ఎవల్యూషన్ ఆఫ్ అల్లు అర్జున్.. 'గంగోత్రి' నుంచి 'పుష్ప' దాకా!
on Apr 8, 2020
ఎక్కడి స్టైలిష్ అండ్ హ్యాండ్సమ్ లుక్.. ఎక్కడి రగ్డ్ అండ్ ఇంటెన్స్ లుక్! 'అల.. వైకుంఠపురములో' మూవీలో స్టైలిష్‌గా, అందంగా కనిపించిన అల్లు అర్జున్.. ఆ నెక్ట్స్ మూవీకే తన రూపాన్ని పూర్తిగా మార్చేశాడు!! సుకుమార్ డైరెక్షన్లో లేటెస్ట్గా చేస్తోన్న సినిమాలో లారీ డ్రైవర్ పుష్పరాజ్‌గా కనిపించబోతున్నాడు. అందుకే బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న ఆ సినిమాకు 'పుష్ప' అనే టైటిల్‌ను అనౌన్స్ చేశారు నిర్మాతలు. పుష్ప లుక్‌లో బన్నీ ఎంతగా మారిపోయాడంటే.. పాపిడి తీసిన పొడవాటి జుట్టు, చింపిరి గడ్డం, కాళ్లకు తోలు చెప్పులు, తీక్షణమైన చూపులతో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్ ఎట్లా ఉంటాడో అట్లా మారిపోయాడు!! అన్నట్లు.. అతడి ఎడమ కాలికి ఆరు వేళ్లున్నాయి. చిటికిన వేలికి పక్కనే ఇంకో చిటికెనవేలు.. అదీ పుష్ప రూపం!
త్రివిక్రమ్ డైరెక్షన్లో చేసిన కెరీర్ బిగ్గెస్ట్ గ్రాసర్ 'అల వైకుంఠపురములో' మూవీ తర్వాత బన్నీ చేస్తున్న సినిమా కావడంతో 'పుష్ప'పై అంచనాలు అంబరాన్ని చుంబిస్తున్నాయి. మునుపటి సినిమా బాక్సాఫీస్ దగ్గర నాన్-బాహుబలి 2 రికార్డుల్ని సాధించడంతో దానికి మించిన సినిమాని చేయాలనే ఉద్దేశంతో సుకుమార్ డైరెక్షన్లో చేయడానికి కమిట్ అయ్యాడు బన్నీ. 'రంగస్థలం' వంటి కెరీర్ బెస్ట్ మూవీ చేసిన సుకుమార్ కూడా దాన్ని మించిన సినిమా చేయాలనే తపనతో 'పుష్ప'ను తీస్తున్నాడు. నిజానికి ఈ మూవీని మహేశ్ చేయాల్సిన విషయం చాలా మందికి తెలిసిందే. అయితే సినిమా సెట్స్ మీదకు వెళ్తుందనంగా క్రియేటివ్ డిఫరెన్సెస్‌తో ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు స్వయంగా మహేశ్ ప్రకటించాడు. బహుశా పుష్పరాజ్ క్యారెక్టర్ తనకు సూట్ కాదని అతను తప్పుకున్నాడేమోనని ఇప్పుడు ఆ లుక్‌లో బన్నీని చూశాక అనిపిస్తోంది.
ఏమైనా మహేశ్ ఇచ్చిన షాక్ నుంచి బయటపడి, బన్నీకి ఈ కథ చెప్పి ఒప్పించాడు సుకుమార్. 'రంగస్థలం'లో ఎలాగైతే అదివరకెన్నడూ మనం చూడని రామ్‌చరణ్‌ను చూపించాడో, అలాగే ఇప్పటి దాకా మనం చూడని బన్నీని 'పుష్ప'గా చూపించబోతున్నాడు సుకుమార్. ఈ సినిమాలో బన్నీ డబుల్ రోల్ చేస్తున్నాడనే ప్రచారం ఉంది. లారీ డ్రైవర్ పుష్పరాజ్ క్యారెక్టర్‌తో పాటు స్టైలిష్ లుక్‌లో ఉండే ఇంకో క్యారెక్టర్ కూడా బన్నీ చేస్తున్నాడంటున్నారు. బహుశా ఇద్దరూ అన్నదమ్ములు కావచ్చు. పుష్పరాజ్ కాలికి ఉండే ఆరు వేళ్లకు కూడా కథలో ప్రాధాన్యం ఉంటుందని వినిపిస్తోంది. ఇందులో బన్నీ జోడీగా తొలిసారి రష్మికా మందన్న నటిస్తోంది. సుక్కు సినిమాల్లో హీరోయిన్‌కూ తగినంత ప్రాధాన్యం ఉంటుందని 'ఆర్య' సినిమా నుంచి మనం చూస్తూనే ఉన్నాం. 'రంగస్థలం'లో రామలక్ష్మిగా సమంతను ఆయన ఎలా చూపించాడో చూశాం కదా! అలాగే ఈ సినిమాలో రష్మిక క్యారెక్టర్ కూడా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకొనే రీతిలోనే ఉంటుందనేది నిజం.
