పాటు వందలాది మంది సినీ అభిమానులు పాల్గొన్నారు. రచయిత సంజయ్ కిషోర్ కొన్నేళ్లుగా సావిత్రి రేర్ ఫోటో ఎగ్జిబిషన్స్ నిర్వహిస్తూ, ఆమె జీవితాన్ని భావితరాలకు అందిస్తున్న తీరును అతిథులంతా అభినందించారు. ఒకప్పుడు సినిమా ప్రియులు రామాయణం, మహాభారతం వంటి పవిత్ర గ్రంథాలను ఇంట్లో ఎలా దాచుకునేవారో, సినిమాను ప్రేమించే ప్రతి ఒక్కరూ ఈ 'సావిత్రి క్లాసిక్స్' పుస్తకాన్ని అలానే దాచుకోవాలని బ్రహ్మానందం పేర్కొనడం విశేషం. 
 

 

Mahanati Savitri, Savitri Classics, Jayaprada, Brahmanandam, Sanjay Kishore

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com