
టాలీవుడ్‌లో కమెడియన్లు హీరోలుగా మారి సక్సెస్ అందుకున్న వారు బాగానే ఉన్నారు. కమెడియన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సత్య (Satya), ఇప్పుడు 'జెట్లీ' (Jetlee) మూవీతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 'మత్తు వదలరా' ఫేమ్ రితేష్ రాణా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, నేడు(మే 1) థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే ఓవర్సీస్, ఎర్లీ షోలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సోషల్ మీడియా వేదికగా ఎలాంటి టాక్ వస్తుందో చూద్దాం. (Jetlee Twitter Review)
కథా నేపథ్యం ఏమిటి?
ఈ సినిమా కథ మొత్తం ఒక విమాన ప్రయాణం చుట్టూ తిరుగుతుంది. దుబాయ్ నుండి కొచ్చికి వెళ్తున్న ఒక విమానంలో అనుకోని పరిస్థితుల్లో చిక్కుకున్న ప్రయాణికులు, అందులో ఉండే ఒక పరారీలో ఉన్న బిలియనీర్, అలాగే తన గతాన్ని మర్చిపోయిన ఒక వ్యక్తి (సత్య) చుట్టూ రితేష్ రాణా ఈ కథను అల్లాడు. దాదాపు 80 శాతం సినిమా విమానంలోనే సాగడం విశేషం.
ట్విట్టర్ రివ్యూ:
ట్విట్టర్ (X) లో వస్తున్న రియాక్షన్స్ ప్రకారం, సినిమాకు 'మిక్స్డ్ టు పాజిటివ్' టాక్ లభిస్తోంది. సినిమా స్టార్టింగ్ బాగున్నప్పటికీ, కథ ముందుకు నడుస్తున్న కొద్దీ గాడి తప్పిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ తేలిపోయింది అంటున్నారు. అయితే మళ్ళీ ప్రీ క్లైమాక్స్ మాత్రం మెప్పించిందట. అలాగే సత్య కామెడీ టైమింగ్ గురించి అందరూ ప్రశంసిస్తున్నారు. సత్య తన నటనతో సినిమాను నిలబెట్టాడని అభిప్రాయపడుతున్నారు.
జెట్లీ మూవీ రితేష్ రాణా మార్క్ కామెడీతో సాగుతుంది. సెటప్ బాగుంది, సత్య వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రితేష్ రాణా గత చిత్రాల తరహాలోనే ఇందులోనూ క్విర్కీ కామెడీ పుష్కలంగా ఉందని ఫ్యాన్స్ చెబుతున్నారు. మరికొందరు నెటిజన్లు మాత్రం సినిమా నిడివి, కొన్ని ల్యాగ్ సీన్ల గురించి ప్రస్తావిస్తున్నారు. వెన్నెల కిశోర్ పాత్ర ఆశించిన స్థాయిలో లేదని అంటున్నారు.
ప్లస్ పాయింట్లు: సత్య నటన మరియు కామెడీ టైమింగ్, రితేష్ రాణా డైరెక్షన్ స్టైల్, కాల భైరవ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. విమానం సెట్ క్వాలిటీ కూడా చాలా బాగుందని టాక్.
మైనస్ పాయింట్లు: సెకండ్ హాఫ్‌లో కొన్ని చోట్ల కథ నెమ్మదించడం, కొన్ని లాజిక్ లేని సీన్లు, వెన్నెల కిశోర్ వంటి స్టార్ కమెడియన్‌ను ఇంకాస్త బాగా వాడుకోవాల్సిందనే కామెంట్స్ వస్తున్నాయి.
మొత్తం మీద 'జెట్లీ' ఒక వినూత్నమైన కామెడీ ఎంటర్టైనర్ అని నెటిజన్లు చెబుతున్నారు. సత్య కామెడీని ఇష్టపడే వారికి, రితేష్ రాణా మార్క్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఒక మంచి ఆప్షన్ కావచ్చు. మేడే హాలిడే కావడం ఈ సినిమాకు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ వీకెండ్ లో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లను సాధిస్తుందో చూడాలి.






