
-సినిమా పేరు: ఇరుముడి
-నటీనటులు:రవితేజ, ప్రియా భవానీ శంకర్, బేబీ నక్షత్ర, శ్వాసిక విజయ్, అజయ్ ఘోష్ తదితరులు
-సినిమాటోగ్రఫీ: విష్ణు శర్మ
-ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
-మ్యూజిక్: జివి ప్రకాష్ కుమార్
-నిర్మాతలు: నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి
-బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్
-రచన,దర్శకత్వం: శివ నిర్వాణ
-రిలీజ్ డేట్ : ఆగష్టు 21 ,2026
మాస్ మహారాజా రవితేజ ఈ రోజు ప్రియా భవాని శంకర్, బేబీ నక్షత్ర, శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి 'ఇరుముడి' తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యాడు. అభిమానుల్లో, ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్రేషన్ ఉన్న ఇరుముడి ఎలా ఉందో చూద్దాం.
కథ
త్రినాధ్( రవితేజ) ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలోని పచ్చని అటవీ ప్రాంతంలో ఉండే పొల్లూరు అనే విలేజ్ కి చెందిన వ్యక్తి. ట్రాలీ ఆటోలో తన పొలంలోనే పండించిన అరటిగెలలని తన ఊరు పక్కన ఉండే టౌన్ లో అమ్ముకుంటూ జీవనాన్ని కొనసాగిస్తుంటాడు. ఆల్కహాల్ తాగే అలవాటు ఉన్నా మంచి వ్యక్తి. అయ్యప్పస్వామి దీక్ష తీసుకునే టైంలో మాత్రం ఆల్కహాల్ జోలికి వెళ్ళడు. ఆడవాళ్ళ అందర్నీ తన కూతురుగా భావించడంతో పాటు చెడుని అంతం చేయడం త్రినాధ్ నైజం. భార్య పేరు కావేరి. కూతురుపేరు మణికంఠ. తొమ్మిదేళ్ల వయసు ఉన్న మణికంఠ ఐదవ క్లాస్ చదువుతుంటుంది. ఏవైనా చెడు సంఘటనలు, అసాంఘిక కార్యక్రమాలు చూసినా తండ్రికి చెప్పడం అలవాటు. ఆ విధంగా చెప్పడం చిన్నప్పట్నుంచి తండ్రి, కూతురు మధ్య ఉన్న ఒప్పందం కూడా. మరి ఆ ఒప్పందం తండ్రి కూతుళ్ళ జీవితంలో ఏమైనా మార్పులు తీసుకొచ్చిందా? వస్తే ఆ మార్పులు ఏంటి? పరిచయమైన కొత్త క్యారెక్టర్స్ ఎవరు? సమాజానికి ఏమైనా మంచి జరిగిందా అనేదే ఇరుముడి
ఎనాలసిస్
సీలేరు లాంటి ఏరియాలో కంప్లీట్ లైవ్ లొకేషన్స్ లో ప్రశాంతమైన వాతావరణంలో మూవీ ఫస్ట్ నుంచి చివరి వరకు బోర్ కొట్టకుండా సాగింది. ఫుల్ ఫ్లెడ్డ్ ఎమోషనల్ రైడ్. కూతుళ్ళని పెంచే ఇద్దరు తండ్రుల పెంపకం గురించి చెప్పిన విధానం ఆలోచింపచేయడంతో పాటు కట్టిపడేస్తుంది. మూవీ మొత్తం రవితేజ కనిపించలేదు. త్రినాధ్ మాత్రమే కనిపించాడు.దర్శక నిర్మాతలు తాము ఎంచుకున్న కథని దైర్యంగా ప్రతి సీన్ ని ఎలా చెప్పాలో ఆ విధంగా చెప్పారు. జీవీ ప్రకాష్ కుమార్ నుంచి వచ్చిన కథకి తగ్గ లిరిక్స్, ఆర్ ఆర్ ఇరుముడిని మన హృదయాల్లో నిలుపుతుంది.ముఖ్యంగా స్కూల్ వయసు ఉన్న పిల్లలు, తల్లి తండ్రులు తప్పక చూడాల్సిన మూవీ. ఈ కలియుగంలో ఇలాంటి మూవీ రావాల్సిన అవసరం కూడా ఉంది.
