Home

»

Latest News

ఫ‌స్ట్ వీకెండ్ 50 శాతం రాబ‌ట్టిన‌ 'సీటీమార్‌'!

Sep 13, 2021 6:22PM

 

ఏడాదికి ఒకట్రెండు సినిమాలే చేస్తున్న హీరోల కాలం ఇది. గోపీచంద్ కూడా అందుకు మినహాయింపు కాదు. 20 ఏళ్ల క్రితం 'తొలివలపు' సినిమాతో కెరీర్ ఆరంభించిన గోపి ఇన్నేళ్లలో 27 సినిమాలు మాత్రమే చేశాడు. వాటిలో బి. గోపాల్ దర్శకత్వం వ‌హించ‌గా నాలుగేళ్ల క్రితం విడుద‌ల కావాల్సిన‌ 'ఆరడుగుల బుల్లెట్' సినిమా ఇంకా విడుదలకు నోచుకోలేదు. త్వ‌ర‌లో విడుద‌ల చేస్తామ‌ని నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. మిగతా వాటిలో విలన్‌గా చేసినవి నాలుగు సినిమాలు. వాటిలోనూ ఒకటి తమిళ చిత్రం ('జయం'). అంటే హీరోగా 23 సినిమాలు చేశాడు. 

విలన్ నుంచి హీరోగా మారాక ఎక్కువ హిట్లు కొట్టిన అతను కొంతకాలంగా క్లిష్ట స్థితిని ఎదుర్కొంటూ వ‌చ్చాడు. 2018లో చేసిన 25వ సినిమా 'పంతం'పై అతను చాలా ఆశలు పెట్టుకున్నాడు. రచయిత నుంచి డైరెక్టర్‌గా మారిన చక్రవర్తిరెడ్డి రూపొందించిన ఈ తొలి సినిమా బాక్సాఫీస్ వద్ద నష్టాలు చవిచూసింది. దీనికి ముందు సంపత్ నంది డైరెక్షన్‌లో డ్యూయల్ రోల్ చేసిన 'గౌతమ్‌ నందా' ఫెయిలవగా, నిర్మాత ఎ.ఎం. రత్నం కుమారుడు జోతికృష్ణ దర్శకత్వంలో చేసిన 'ఆక్సిజన్' గోపి కెరీర్‌లోనే డిజాస్టర్‌గా నిలిచింది. దీని తర్వాత అతని మార్కెట్ విలువ బాగా పడిపోయింది. అదే 'పంతం' బిజెనెస్‌నూ ప్రభావితం చేసింది.

తిరు ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన 'చాణక్య' (2019) క‌చ్చితంగా హిట్ట‌వుతుందని గోపీచంద్ ఎంత‌గానో ఆశించాడు. కానీ ఫలితంలో మార్పు రాలేదు. 2015లో రాధాకృష్ణ కుమార్ డైరెక్ష‌న్‌లో న‌టించిన 'జిల్' మూవీ త‌ర్వాత మ‌రో విజ‌యం కోసం చ‌కోరంలా ఎదురుచూస్తూ వ‌స్తున్న గోపీచంద్‌కు 'సీటీమార్' రూపంలో ఆ విజ‌యం ద‌క్కుతుంద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. సంప‌త్ నంది డైరెక్ట్ చేసిన ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ సెప్టెంబ‌ర్ 10న విడుద‌లైంది. క‌రోనా సెకండ్ వేవ్ త‌ర్వాత రిలీజైన హిందీ స‌హా ఏ భాషా సినిమా కూడా ప్రేక్ష‌కుల్ని భారీ సంఖ్య‌లో థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌లేక‌పోయింది.

అట్లాంటిది.. త‌మ‌న్నా నాయిక‌గా న‌టించిన 'సీటీమార్' మూవీ ఫ‌స్ట్ వీకెండ్‌లో ఆరు కోట్ల షేర్ వ‌సూలు చేయ‌డం చిన్న విష‌యం కాద‌నే చెప్పాలి. సెకండ్ వేవ్ త‌ర్వాత థియేట‌ర్లు తెరుచుకున్నాక‌, ఫ‌స్ట్ వీకెండ్‌లో అత్య‌ధిక వ‌సూళ్లు చేసిన సినిమా ఇదే. అందిన స‌మాచారం ప్ర‌కారం మొద‌టి మూడు రోజుల్లో 'సీటీమార్' రూ. 6.25 కోట్లు (అంచ‌నా) షేర్ వ‌సూలు చేసింది. బ్రేకీవెన్ రావాలంటే 12 కోట్లు వ‌సూల‌వ్వాలి. అంటే ఫ‌స్ట్ వీకెండ్ 50 శాతం పైగా రాబ‌ట్టింద‌న్న మాట‌. దీంతో ఆరేళ్లుగా హిట్ కోసం వెయిట్ చేస్తోన్న గోపీచంద్ స‌క్సెస్ అయిన‌ట్లేనంటున్నారు ట్రేడ్ విశ్లేష‌కులు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com