Home

»

Latest News

బిగ్‌బాస్ బ్యూటీ అరెస్ట్‌, పోలీస్ క‌స్ట‌డీ.. డాక్టర్‌పై దాడి, రూ.5 లక్షలు డిమాండ్ కేసు.!

Sep 28, 2026 5:22PM

బిగ్‌బాస్ మరాఠీ ఫేమ్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ దివ్య శిండేను పుణె పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ రిటైర్డ్ వైద్య అధికారిపై దాడి చేయడంతో పాటు రూ.5 లక్షలు డిమాండ్ చేసిన కేసులో ఆమెపై చర్యలు తీసుకున్నారు. పుణెలోని కాళేపడల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన అనంతరం దివ్యను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆమెను సెప్టెంబర్ 30 వరకు పోలీస్ కస్టడీకి పంపించింది.

పోలీసుల వివరాల ప్రకారం.. డాక్టర్ విద్యాధర్ గైక్వాడ్ 2021లో పుణె కంటోన్మెంట్ ఆసుపత్రిలో మెడికల్ ఆఫీసర్‌గా రిటైర్ అయ్యారు. ఆయనకు సంబంధించిన సంస్థ సెప్టెంబర్ 1 నుంచి 3 వరకు పుణెలో ‘కళా ఆవిష్కార్ మహోత్సవ్’ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి తాను ప్రచారం కల్పించానని చెబుతూ దివ్య శిండే రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికే సుమారు రూ.50 వేల వరకు గూగుల్ పే ద్వారా చెల్లించినప్పటికీ మిగిలిన డబ్బు కోసం ఒత్తిడి కొనసాగిందని ఫిర్యాదుదారు ఆరోపించారు.

సెప్టెంబర్ 24న రాత్రి దివ్య శిండే మరికొందరితో కలిసి డాక్టర్ గైక్వాడ్ నివాసానికి వెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్కడ రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసిన అనంతరం తనపై కర్ర, బెల్ట్, లోహపు వస్తువులతో దాడి చేశారని డాక్టర్ ఆరోపించారు. ఇంట్లో వస్తువులను ధ్వంసం చేయడంతో పాటు తనను, తన కుమారుడిని బెదిరించినట్లు కూడా ఫిర్యాదులో ఉంది. ఈ ఘటనలో గాయపడిన డాక్టర్‌కు పుణెలోని ససూన్ ఆసుపత్రిలో చికిత్స అందించినట్లు సమాచారం. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఇవన్నీ ఫిర్యాదులో నమోదైన ఆరోపణలు మాత్రమేనని, కేసు దర్యాప్తులో ఉందని సంబంధిత నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

ఇక దివ్య శిండేకు ‘బిగ్‌బాస్ మరాఠీ 6’ ద్వారా మరింత గుర్తింపు వచ్చింది. సోషల్ మీడియాలో ‘సర్కార్’ పేరుతో ఆమెకు ఫాలోయింగ్ ఉంది. ఈ ఏడాది ప్రసారమైన బిగ్‌బాస్ మరాఠీ ఆరో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న ఆమె.. షో నుంచి ముందుగానే ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు రిటైర్డ్ వైద్య అధికారిపై దాడి, డబ్బుల డిమాండ్‌కు సంబంధించిన కేసులో అరెస్ట్ కావడంతో మరోసారి వార్తల్లో నిలిచారు. కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.

 

 

[Divya Shinde Arrested, Bigg Boss Marathi Divya Shinde, Divya Shinde Arrest, Divya Shinde Case, Divya Shinde Crime News, Bigg Boss Marathi 6, Divya Shinde Pune Case, Divya Shinde Latest News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com