ఫస్ట్ హాఫ్ చూసుకుంటే స్టార్టింగ్ సీన్ నార్మల్ గానే ఉందని అనిపించినా, ఆ సీన్ ఇంపాక్ట్ సెకండ్ హాఫ్ లో తెలిసాక కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉంటాం. మణికంఠ, త్రినాధ్ తో వచ్చిన సన్నివేశాలు ఒక రేంజ్ లో ఉండటంతో పాటు కథ ఏ విధంగా రన్ అవ్వబోతుందో అనే క్యూరియాసిటీ ఉంటుంది. యాక్షన్ సన్నివేశాలు, అయ్యప్ప స్వామి దీక్ష సమయంలో వచ్చిన సన్నివేశాలు, గోపరాజు( సాయికుమార్) , 10 th క్లాస్ చదివే అతని కూతురుతో త్రినాద్, మణికంఠ సన్నివేశాలు సూపర్ గా ఉన్నాయి. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. టీచర్ గా చేసిన శ్వాసిక విజయ్ సీన్స్ అంత ఇంపాక్ట్ అనిపించలేదు. ఇంటర్వెల్ సీన్ పర్లేదు.
సెకండ్ హాఫ్ లో చూసుకుంటే అసాంఘిక శక్తుల నుంచి ఏ నిమిషానికి ఎలాంటి చెడు వార్త వినాల్సి వస్తుందో అనే టెన్షన్ కలుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో వచ్చే సస్పెన్సు కి కన్నీళ్లు ఆపుకోలేం. అది నిజం కాకపోతే బాగుండని మన ఇష్ట దైవాలని ప్రార్దిస్తాం. సీన్ తో సీన్ తో పాటు ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఒక రేంజ్ లో కుదిరాయి.
నటీనటులు సాంకేతిక నిపుణుల పని తీరు
త్రినాధ్ గా రవితేజ తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఎమోషనల్, లవ్, యాక్షన్ సీన్స్ లో రఫ్ఫాడించాడు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో రవితేజ పెర్ ఫార్మెన్స్ ఒక రేంజ్ లో ఉంది. అభిమానులకి ఫుల్ మీల్స్ అని చెప్పవచ్చు. ప్రియా భవాని శంకర్ హోమ్లీ క్యారక్టర్ తో ఆకట్టుకుంది. ముఖ్యంగా బేబీ నక్షత్ర అయితే తన క్యూట్ నటనతో థియేటర్ నుంచి బయటకి వచ్చినా తన గురించే ఆలోచించేలా అదిరిపోయే పెర్ఫార్మ్ చేసింది. తన వల్ల రిపీట్ ఆడియెన్స్ కూడా పక్కా. దీన్ని బట్టి ఎంతలా మెస్మరైజ్ చేసిందో అర్ధం చేసుకోవచ్చు. మిగతా క్యారెక్టర్స్ లో చేసిన సాయికుమార్, అజయ్ ఘోష్, శ్వాసిక విజయ్, నెగిటివ్ రోల్ లో చేసిన ఎం ఎల్ ఏ క్యారక్టర్ కూడా తమ క్యారెక్టర్స్ పరిధి మేరకు నటించారు. శివ నిర్వాణ దర్శకుడిగా, రచయితగా సక్సెస్ అయ్యాడు. తెలుగు సినిమాకి సరికొత్త ట్రెండ్ ని కూడా క్రియేట్ చేసినట్టే. మైత్రి నిర్మాణ విలువలు, ఎడిటింగ్, జి వి ప్రకాష్ కుమార్ మ్యూజిక్, ఫొటోగ్రఫీ ఇరుముడి కోసమే పుట్టినట్టుగా కుదిరాయి.
బలాలు
1 . రవితేజ, బేబీ నక్షత్ర పెర్ ఫార్మెన్సు
2 . సాంగ్స్ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్
3 . సెకండ్ హాఫ్ లో వచ్చే ఊహించని ట్విస్ట్ లు
4 . యాక్షన్ సీక్వెన్స్
5 . ప్రీ క్లైమాక్స్
6 . క్లైమాక్స్
చివరిగా చెప్పుకోవాలంటే ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్నివర్గాల ప్రేక్షకులు చూసే విధంగా తెరకెక్కిన ఎమోషనల్ బాండింగ్ జర్నీ ఇరుముడి.
రేటింగ్ 3 /5 అరుణాచలం





