
పెళ్లి అంటే నూరేళ్ల పంట అంటారు. కానీ పెళ్లైన కొన్నాళ్లకే భార్యాభర్తల మధ్య గొడవలు మొదలైతే? ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్నా.. కలిసి ఉండలేని పరిస్థితి వస్తే? చివరకు విడాకుల వరకు వెళ్లాల్సి వస్తే? ఇలాంటి ఆసక్తికరమైన పాయింట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా ‘ఇడుపు కాయితం’. ప్రియదర్శి, నాగదుర్గ జంటగా నటిస్తున్న ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. మరి ఈ టీజర్ ఎలా ఉంది? సినిమా కథపై ఎలాంటి ఆసక్తిని పెంచుతోంది?
‘రామాయణం ఎక్కడ ఆగిపోతుంది అనుకుంటామో.. అక్కడ ఒక స్త్రీ ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి రామాయణం ముందుకు వెళుతుంది’ అంటూ ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు మాటలతో టీజర్ ప్రారంభమవుతుంది. ఈ డైలాగ్‌తోనే కథలో శ్రీలత పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉండబోతోందో చెప్పే ప్రయత్నం చేశారు.
ఆ తర్వాత శ్రీను (ప్రియదర్శి), శ్రీలత (నాగదుర్గ) పరిచయం, పెళ్లిచూపులు, ప్రేమ, పెళ్లి.. ఇలా వీరి జీవితంలోని అందమైన క్షణాలను చూపించారు. కొత్తగా పెళ్లైన జంట మధ్య ఉండే చిన్న చిన్న సరదాలు, అలకలు, ప్రేమతో కూడిన సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి.

అయితే టీజర్ చివర్లో అసలు ట్విస్ట్ బయటపడుతుంది. ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న శ్రీను, శ్రీలత చివరకు విడాకుల పత్రం రాసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు వీరి మధ్య ఏం జరిగింది? అనే ప్రశ్నలను టీజర్ లేవనెత్తుతుంది.
ఇది కూడా చదవండి: శేఖర్ మాస్టర్‌కు యాక్సిడెంట్.. 'కాకా' షూటింగ్ నుంచి వస్తుండగా కారుని ఢీ కొట్టిన ట్రక్.!
భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబ సభ్యుల జోక్యం, అపార్థాలు.. ఇలా మన చుట్టూ కనిపించే జీవితాలనే కథాంశంగా తీసుకున్నట్లు అనిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ఈ కథను చూపించడం మరో ఆకర్షణ. కామెడీ, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు కలగలిపిన ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సినిమా ఉండబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది.
ప్రియదర్శి ఇప్పటికే విభిన్నమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ‘బలగం’ సినిమాతో నటుడిగా మరో మెట్టు ఎక్కారు. ఆ తర్వాత కూడా కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇందులో శ్రీను పాత్రలో ఆయన మరోసారి ఆకట్టుకునేలా కనిపిస్తున్నారు.
ఇక నాగదుర్గకు ఇది హీరోయిన్ గా తొలి సినిమా. తెలంగాణ ఫోక్ సాంగ్స్, డ్యాన్స్‌లతో సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఇప్పటికే విడుదలైన ‘బారాత్ బీట్’ పాటలో తన డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు. టీజర్లో శ్రీలతగా ఆమె సహజంగా కనిపిస్తున్నారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే కుదిరినట్లు అనిపిస్తోంది.
సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సుకుమార్, తబితా సుకుమార్, బన్నీ వాస్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వంశీ రెడ్డి దొండపాటి దర్శకత్వం వహించగా.. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.
డిసెంబర్ 11న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. మరి విడాకుల కథతో వస్తున్న ప్రియదర్శి ప్రేక్షకులను ఎంతవరకు నవ్విస్తారో.. ఎంతవరకు ఎమోషనల్ చేస్తారో చూడాలి.
మీకు నచ్చవచ్చు:
శోభన్ బాబుకు స్టార్డమ్ తెచ్చిన మూవీ.. 'తాసిల్దార్ గారి అమ్మాయి' వెనుక ఇన్ని విశేషాలా.?
షకీలా బయోపిక్.. ఇది టాలీవుడ్ ‘డర్టీ పిక్చర్’.!
[Idupu Kayitham Teaser, Priyadarshi, Naga Durga, Sukumar Writings, Bunny Vas]




