తమిళనాడు రాజకీయాలకు, సినిమా రంగానికి విడదీయరాని బంధం ఉంది. దశాబ్దాలుగా కోలీవుడ్ స్టార్ హీరోలు వెండితెరపైనే కాకుండా, రాజకీయ యవనికపైనా తమ ముద్ర వేస్తూ వస్తున్నారు. తాజాగా తమిళనాడు రాజకీయాల్లో కోలీవుడ్ దళపతి విజయ్ సృష్టించిన సంచలన విజయం... ఇప్పుడు ద్రవిడ రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేసింది. రాజకీయాల్లోకి ప్రవేశించిన తొలిసారే ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి, విజయ్ సరికొత్త చరిత్ర సృష్టించారు. కమల్ హాసన్ వంటి మహామహులకే సాధ్యం కాని ఈ రాజకీయ అద్భుతాన్ని విజయ్ సాకారం చేయడంతో, ఇప్పుడు కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ అటువైపు అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ అసాధారణ విజయ ప్రస్థానం ఇప్పుడు తమిళనాట సరికొత్త పొలిటికల్ ట్రెండ్‌కు తెరలేపింది.
ఈ క్రమంలోనే కోలీవుడ్ విలక్షణ నటుడు, నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్ కూడా త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారనే ప్రచారం తమిళనాట జోరుగా సాగుతోంది. వెండితెరపై తన అద్భుత నటనతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న ధనుష్, ఇప్పుడు ప్రజాసేవ వైపు అడుగులు వేస్తున్నారా అనే ప్రశ్న అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. దళపతి విజయ్ సాధించిన ఘనవిజయం ఇచ్చిన స్పూర్తితో ధనుష్ సైతం పొలిటికల్ ఎంట్రీకి గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసుకుంటున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో గట్టి చర్చ నడుస్తోంది.
తాజాగా ధనుష్ అభిమాన సంఘం ఆల్ ఇండియా ధనుష్ ఫ్యాన్స్ క్లబ్ నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఒక అధికారిక జెండాను ఆవిష్కరించడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ జెండా ఆవిష్కరణ కేవలం ఒక సాధారణ అభిమాన సంఘం కార్యక్రమంలా కాకుండా, పక్కా రాజకీయ అజెండాతో కూడిన కార్యక్రమంలా సాగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. కేవలం జెండా రూపకల్పనకే పరిమితం కాకుండా, తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా 38 జిల్లాల్లో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని, పేదలకు సహాయం అందించాలని అభిమాన సంఘాల కీలక నేతలకు పిలుపునిచ్చారు. ఇది పక్కా పొలిటికల్ స్కెచ్‌తోనే జరుగుతోందని, భవిష్యత్తులో రాజకీయ పార్టీగా మారేందుకు ఇదొక తొలి అడుగు అని రాజకీయ విశ్లేషకులు గట్టిగా విశ్వసిస్తున్నారు.
ముఖ్యమంత్రి విజయ్ బాటలోనే ధనుష్ కూడా ఇప్పుటి నుంచే క్షేత్రస్థాయిలో బలమైన పునాదిని సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. రాబోయే సార్వత్రిక ఎన్నికల సమయానికి పూర్తి ప్రణాళికతో, స్పష్టమైన పొలిటికల్ మేనిఫెస్టోతో పక్కాగా బరిలోకి దిగేందుకు ధనుష్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉంటూనే, మరోవైపు అభిమానులను సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేలా ప్రోత్సహించడం ఈ వ్యూహంలో భాగమేనని అంటున్నారు.
మరోవైపు, తన పొలిటికల్ ఎంట్రీపై సోషల్ మీడియాలో, ప్రధాన రాజకీయ వర్గాల్లో ఇంత పెద్ద ఎత్తున ఊహాగానాలు వస్తున్నప్పటికీ... హీరో ధనుష్ వైపు నుంచి గానీ, ఆయన పీఆర్ టీమ్ నుంచి గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడం గమనార్హం. ఈ మౌనం మరింత అనుమానాలకు, ఉత్కంఠకు దారితీస్తోంది. జెండా ఆవిష్కరణతో మొదలైన ఈ సరికొత్త ప్రస్థానం భవిష్యత్తులో తమిళనాడు రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలకు దారితీస్తుందో చూడాలి.
Dhanush, Tamil Nadu, Thalapathy Vijay, Kollywood stars





