Home

»

Latest News

‘చుట్టమల్లే’ డీప్‌ఫేక్ వివాదంలో మరో ట్విస్ట్.. సీపీ సజ్జనార్ ఫొటోను కూడా వ‌దల్లేదు.!

Oct 8, 2026 5:07PM

‘దేవర’ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ నటించిన ‘చుట్టమల్లే’ పాటకు సంబంధించిన డీప్‌ఫేక్ వీడియో వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఈ పాటకు చెందిన అసలు వీడియోను మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా మార్చి సోషల్ మీడియాలో ప్రచారం చేయడంపై జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ తీవ్రంగా స్పందించారు. ఈ క్రమంలో తాజాగా ఇదే వ్యవహారానికి సంబంధించి మరో నకిలీ ప్రచారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

‘చుట్టమల్లే’ పాటను అసభ్యంగా ఎడిట్ చేసిన వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారంటూ ఓ పోస్టు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అందులో పోలీసుల చర్యకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లుగా హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ఫొటోను కూడా ఉపయోగించారు. అయితే ఈ ఫొటో అసలైనది కాదని సజ్జనార్ స్పష్టం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో రూపొందించిన డీప్‌ఫేక్ ఫొటోను తన అసలు ఫొటోలా చూపిస్తూ ప్రచారం చేస్తున్నారని ఆయన తెలిపారు.

సోషల్ మీడియాలో కనిపించే ప్రతి ఫొటో, వీడియోను నిజమని నమ్మవద్దని సజ్జనార్ ప్రజలకు సూచించారు. ఏదైనా వార్త లేదా ఫొటోను షేర్ చేసే ముందు దాని నిజానిజాలను నిర్ధారించుకోవాలని కోరారు. ముఖ్యంగా సెలబ్రిటీలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, అలాగే పోలీసులు తీసుకున్న చర్యలకు సంబంధించిన పోస్టుల విషయంలో అధికారిక సమాచారం ద్వారా వాస్తవాలను నిర్ధారించుకోవాలని సూచించారు. ఏఐ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ నకిలీ కంటెంట్‌ను గుర్తించడం మరింత కష్టంగా మారుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదే సమయంలో తన ఫొటోను కొందరు అభిమానులు ఇలా దుర్వినియోగం చేస్తున్న విషయాన్ని గమనించాలని కోరుతూ సజ్జనార్ జూనియర్ ఎన్టీఆర్‌ను ట్యాగ్ చేశారు. అభిమానుల పేరుతో ఏఐ ద్వారా నకిలీ ఫొటోలు రూపొందించి ప్రచారం చేయడం వల్ల తప్పుడు సమాచారం మరింత వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ‘చుట్టమల్లే’ డీప్‌ఫేక్ వివాదం నేపథ్యంలో ఇప్పటికే సినీ ప్రముఖులు దీనిపై తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా సీపీ సజ్జనార్ ఫొటోను కూడా ఉపయోగించి మరో ఫేక్ ప్రచారం జరగడంతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది.

 

 

 

[Jr NTR, Janhvi Kapoor, Chuttamalle Deepfake Video, Devara Movie, CP Sajjanar, VC Sajjanar, AI Deepfake, Chuttamalle Song, Jr NTR Fans, Devara Deepfake Controversy, Hyderabad Police, Fake AI Photo, Janhvi Kapoor Deepfake, Telugu Cinema, AI Fake News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com