
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా వస్తుందన్నా, ఆయన పుట్టినరోజు వస్తుందన్నా అభిమానులకు అదొక పెద్ద పండగ. తాజాగా తారక్ తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా అర్ధరాత్రి వేళ తన ఇంటి వద్దకు భారీగా తరలివచ్చిన అభిమానులను స్వయంగా కలిసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. (Jr NTR Birthday)
అర్ధరాత్రి నుంచే ఎన్టీఆర్ నివాసం వెలుపల అభిమానులు పెద్ద ఎత్తున గుమిగూడారు. చేతుల్లో మొబైల్ ఫ్లాష్ లైట్లు ఆన్ చేసి, తారక్ పేరును నినదిస్తూ ఆ ప్రాంతాన్ని ఒక రేంజ్‌లో హోరెత్తించారు. అభిమానుల కోలాహలం, వారి నినాదాల మధ్య ఎన్టీఆర్ బయటకు వచ్చి, ఫెన్సింగ్ అవతలి వైపు ఉన్న ఫ్యాన్స్ అందరికీ అభివాదం చేశారు.
తనను చూసేందుకు అంత రాత్రి వేళ అంత దూరం వచ్చిన అభిమానులను చూసి తారక్ ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. సెక్యూరిటీ సిబ్బంది పరిస్థితిని అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, ఎన్టీఆర్ ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఫెన్సింగ్ దగ్గరకు వెళ్లారు. అక్కడ ఉన్న అభిమానులకు షేక్ హ్యాండ్ ఇస్తూ, వారి ప్రేమకు చేతులు జోడించి ధన్యవాదాలు తెలిపారు.
ఈ క్రమంలో అభిమానులు "జై ఎన్టీఆర్" అంటూ పెద్ద పెట్టున కేకలు వేశారు. ఫ్యాన్స్ చూపించిన ఈ అపారమైన అభిమానానికి తారక్ ముఖంలో ఆనందం స్పష్టంగా కనిపించింది.
ప్రస్తుతం ఎన్టీఆర్ తన తదుపరి భారీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'డ్రాగన్'పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తారక్ బర్త్‌డే కానుకగా విడుదలైన గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
తన బిజీ షెడ్యూల్స్ లోనూ అభిమానుల కోసం సమయం కేటాయించి, వారిని స్వయంగా కలిసి అభినందనలు తెలపడం ఎన్టీఆర్‌కు అభిమానులపై ఉన్న ప్రేమాభిమానాలకు నిదర్శనం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు, నందమూరి అభిమానులు లవ్ ఎమోజీలతో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు తెలుగువన్ సినిమా తరపున జన్మదిన శుభాకాంక్షలు!





