ఎన్టీఆర్ అదిరిపోయే లైనప్.. దేవర-2 ఉందా లేదా..?
on Jun 14, 2025
'ఆర్ఆర్ఆర్'కి ముందు దాదాపు నాలుగేళ్లు ప్రేక్షకులను పలకరించని జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR).. ఇప్పుడు ఆ గ్యాప్ ని భర్తీ చేసేలా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే బాలీవుడ్ ఫిల్మ్ 'వార్-2' షూటింగ్ పూర్తి చేశాడు. ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో 'డ్రాగన్' చేస్తున్నాడు. జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం.. వచ్చే ఏడాది జూన్ 25న విడుదల కానుంది. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. వీటి తర్వాతి ఎన్టీఆర్ చేయనున్న సినిమాల విషయంలోనే సస్పెన్స్ నెలకొంది.
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 'దేవర-2' చేయాల్సి ఉంది. అలాగే దర్శకులు నెల్సన్, త్రివిక్రమ్ లతో సినిమాలు కమిటై ఉన్నాడు. అయితే వీటిలో ఏది ముందు, ఏది వెనుక? అసలు దేవర-2 ఉంటుందా లేదా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
నిజానికి దేవర సినిమా ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది. ఎన్టీఆర్ స్టార్డంతోనే ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టి, విజయం సాధించింది. అందుకే 'దేవర-2' ఉండకపోవచ్చనే అభిప్రాయాలు ముందు నుంచి ఉన్నాయి. అయితే ఎన్టీఆర్ మాత్రం.. ఖచ్చితంగా దేవర-2 ఉంటుందని స్పష్టం చేశాడు. దాంతో డ్రాగన్ తర్వాత.. దేవర-2, నెల్సన్ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ చేస్తాడని అందరూ భావించారు. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ ప్రాజెక్ట్ తెరపైకి రావడంతో.. మళ్ళీ దేవర సీక్వెల్ పై డౌట్స్ వస్తున్నాయి.
అయితే ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట ప్రకారం.. దేవర-2 ప్రాజెక్ట్ ఖచ్చితంగా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే డైలాగ్ వెర్షన్ తో సహా స్క్రిప్ట్ కూడా రెడీ అయిందట. ఎన్టీఆర్ ఎప్పుడు సై అంటే అప్పుడు షూట్ కి వెళ్ళడమే అంటున్నారు.
'డ్రాగన్' తర్వాత అటు దేవర-2, ఇటు నెల్సన్ ప్రాజెక్ట్.. రెండూ పారలల్ గా షూట్ చేసే ఆలోచనలో ఎన్టీఆర్ ఉన్నాడట. రెండూ యాక్షన్ సినిమాలే కావడంతో.. బాడీ మేకోవర్ పరంగా పెద్దగా చేంజెస్ ఉండవు. అందుకే 'డ్రాగన్' పూర్తి కాగానే.. ఏడాది గ్యాప్ లో ఈ రెండు సినిమాల షూటింగ్ పూర్తి చేయాలని ఎన్టీఆర్ భావిస్తున్నాడట. ఈలోపు త్రివిక్రమ్ కూడా వెంకటేష్ సినిమాని కంప్లీట్ చేస్తాడు. అలాగే, ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కనుంది భారీ బడ్జెట్ మైథలాజికల్ ఫిల్మ్. అందుకు తగ్గ ప్రిపరేషన్స్ కూడా ఈలోపు పూర్తి చేస్తారట.
మొత్తానికి ప్రస్తుతం సమాచారం ప్రకారం ఎన్టీఆర్ లైనప్ ఏంటంటే.. వార్-2, ఎన్టీఆర్-నీల్, దేవర-2, ఎన్టీఆర్-నెల్సన్, ఎన్టీఆర్-త్రివిక్రమ్. మరి వీటిలో మీరు ఏ సినిమా కోసం ఎక్కువగా ఎదురుచూస్తున్నారో కామెంట్ చేసేయండి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
