సినీ పరిశ్రమలో స్టార్ హీరోలు, భారీ బడ్జెట్, అగ్ర నిర్మాణ సంస్థలు ఉంటేనే సినిమాలు వందల కోట్లు వసూలు చేస్తాయనే నమ్మకాన్ని ఒక సాధారణ యూట్యూబర్ బద్దలు కొట్టాడు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, కేవలం కంటెంట్‌ను నమ్ముకుని ఒక హాలీవుడ్ చిత్రాన్ని తెరకెక్కించి గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనానికి తెరలేపాడు. భారీ విజువల్ ఎఫెక్ట్స్ (VFX) హంగులు లేకుండానే ఈ చిత్రం థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోంది.
ప్రముఖ అమెరికన్ యూట్యూబర్ 'మార్కిప్లైయర్' దర్శకత్వంలో రూపొందించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం 'ఐరన్ లంగ్' . సోషల్ మీడియాలో మూడున్నర కోట్లకు పైగా ఫాలోవర్లు ఉన్న మార్కిప్లైయర్, ఎవరి సపోర్ట్ లేకుండా కేవలం 4 మిలియన్ డాలర్లు (మన ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 34 కోట్లు) అత్యల్ప బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. పెద్దగా ప్రచార ఆర్భాటాలు చేయకపోయినా, అతని అభిమానులే ఈ చిత్రానికి పెద్ద ఎత్తున పబ్లిసిటీ కల్పించారు.
ఇక కలెక్షన్ల విషయానికి వస్తే, జనవరిలో విడుదలైన ఈ లో-బడ్జెట్ చిత్రం హాలీవుడ్ ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తూ ఏకంగా రూ. 350 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇటీవల విజువల్ ఎఫెక్ట్స్ లేకుండా ఒకే ఒక గది నేపథ్యంలో వచ్చి ఇండియాలో వంద కోట్ల మార్కుకు చేరువవుతున్న 'అబ్సెషన్' సినిమా తరహాలోనే.. ఈ 'ఐరన్ లంగ్' కూడా పరిమిత వనరులతోనే అద్భుతమైన థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ప్రేక్షకులకు అందించింది.
ఈ సినిమా కథాంశం ఎంతో విభిన్నంగా ఉంటుంది. భవిష్యత్తులో ప్రపంచం సర్వనాశనమైపోయిన తర్వాత, బ్రతికి ఉన్న అతికొద్ది మంది మానవులు ఒక వింత గ్రహంలోని రక్తపు సముద్రం గురించిన రహస్యాలను ఛేదించే ప్రయత్నం చేస్తారు. అందుకోసం ఒక పాతకాలపు సబ్‌మెరైన్‌లో హీరోను ఒంటరిగా ఆ సముద్ర గర్భంలోకి పంపిస్తారు. ఆ తర్వాత ఆ నౌకలో ఎదురైన భయానక పరిస్థితులు, ఉత్కంఠభరితమైన పరిణామాల సమాహారమే ఈ సినిమా.
కేవలం 2 గంటల 7 నిమిషాల నిడివితో సాగే 'ఐరన్ లంగ్' అమెరికాలో భారీ విజయం సాధించడమే కాకుండా, ప్రస్తుతం ఉన్న సినిమా మేకింగ్ ట్రెండ్‌ను పూర్తిగా మార్చేసింది. ప్యాన్ ఇండియా, ప్యాన్ వరల్డ్ సినిమాల పేరిట వందల కోట్లు ఖర్చు పెడుతూ, కేవలం గ్రాఫిక్స్‌పైనే ఆధారపడుతున్న మేకర్స్‌కు ఈ యూట్యూబర్ సాధించిన విజయం ఒక కనువిప్పు లాంటిదని పరిశ్రమ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమా సాధించిన విజయంపై సోషల్ మీడియాలో నెటిజన్లు, సినీ ప్రియులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. హాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన ఈ వినూత్న థ్రిల్లర్ చిత్రాన్ని త్వరలోనే భారతదేశంలో కూడా భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అతి త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన ఇండియన్ రిలీజ్ డేట్ మరియు థియేట్రికల్ అప్‌డేట్స్ అధికారికంగా వెలువడే అవకాశం ఉంది.






