సినిమా అంటే భారీ బడ్జెట్.. స్టార్ హీరో.. భారీ సెట్స్.. పాన్ ఇండియా ప్రమోషన్స్.. ఇలా ఎన్నో లెక్కలు ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో కంటెంట్ బాగుంటే ఇవేవీ లేకపోయినా ప్రేక్షకులు సినిమాను నెత్తిన పెట్టుకుంటారు. ఇప్పుడు ‘హనుమాన్ అంశ్’ సినిమా విషయంలో అదే జరిగింది. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.400 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. నీమ్ కరోలీ బాబా జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమాపై మైత్రీ మూవీ మేకర్స్ వై.రవిశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం తాము వందల కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తున్నామని, కానీ లెక్కలు సరిగ్గా కుదరడం లేదని రవిశంకర్ అన్నారు. అలాంటిది కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తీసిన సినిమా రూ.400 కోట్ల గ్రాస్ సాధించడం తమలాంటి నిర్మాతలకు, మొత్తంగా సినిమా పరిశ్రమకే ఒక రకంగా చెంపపెట్టు లాంటిదని వ్యాఖ్యానించారు. భారీ బడ్జెట్ కంటే మంచి కంటెంట్ ఎంత ముఖ్యమో ‘హనుమాన్ అంశ్’ విజయం మరోసారి చూపించిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
అంతేకాదు.. హనుమంతుడి ప్రస్తావన ఉన్న సినిమాలకు ఏదో ఒక దైవశక్తి తోడవుతున్నట్టుగా అనిపిస్తోందని రవిశంకర్ అన్నారు. గతంలో ‘హను-మాన్’ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుందని, ఇప్పుడు రాజమౌళి ప్రాజెక్ట్ ట్రైలర్‌లోనూ హనుమంతుడి ప్రస్తావన కనిపించిందని గుర్తుచేశారు. అయితే ‘హనుమాన్ అంశ్’ సాధించిన విజయం మాత్రం సాధారణమైనది కాదని, చిన్న బడ్జెట్‌తో వచ్చి దేశవ్యాప్తంగా ఇంతటి సంచలనం సృష్టించిన ఈ సినిమానే నిజమైన పాన్ ఇండియా మూవీ అని అన్నారు. ఇంకా ఏయే భాషల్లో ఈ సినిమా విడుదల కాలేదో, అక్కడ కూడా వెంటనే రిలీజ్ చేయాలని ఆయన సూచించారు.
హోంబలే ఫిలిమ్స్ లాంటి ప్రముఖ సంస్థ ఇలాంటి మంచి ప్రాజెక్ట్‌ను తీసుకోవడం అభినందనీయమని రవిశంకర్ చెప్పారు. నైజాం ప్రాంతంలో ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం తమకు రావడం ఆనందంగా ఉందన్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుత సమాజంలో ఇలాంటి భక్తిరస చిత్రాల అవసరం కూడా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్స్, నెగెటివిటీ, ఏఐ కారణంగా ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలియని పరిస్థితి ఉందని, ముఖ్యంగా యువత ఈ ప్రభావానికి లోనవుతున్నారని అన్నారు. అలాంటి పరిస్థితుల్లో మనశ్శాంతిని కలిగించే, భక్తి భావనను పెంచే సినిమాలు అవసరమని చెప్పారు.
నీమ్ కరోలీ బాబా ఎంతో గొప్ప దైవస్వరూపమని, ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులు సైతం ఆయనను దర్శించుకున్నారని రవిశంకర్ పేర్కొన్నారు. దసరా సెలవుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ సినిమాకు తప్పకుండా తీసుకెళ్లాలని ఆయన కోరారు. అదే సమయంలో సినిమాలో నటించిన శోభినవ్ సత్య నటనను, దర్శకుడు విశాల్ చతుర్వేది టేకింగ్‌ను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ఇప్పటికే ఉత్తర భారతంలో భారీ స్పందన తెచ్చుకున్న ఈ సినిమా అక్టోబర్ 9న తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఇక్కడ కూడా మంచి ఆదరణ దక్కుతుందనే నమ్మకాన్ని రవిశంకర్ వ్యక్తం చేశారు.
మొత్తంగా చూస్తే.. కేవలం రూ.2 కోట్ల పెట్టుబడితో రూ.400 కోట్ల వసూళ్లను అందుకోవడం ‘హనుమాన్ అంశ్’ ప్రత్యేకతగా నిలిచింది. అందుకే ఈ సినిమా విజయం ఇప్పుడు కేవలం ఒక చిన్న సినిమా సక్సెస్‌గా కాకుండా.. భారీ బడ్జెట్ సినిమాల లెక్కలపై కూడా చర్చకు దారితీస్తోంది. కంటెంట్‌లో బలం ఉంటే ప్రేక్షకులు సినిమాను ఏ స్థాయికి తీసుకెళ్లగలరో ‘హనుమాన్ అంశ్’ మరోసారి నిరూపించిందనే చెప్పాలి.
[Hanuman Ansh, Hanuman Ansh Telugu Release, Mythri Ravi Shankar, Ravi Shankar Comments, Hanuman Ansh Box Office, Hanuman Ansh Rs 400 Crore, Shobhinav Satyaa, Vishal Chaturvedi, Neem Karoli Baba, Hombale Films, Telugu Movie News]






