యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ‘హుషారు’ సినిమాకు సీక్వెల్ వచ్చేస్తోంది. 2018లో విడుదలైన ఈ చిత్రం ఫ్రెండ్‌షిప్, కామెడీ, యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ‘హుషారు 2’ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తాజాగా టైటిల్ పోస్టర్‌ను విడుదల చేయగా.. అందులో కనిపిస్తున్న వింత విజువల్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
ఇక పోస్టర్‌ను గమనిస్తే.. ఓ ట్రక్కుపై కబూమ్ బీర్, దాని చుట్టూ భారీ పాము, కింద తాబేలు, పక్కనే బంగారు నిధులతో కూడిన పెట్టె, వెనుక ఓ ఫ్యాక్టరీ కనిపిస్తున్నాయి. మొత్తం విజువల్‌ను చూస్తే పురాణాల్లోని ‘సముద్ర మథనం’ గుర్తుకు వచ్చేలా డిజైన్ చేశారు. ఈ విజువల్స్‌కు, సినిమాలోని కథకు ఏమైనా సంబంధం ఉందా? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ పోస్టర్ వెనుక ఉన్న అసలు కాన్సెప్ట్ ఏంటన్నది సినిమా విడుదలయ్యే వరకు సస్పెన్స్‌గానే ఉంచారు.
‘హుషారు 2’ కథ విషయానికి వస్తే.. ఐదుగురు స్నేహితుల చుట్టూ ఈ సినిమా సాగనుంది. కోవిడ్ సమయంలో తమ దగ్గర ఉన్నదంతా కోల్పోయిన ఈ స్నేహితులు జీవితంలో మళ్లీ నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో చిత్తరగుంజ్ అనే ప్రాంతానికి వెళ్లి.. అగేవ్ మొక్కలతో టేకిలా తయారు చేసే ఓ వ్యాపారాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంటారు. అయితే వారి వ్యాపార ఆలోచన ఊహించని సమస్యలకు దారితీయడంతో.. ఫ్రెండ్‌షిప్, కామెడీ, అడ్వెంచర్, మ్యాడ్‌నెస్‌తో కూడిన మరో కొత్త ప్రయాణం మొదలవుతుంది.
మరోవైపు తొలి భాగానికి దర్శకత్వం వహించిన శ్రీహర్ష కొనుగంటి.. సీక్వెల్‌కు కూడా రచన, దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. అశోక్ గల్లా, రాహుల్ రామకృష్ణ, రవి ఆంథోని, దినేష్ తేజ్, శశిధర్ కోచర్లకోట, విధి యాదవ్, అభిజ్ఞ వుతులూరు తదితరులు నటిస్తున్నారు. ఇప్పటికే ప్రధాన షూటింగ్ పూర్తవగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ ఏడాది చివర్లో సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఫస్ట్ లుక్, టీజర్ తదితర ప్రమోషనల్ కంటెంట్‌ను విడుదల చేయనున్నారు.
[Husharu 2, Husharu 2 Movie, Husharu 2 Title Poster, Ashok Galla, Sree Harsha Konuganti, Rahul Ramakrishna, Dinesh Tej, Husharu Sequel, Husharu 2 Story, Husharu 2 Cast, Telugu Movies, Tollywood News]






