
యునైటెడ్ కింగ్‌డమ్ తెలుగు అసోసియేషన్ 6వ వార్షికోత్సవ వేడుకలకు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తెలుగుజాతి గొప్పదనాన్ని, తెలుగు సంస్కృతి గురించి ఉద్వేగంగా ప్రసంగించారు. కళ అనేది సంస్కృతిలో భాగమని, మన భాష, యాసని మరచిపోకూడదన్నారు. తన సినిమాల ద్వారా సంప్రదాయాల్ని ప్రోత్సహిస్తానని, తెలుగు ప్రాంతాల జానపద గీతాలు తన సినిమాల్లో ఉండేలా చూస్తానని పేర్కొన్నారు.

తెలుగు సంప్రదాయాల్ని భావితరాలకు పంచేందుకు ఇలాంటి ఉత్సవాలు ఎంతో సాయం చేస్తాయని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో దశావతరం, మహిషాసురమర్థని, యక్షగానంతో పాటు రకరకాల నాటకాలు, జానపద నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పవన్‌ని చూసేందుకు పెద్ద ఎత్తున తెలుగువారు తరలిరావడంతో ఆడిటోరియం కిక్కిరిసిపోయింది.







