
టాలీవుడ్‌లో మరో లవ్ స్టోరీ అఫీషియల్ అయింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ వార్త నిజమేనని తేలిపోయింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి తనయుడు, సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ, 'బలగం' ఫేమ్ నటి కావ్య కళ్యాణ్‌రామ్ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందంటూ ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. తాజాగా కాలభైరవ షేర్ చేసిన ఒక బ్యూటిఫుల్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో వీళ్లిద్దరి రిలేషన్‌షిప్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయింది.
కావ్యతో దిగిన క్యూట్ ఫోటోలను షేర్ చేస్తూ, గుండెల్లోని భావాలన్నింటినీ ఒక పోయెటిక్ అండ్ మెలోడియస్ నోట్‌లా రాసుకొచ్చారు కాలభైరవ . "కావ్య బాబు.. నీతో గడిపే ప్రతి క్షణం పర్వతాల మధ్య కూర్చుని ప్రశాంతమైన నీటి ప్రవాహాన్ని చూస్తున్నట్లు ఉంటుంది" అంటూ ఎంతో రోమాంటిక్‌గా తన ప్రేమను వ్యక్తం చేశారు.
అంతేకాదు.. నీతో కలిసి ఏ పని చేసినా అదొక ముగింపు లేని సుదీర్ఘమైన వెకేషన్‌లా అనిపిస్తుందని, చలికాలంలో పొద్దున్నే తాగే హాట్ కాఫీలా నీతో సంభాషణలు హాయినిస్తాయని చెప్పారు. "నాలో కలుగుతున్న ఈ మధురానుభూతికి ఇన్నాళ్లూ పేరు పెట్టలేకపోయాను.. కానీ మన ప్రయాణంలో నాకు ఒక విషయం అర్థమైంది. అదేంటంటే.. ఇది 'సొంత ఇల్లు' అనే భావన. నిన్ను మొదటిసారి కలిసినప్పుడు ఒక కొత్త వ్యక్తిని కలిసినట్లు అనిపించలేదు, సొంత ఇంటికి తిరిగొచ్చినట్లే అనిపించింది. ఇక ఆ ఇంటిని వదిలి నేనెప్పుడూ బయటకు వెళ్లలేదు" అంటూ కాలభైరవ రాసిన ఆ పదాలు నెటిజన్ల హృదయాలను పిండేస్తున్నాయి.
ఎం.ఎం. కీరవాణి వారసుడిగా టాలీవుడ్‌లో సింగర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కాలభైరవ.. అటు 'గంగోత్రి'లో బాలనటిగా నటించి, ఆ తర్వాత 'మసూద', 'బలగం' సినిమాలతో హీరోయిన్‌గా మెప్పించిన కావ్య కళ్యాణ్‌రామ్‌తో ఏడడుగులు వేయబోతుండటం విశేషం. వీళ్ల జంట నిజంగానే ఎంతో చూడముచ్చటగా ఉందంటూ సినీ ప్రముఖులు, నెటిజన్లు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
[Kaala Bhairava, Kaavya Kalyanram, Relationship, Love Story, Wedding, MM Keeravani, Telugu Film News, Telugu News]






