
ప్రముఖ అగ్ర నిర్మాత దిల్ రాజు(Dil Raju)రీసెంట్ గా జరిగిన సమ్మర్ హాలీడేస్(Summer HOlidays)మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా తన మాటల ద్వారా ప్రస్తుత సినీ పరిశ్రమ ఎదుర్కుంటున్న గడ్డు పరిస్థితులని వివరిస్తూ ఇండస్ట్రీ వర్గాల్లో ఒక పెద్ద చర్చకు తెరలేపారు.
ఆయన మాట్లాడుతు గతంలో కంటే ఇప్పుడు థియేటర్లకి ప్రేక్షకులని తీసుకురావడం అనేది నిర్మాత,దర్శకులకి ఒక అతిపెద్ద సవాల్‌గా మారింది. కమర్షియల్ ఫార్ములాలు, రొటీన్ కథలతో వచ్చే చిత్రాలకి ప్రేక్షకులు మునుపటిలా స్పందించడం లేదు. అందుకే థియేటర్ల వైపు వారు అడుగులు వేయడం తగ్గించేశారు.దీంతో తెలుగు చిత్ర పరిశ్రమ ప్రస్తుతం ఎవరూ ఊహించని విధంగా అత్యంత క్లిష్టపరిస్థితుల్లో ఉంది. ఈ నిజాన్ని బహిరంగంగా ఒప్పుకోవడానికి చాలా మంది వెనకాడుతుంటారు. కానీ నేను మాత్రం ఈ చేదు నిజాన్ని చెప్పడానికి అస్సలు భయపడను. ఇలాంటి క్లిష్ట సమయంలో చిత్ర పరిశ్రమని మళ్లీ గాడిన పెట్టే బాధ్యత కొత్త దర్శకులు, చిన్న చిత్రాలపైనే ఉంది.
కొత్త వాళ్లతో, వినూత్నమైన కాన్సెప్టులతో సినిమాలు చేసినప్పుడే చిత్ర పరిశ్రమకి కొత్త ఊపిరి అందుతుంది. ప్రస్తుతం ఇండస్ట్రీ మనుగడ సాగించాలన్నా, థియేటర్లు కలకలలాడాలన్నా వైవిధ్యమైన కంటెంట్ చాలా అవసరమని పేర్కొన్నారు. చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద విజయాన్ని సాధిస్తే, తెలుగు సినీ పరిశ్రమ అంత ఆరోగ్యంగా, పటిష్టంగా ముందుకు సాగుతుంది 'సమ్మర్ హాలీడేస్' లాంటి వినూత్న ప్రయత్నాలే ప్రేక్షకులని మళ్లీ థియేటర్ల సీట్లలో కూర్చో బెడతాయి.
aslo read: ప్రైమ్ వీడియోలో మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్.. చీకటి పడితే తలుపులు క్లోజ్ చేసుకోవాల్సిందే
కొత్త దర్శకులు కేవలం స్టార్ హీరోల వెంటే పడకుండా, కథ బలాన్ని నమ్ముకుని అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కొత్త ఆలోచనలతో వచ్చే యువ దర్శకులు తమ ప్రతిభతో పరిశ్రమని నిలబెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిన్న సినిమాల ద్వారానే చాలా మంది దర్శకులు ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని , మంచి పేరును తెచ్చుకుంటున్నారని గుర్తు చేశారు. ఇండస్ట్రీలో ఒడిదొడుకులు సహజమే అయినప్పటికీ, ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా మారకపోతే మనుగడ కష్టం. ఈ కష్టకాలాన్ని దాటడానికి చిన్న సినిమాలు, విభిన్నమైన కథాంశాలే ఏకైక మార్గమని చెప్పుకొచ్చాడు. దిల్ రాజు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ వ్యాప్తంగా తీవ్ర హాట్ టాపిక్‌గా మారాయి. ఇండస్ట్రీ అసలు పరిస్థితిని ఉన్నదున్నట్లుగా ధైర్యంగా మాట్లాడిన ఆయన నిజాయితీని పలువురు అభినందిస్తున్నారు.