ఇవాళ అల్లు అర్జున్ పుట్టినరోజు. నేటితో అతడికి 38 ఏళ్లు నిండుతున్నాయి. 21 సంవత్సరాల వయసులో 'గంగోత్రి' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి, రూపపరంగా ఆకట్టుకోలేకపోయిన బన్నీ.. ఆ వెంటనే తన రెండో సినిమాతోటే అనూహ్యమైన మేకోవర్‌తో దర్శనమిచ్చి స్టార్‌గా మారిపోయాడు. ఆ సినిమా 'ఆర్య'. దాని డైరెక్టర్ సుకుమార్. ఆర్య క్యారెక్టర్‌ను సుక్కు తీర్చిదిద్దిన విధానం, దాన్ని బన్నీ చేసిన తీరు ఒక ట్రెండ్‌నే సృష్టించాయి. అక్కడ్నుంచి బన్నీకి సినిమా సినిమాకూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూ వస్తోంది. క్రిష్ డైరెక్ట్ చేసిన 'వేదం'లో కథ అతడి చుట్టూ తిరగకపోయినా అందులో చేసిన కేబుల్ రాజు క్యారెక్టర్ ఇప్పటికీ మనకు గుర్తుకు వస్తూ ఉంటుంది. అంత బాగా ఆ క్యారెక్టర్ పోషించి ఆకట్టుకున్నాడు బన్నీ. క్లైమాక్స్‌లో అతడు మనల్ని ఏడిపించాడు కూడా.
నటుడిగా బన్నీ కెరీర్లో చెప్పకోదగ్గ ఇంకో పాత్ర గుణశేఖర్ డైరెక్ట్ చేసిన 'రుద్రమదేవి' మూవీలో పోషించిన గోన గన్నారెడ్డి. కథ అంతా అనుష్క పోషించిన రుద్రమదేవి చుట్టూ తిరిగినప్పటికీ, సినిమాలో సపోర్టింగ్ రోల్లా కనిపించినప్పటికీ, రుద్రమదేవికి ఆపత్కాలంలో అండగా నిలిచే గన్నారెడ్డి క్యారెక్టర్లో ఎలక్ర్టిఫయింగ్ పర్ఫార్మెన్స్ ప్రదర్శించి ప్రేక్షకుల హృదయాల్ని దోచుకున్నాడు బన్నీ. సినిమాలో అతడు స్క్రీన్ మీద ప్రత్యక్షమైన ప్రతిసారీ ఆడియెన్స్ నుంచి విజిల్స్ వినిపిస్తూ వచ్చాయి. త్రివిక్రమ్ డైరెక్షన్లో బన్నీ చేసిన 'జులాయి' సినిమా కూడా బన్నీలోని నటుడ్ని ఇంకో కోణంలో ప్రదర్శించింది. త్రివిక్రమ్ మార్క్ సింగిల్ లైనర్స్ డైలాగ్స్‌ను తనదైన శైలిలో బన్నీ చెప్పిన విధానం ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేసింది. బోయపాటి శ్రీను రూపొందించిన 'సరైనోడు' సినిమా బన్నీని మాస్ ఆడియెన్స్‌కు మరింత సన్నిహితం చేయడమే కాకుండా, అతడి ఫ్యాన్ బేస్‌ను మరింతగా పెంచింది. 'అల వైకుంఠపురములో' మూవీ మాస్, క్లాస్ తేడా లేకుండా అందర్నీ ఆకట్టుకొని టాలీవుడ్ టాప్ స్టార్స్‌లో బన్నీ స్థానాన్ని సుస్థిరం చేసింది.
ఈ నేపథ్యంలో పుష్పరాజ్‌గా కొత్తరూపంతో నటిస్తున్నాడు బన్నీ. ప్రస్తుత కరోనా సంక్షోభంలో లాక్డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయినా, పుట్టినరోజు సందర్భంగా తన సినిమా టైటిల్‌తో పాటు, తన లుక్‌ను రిలీజ్ చేసి ఫ్యాన్స్‌ను సంబరాల్లో ముంచెత్తాడు. 'పుష్ప' లుక్ బయటకు రావడం ఆలస్యం సోషల్ మీడియాలో అది వైరల్ అయిన తీరు అసాధారణం. అన్నీ అనుకూలిస్తే 2021 వేసవికి 'పుష్ప' మనముందుకు వస్తాడు, అశేష అభిమానుల్ని అలరిస్తాడు.