
అభివృద్ధి చెందుతోన్న నగరంతో పాటు ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ఎంత మారినా కూడా కొన్నింటిని వదులుకోవడం మాత్రం అంత సులభం కాదు. ముఖ్యంగా మనకు ఎంతో అనుబంధం ఉన్న ఇంటిని వదిలిపెట్టడం మరింత కష్టం. ఇలాంటి ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రమే ‘లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్’.
మనోజ్ బాజ్పాయ్, బోమన్ ఇరానీ, దివ్య దత్తా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఓ రిటైర్డ్ టీచర్ చుట్టూ తిరుగుతుంది. ముంబైలోని ఓ అపార్ట్మెంట్లో నివసించే ఆయన.. ఆ భవనాన్ని పునర్నిర్మించేందుకు భారీ మొత్తంలో డబ్బు ఇస్తామన్న ఆఫర్ వచ్చినా.. ఇల్లు ఖాళీ చేయడానికి అంగీకరించడు. తనకు ఎంతో ఇష్టమైన ఇంటిని కాపాడుకోవడం కోసం ఏకంగా ఆ హౌసింగ్ సొసైటీలోని అందరినీ ఎదిరిస్తాడు. ఒక వ్యక్తి తన ఇంటి కోసం ఎంతవరకు పోరాడగలడు? ఈ క్రమంలో ఎదురయ్యే పరిణామాలేంటి? అనే ఆసక్తికర అంశాలతో ఈ డ్రామా తెరకెక్కింది. ఈ హిందీ చిత్రం నవంబర్ 6 నుంచి జీ5లో ప్రీమియర్ కానుంది.
రానా దగ్గుబాటి నిర్మాణ సంస్థ స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని నిర్మించింది. బెన్ రేఖి దర్శకత్వం వహించారు. అరవింద్ అడిగా రాసిన ఇదే పేరుతో ఉన్న నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ముంబైలోని ఓ పాత హౌసింగ్ సొసైటీ నేపథ్యంలో ‘లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్’ కథ సాగుతుంది. ఇందులో మనోజ్ బాజ్పాయ్ యోగేశ్ మిశ్రా అనే రిటైర్డ్ ఫిజిక్స్ టీచర్ పాత్రలో కనిపిస్తారు. ఆ అపార్ట్మెంట్లోని మిగతా వారంతా రీడెవలప్మెంట్ ఒప్పందానికి అంగీకరించగా.. యోగేశ్ మాత్రం అందుకు ఒప్పుకోకుండా ఒంటరిగా పోరాటం చేస్తాడు. ఈ ఒప్పందం వల్ల తమకు మంచి భవిష్యత్తు ఉంటుందని అందరూ అనుకుంటారు. కానీ యోగేశ్ మాత్రం తనకు ఎంతో అనుబంధం ఉన్న ఇంటిని, అక్కడి మనుషుల మధ్య ఉన్న ఆత్మీయతను వదులుకోవడానికి ఇష్టపడడు. అయితే ఆయన తీసుకున్న నిర్ణయం క్రమంగా పరిస్థితులను మార్చేస్తుంది. ఒకప్పుడు తన స్నేహితులుగా భావించిన వారే ఆయనకు దూరమవుతారు. తమ ఆశలు, ఆకాంక్షలకు యోగేశ్ అడ్డుపడుతున్నాడని భావించి అతడిని ఓ పరాయివాడిలా చూడటం మొదలుపెడతారు. ఇలా తన ఇంటిని కాపాడుకోవాలనే ఓ వ్యక్తి పట్టుదల.. చివరకు అతడిని తన వాళ్లకే దూరం చేసే పరిస్థితులకు ఎలా దారితీసిందన్నదే ఈ సినిమా కథాంశం.
ఇది కూడా చదవండి: ‘రామాయణ’ రివ్యూ ఇచ్చిన దిల్ రాజు.!
[Last Man In Tower Movie, Manoj Bajpayee, Divya Dutta, Boman Irani, Rana Daggubati, Spirit Media, Hindi Zee 5, Aravind Adiga]






