Home

»

Latest News

రూ.400 కోట్లు క‌లెక్ట్ చేసిన ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైల‌ర్ రిలీజ్‌.!

Oct 5, 2026 8:09PM

చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్‌ వద్ద ఊహించని సంచలనం సృష్టించిన ఆధ్యాత్మిక చిత్రం ‘హనుమాన్ అంశ్’. హిందీలో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ అందుకుని ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ అక్టోబర్ 9న ఈ చిత్రాన్ని తెలుగులో గ్రాండ్‌గా విడుదల చేయనుంది. తాజాగా ప్రమోషన్స్‌లో భాగంగా తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు.

నీమ్ కరోలీ బాబా జీవిత ప్రేరణతో దర్శకుడు విశాల్ చతుర్వేది ఈ సినిమాను తెరకెక్కించారు. సామాన్య జీవితాన్ని గడుపుతున్న లక్ష్మణ్ దాస్ ఆధ్యాత్మిక మార్గం వైపు ఎలా అడుగులు వేశాడు? అనంతరం ప్రజలకు స్ఫూర్తినిచ్చే సాధువుగా ఎలా మారాడు? అనే అంశాలను కథలో చూపించారు. తాజాగా విడుదలైన తెలుగు ట్రైలర్‌లో బ్రిటిష్ కాలం నాటి పరిస్థితులు, ఆయన జీవితంలో చోటుచేసుకున్న కీలక సంఘటనలు, ఆధ్యాత్మిక పరివర్తనకు సంబంధించిన సన్నివేశాలను చూపించారు. ముఖ్యంగా హనుమంతుడి భక్తి, సేవ, ప్రేమ, ఆధ్యాత్మిక అనుభూతులకు సంబంధించిన సన్నివేశాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. కేవలం రూ.1.8–2 కోట్ల స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా హిందీలో తొలుత నెమ్మదిగా ప్రారంభమైనప్పటికీ మౌత్ టాక్‌తో క్రమంగా పుంజుకుంది. ఆ తర్వాత భారీ వసూళ్లను సాధించి ఈ ఏడాది సర్‌ప్రైజ్ బ్లాక్‌బస్టర్లలో ఒకటిగా నిలిచింది. సెప్టెంబర్ చివరి నాటికి భారత్‌లో రూ.300 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించగా, ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్ల మార్క్‌ను దాటినట్లు తాజా నివేదికలు పేర్కొన్నాయి.

మరోవైపు.. ఈ సినిమా తెలుగు విడుదల విషయంలో తొలుత కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. సెప్టెంబర్ 18న విడుదల చేయాలని భావించినప్పటికీ అది వాయిదా పడింది. మొదట దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగు వెర్షన్‌ను సమర్పించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఆ డీల్ ముందుకు సాగకపోవడంతో చివరకు హోంబలే ఫిలింస్ స్వయంగా తెలుగు విడుదల బాధ్యతలు తీసుకుంది. ఇప్పుడు అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా తెలుగు వెర్షన్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే హిందీలో భారీ విజయాన్ని అందుకున్న ‘హనుమాన్ అంశ్’కు తెలుగులో ఎలాంటి స్పందన వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. భక్తి, ఆధ్యాత్మికతతో పాటు ఒక వ్యక్తి జీవితంలో చోటుచేసుకున్న పరివర్తనను కథగా చూపించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందా అనేది అక్టోబర్ 9న తేలనుంది.

 

 

[Hanuman Ansh, Hanuman Ansh Telugu, Hanuman Ansh Telugu Trailer, Hanuman Ansh Telugu Release, Neem Karoli Baba, Hanuman Ansh Movie, Hombale Films, Hanuman Ansh October 9 Release, Hanuman Ansh Box Office, Vishal Chaturvedi, Spiritual Movie, Telugu Movie Releases]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com