మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, డైరెక్టర్ జీతూ జోసెఫ్ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీగా గుర్తింపు తెచ్చుకున్న ‘దృశ్యం’ సిరీస్‌లో భాగంగా వచ్చిన ‘దృశ్యం 3’ ప్రస్తుతం గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.
ఈ క్రేజీ మూవీ విడుదలైన నాటి నుంచే థియేటర్ల వద్ద వసూళ్ల వేట మొదలుపెట్టింది. సరిగ్గా చెప్పాలంటే కేవలం 58 గంటల్లోనే (మూడు రోజుల్లో) ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల క్లబ్‌లో చేరి సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ విషయాన్ని స్వయంగా మోహన్‌లాల్ సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.
గత 13 సంవత్సరాలుగా ఈ ఫ్రాంచైజీ జర్నీలో భాగమైన అభిమానుల నమ్మకమే ఈ విజయానికి కారణమని మేకర్స్ పేర్కొంటున్నారు. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, 'దృశ్యం 3' చిత్రం మొదటి మూడు రోజుల్లోనే దాదాపు రూ. 117.17 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి మాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త మైలురాయిని అధిగమించింది.
నిజానికి ఈ చిత్రానికి ఆరంభంలో మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ.. జార్జ్‌కుట్టి పాత్రపై ఉన్న విపరీతమైన అంచనాల వల్ల ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. మొదటి రెండు భాగాలతో పోలిస్తే సస్పెన్స్ కొద్దిగా తగ్గినప్పటికీ, ఈసారి ఎమోషనల్ ఎలిమెంట్స్‌కు దర్శకుడు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు జార్జ్‌కుట్టి చేసే పోరాటంలో మోహన్‌లాల్ నటన మరోసారి ఆడియన్స్‌ను మెప్పించింది.
గతంలో వచ్చిన దృశ్యం 1, దృశ్యం 2 చిత్రాలు తెలుగులో రీమేక్ అయి ఇక్కడ కూడా భారీ విజయాన్ని సాధించాయి. అయితే ఈ మూడో భాగాన్ని మాత్రం రీమేక్ చేయకుండా నేరుగా మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేశారు. తెలుగు ఆడియన్స్ రాంబాబు పాత్రకు బాగా కనెక్ట్ అవ్వడం వల్ల, ఇక్కడి నేటివిటీ పరంగా కొద్దిగా మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.
అయినప్పటికీ సోషల్ మీడియాలో ఈ చిత్రంపై విపరీతమైన బజ్ నడుస్తోంది. బుకింగ్స్ యాప్స్‌లో రికార్డు స్థాయిలో టికెట్లు అమ్ముడవుతుండటంతో ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. లాంగ్ రన్‌లో ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మరిన్ని భారీ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డులను నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.




