
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కథానాయకుడిగా నటించిన ‘పెద్ది’ (Peddi) చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. కానీ ఈ బ్లాక్‌బస్టర్ విజయం వెనుక వివాదాలు, ఆసక్తికరమైన చర్చలు కూడా అంతే జోరుగా నడుస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో విలక్షణ నటుడు జగపతిబాబు (Jagapathi Babu) పోషించిన ‘అప్పలసూరి’ పాత్ర ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
సాధారణంగా ఒక సినిమా పూర్తయిన తర్వాత నటీనటులు తమకు రావలసిన రెమ్యూనరేషన్ తీసుకుని సైలెంట్ అయిపోతుంటారు. అయితే సినిమాను మనస్ఫూర్తిగా ఓన్ చేసుకున్నప్పుడు, తాము ప్రాణం పెట్టి నటించిన సీన్స్ వెండితెరపై కనిపించకపోతే ఏ నటుడికైనా ఆవేదన కలగడం సహజం. ఇప్పుడు జగ్గూ భాయ్ విషయంలో అదే జరిగింది. ‘పెద్ది’ చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సానా(Buchi Babu Sana)పై జగపతిబాబు చేసిన సంచలన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి.
తన తాజా ఇంటర్వ్యూలో జగపతిబాబు ఈ సినిమాకు సంబంధించి ఎవరూ ఊహించని నిజాలను బయటపెట్టారు. సినిమాలో రామ్ చరణ్ పోషించిన పెద్ది పాత్రకు, తన అప్పలసూరి పాత్రకు మధ్య అత్యంత అద్భుతమైన ఎమోషనల్ బాండింగ్ సీన్స్ ఉన్నాయని ఆయన తెలిపారు. సినిమా చూసిన ప్రేక్షకులు కూడా సూరి, పెద్ది పాత్రల మధ్య మరింత బలమైన బంధాన్ని చూపిస్తే బాగుండేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు.
నిజానికి ఆ బాండింగ్‌ను ఎలివేట్ చేసే ఎన్నో అద్భుతమైన సన్నివేశాలను దర్శకుడు బుచ్చిబాబు షూట్ చేశారని, కానీ ఫైనల్ ఎడిటింగ్‌లో వాటిని పూర్తిగా కట్ చేశారని జగ్గూ భాయ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నటుడిగా ఎంతో కాలం తర్వాత తనను పూర్తిగా సంతృప్తి పరిచిన క్యారెక్టర్ ఇదని, అలాంటిది కీలకమైన సీన్స్ తొలగించడంతో తనకు తీవ్రమైన కోపం వచ్చిందని ఓపెన్‌గా చెప్పారు.
ఈ విషయమై తాను డైరెక్టర్ బుచ్చిబాబుతో నేరుగా గొడవకు దిగానని జగపతిబాబు వెల్లడించారు. సినిమా లెంగ్త్ ఎక్కువవుతుందనే కారణంతోనే ఆ సీన్స్ తీసేయాల్సి వచ్చిందని బుచ్చిబాబు తనకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారని, అయితే ఆ రీజన్‌ను తాను అస్సలు ఒప్పుకోలేదని జగ్గూ భాయ్ స్పష్టం చేశారు. బహుశా ఆ సన్నివేశాలు దర్శకుడికి నచ్చి ఉండకపోవచ్చని, అందుకే కావాలనే డిలీట్ చేశారేమోననే అనుమానాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. తాను ఏనాడూ ఏ సినిమా విషయంలోనూ ఇలా మాట్లాడలేదని, కేవలం తన పాత్రకు న్యాయం జరిగిందా లేదా అని మాత్రమే ఆలోచిస్తానని, కానీ ‘పెద్ది’ కోసం తాను ఎంతో కష్టపడ్డానని గుర్తుచేశారు.
చివరకు జగపతిబాబు డైరెక్టర్‌కు ఒక వినూత్నమైన డిమాండ్ కూడా పెట్టారు. సినిమాలో ఎలాగూ కట్ చేశారు కాబట్టి, ఆ డిలీట్ చేసిన సీన్స్‌ను కనీసం తనకైనా ఇచ్చేయాలని, వాటిని తన వ్యక్తిగత ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసుకుంటానని బుచ్చిబాబును అడిగినట్లు చెప్పారు. అయితే ఈ ప్రతిపాదనపై దర్శకుడు బుచ్చిబాబు సానా నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాధానం రాలేదని జగపతిబాబు చెప్పారు. జగపతిబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.






