
అఖిల్ అక్కినేని నటించిన రూరల్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’ ఎట్టకేలకు శుక్రవారం థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులను అలరిస్తోంది. మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది.
ఈ మూవీ ఫస్ట్ డే అధికారిక కలెక్షన్ల పోస్టర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ అఫీషియల్ పోస్టర్ ప్రకారం, 'లెనిన్' చిత్రం మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 16.7 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి సరికొత్త రికార్డు సృష్టించింది. మేకర్స్ ప్రకటించిన ఈ అఫీషియల్ గ్రాస్ వసూళ్లు అక్కినేని అభిమానుల్లో సరికొత్త జోష్ నింపాయి.
ఈ చిత్రంలో అఖిల్ అక్కినేని ఊరమాస్ లుక్‌లో కనిపించి థియేటర్లలో ఈలలు వేయిస్తున్నారు. ముఖ్యంగా చిత్తూరు మాండలికంలో ఆయన చెప్పిన డైలాగులు, ఊరమాస్ యాక్షన్ సీక్వెన్సులు మాస్ ఆడియన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నాయి. ఎమోషనల్ సీన్స్ లోనూ తన నటనతో కట్టిపడేసాడు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన భాగ్యశ్రీ బోర్సే తన నటనతో, గ్లామర్‌తో అందరినీ ఆకట్టుకోగా, థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించింది.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, మనం ఎంటర్‌ప్రైజెస్ సంయుక్తంగా నిర్మించిన ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు తెలుగు రాష్ట్రాలలో అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి. 'లెనిన్' ప్రభంజనం కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు. ఓవర్సీస్ మార్కెట్‌తో పాటు కర్ణాటక, తమిళనాడు వంటి ఇతర పొరుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు డీసెంట్ కలెక్షన్స్ వచ్చాయి. లాంగ్ రన్ లో ఈ సినిమా మరిన్ని భారీ వసూళ్లను సాధిస్తుందని డిస్ట్రిబ్యూటర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మొదటి రోజు వచ్చిన ఈ 16.7 కోట్ల రూపాయల వరల్డ్ వైడ్ గ్రాస్ వసూళ్లు, వీకెండ్ లో మరింత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అఖిల్ అక్కినేని మాస్ మేకోవర్, పవర్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషనల్ కంటెంట్ ఈ చిత్ర విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. మొత్తానికి మేకర్స్ వదిలిన ఈ డే 1 అఫీషియల్ కలెక్షన్ల పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.






